1, ఆగస్టు 2007, బుధవారం

Q image ఎలా ఉపయోగించాలి ?



ఫోటోగ్రఫి రంగంలో ఉన్నవారు కస్టమర్లకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను ప్రింటర్ ద్వారా తీసి ఇవ్వవలసి వచ్చినప్పుడు పేజ్‌మేకర్, వర్డ్ వంటి డాక్యుమెంట్లలో ఒకే ఫొటోని పేజీలో వీలైనన్ని కాపీలు వచ్చేటట్లు అమర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే Qimage సాప్ట్ వేర్ మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే వివిధ సైజ్‌లు గల పేజీల్లో మీకు నచ్చిన విధంగా ఫోటోలను పలు కాపీలు అమర్చుకోవడమే కాకుండా అవసరం అయితే Noise filtering, red-eye removal, rotation వంటి ఎడిటింగ్ టూల్స్‌ని సైతం ఫోటోషాప్ వంటి సాఫ్ట్‌వేర్ల జోలికి వెళ్ళకుండానే నేరుగా Qimage లో అప్లై చేసుకోవచ్చు. పలు ఫైల్‌టైప్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది.


ఒకే సైజ్‌లో పలు ఇమేజ్‌లను ప్రింట్ చేయడం...

మెయిన్ విండో పైభాగంలో ఉండే Optimal అనే బటన్‌ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయడంవల్ల Qimage పేపర్లో సాధ్యమైనంత ఎక్కువ ఫోటోలు పట్టేటట్లు జాగ్రత్త తీసుకుంటుంది. మెయిన్ విండోలో కుడిచేతివైపు Prints panelలో ఉండే Image Fitting అనే బటన్‌ని క్లిక్ చేయండి. సరైన ప్రింట్‌సైజ్‌లు పొందటానికి పేజీలోని కొన్ని ఇమేజ్‌లను క్రాప్ చెయ్యమని ఈ బటన్‌ని ప్రెస్ చేయడం ద్వారా చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ పైభాగంలో Select Folder అనే బటన్‌ని క్లిక్ చేసి మీ ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌ని ఎంచుకోండి. వెంటనే క్రిందిభాగంలో ఆ ఫోల్డర్‌లోని ఇమేజ్‌ల ధంబ్‌నెయిల్స్ ప్రత్యక్షమవుతాయి. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఫోటోల్ని సెలెక్ట్ చేసుకుని కుడిచేతివైపు Prints అనే ప్రదేశం వద్ద 4.00x6.00 అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఒక వేళ మీరు కావాలంటే వేరే సైజ్‌నీ ఎంచుకోవచ్చు. దీనితో ప్రివ్యూ ప్రదేశంలో పేజీలో ఇమేజ్‌లు వరుసగా అమర్చబడి కనిపిస్తాయి. ఇప్పుడు చివరిగా Sort Prints అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ ప్రింట్ అయిన తర్వాత పేపర్ నుండి వేర్వేరు ప్రింట్‌ల్ని కట్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా ఏర్పాటు చేస్తుంది. చివరిగా టూల్‌బార్‌పై Print బటన్ క్లిక్ చేయాలి.



వేర్వేరు సైజ్‌ల్లో వేర్వేరు ఫోటోలను అమర్చుకోవడానికి..

ఇప్పుడు మనం 7x5, 5x3, 3x2 అనే మూడు వేర్వేరు సైజ్‌ల్లో వేర్వేరు ఇమేజ్‌లను Qimage ద్వారా ఒకే పేజీలో అమర్చుకోవడం ఎలాగో చూద్దాం. పైన చెప్పిన మాదిరిగానే Optimal అనే బటన్‌ని ముందు క్లిక్ చేయండి. అలాగే Prints Panel లోని Image Fitting అనే బటన్‌ని సైతం క్లిక్ చేయండి. ఇప్పుడు Select Folder బటన్ ద్వారా మీ సిస్టమ్‌లో ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌ని బ్రౌజ్ చేయండి. ఇప్పుడు ముందుగా 7x5 సైజ్‌లో అమర్చదలుచుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాని థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకుని కుడిచేతివైపు print panelలో 5x7 అనే బటన్‌ని క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ ప్రివ్యూ బాక్స్‌లో పైభాగంలో దర్శనమిస్తుంది. ఇప్పుడు 5x3గా అమర్చదల్చుకున్న ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుని 3x5 అనే బటన్‌ని క్లిక్ చేస్తే రెండవ ఇమేజ్ కూడా ప్రివ్యూ పేజీలోకి వచ్చి చేరుతుంది. ఇక చివరిగా 3x2 సైజ్‌లో అమర్చదలుచుకున్న ఇమేజ్ ధంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకుని print panel లో 2x3 అనే బటన్‌ని క్లిక్ చేస్తే మూడవ ఇమేజ్ కూడా ప్రివ్యూలోకి వస్తుంది. ఇప్పుడు sort prints బటన్‌ని క్లిక్ చేసి చివరిగా print బటన్‌ని క్లిక్ చేస్తే డిఫాల్ట్ ప్రింటర్ నుండి ఆ ఫోటోలు పేపర్‌పై ప్రింట్ చెయ్యబడుతాయి.



ఒకే ఇమేజ్‌ని వేర్వేరు సైజ్‌ల్లో అమర్చుకోవడానికి...



మొట్టమొదట prints ప్యానెల్‌లోని image fitting బటన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు Select Folder ద్వారా ఇమేజ్‌లు ఉన్న ఫోల్డర్‌లోకి వెళ్ళి క్రింద కనిపించే థంబ్‌నెయిల్స్ నుండి ప్రస్తుతం మీరు వేర్వేరు సైజ్‌ల్లో ఎ ఫోటోనైతే అమర్చదలుచుకున్నారో ఆ ఇమేజ్‌ని డబుల్‌క్లిక్ చేస్తే అది క్యూ పేజీలోకి వచ్చి చేరుతుంది. ఇప్పుడు ప్రివ్యూ బాక్స్‌లో కనిపించే ఆ ఇమేజ్‌ని డబుల్ క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ పెద్దదిగా కనిపిస్తూ కుడిచేతివైపు Adjust, levels వంటి టాబ్‌లు కలిగిన ప్యానెల్ ఒకటి ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు ఆ ప్యానెల్‌లో Image effects క్రింద కనిపించే Crop Wizard అనే బటన్‌ని క్లిక్ చేయండి. వెంటనే స్క్రీన్‌పై Crop Wizard పేరిట ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమై వేర్వేరు సైజ్‌లు కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ ఇమేజ్‌ని ప్రింట్ చేయదలుచుకున్నప్పుడు మనం ఏయే సైజ్‌లలో ప్రింట్ చెయ్యదలుచుకున్నామో ఆయా సైజ్‌లను టిక్ చేసి పెట్టండి. అదే విండోలో పస్తుతం మనం ఎడిట్ చేస్తున్న ఇమేజ్‌కి Landscape, Portrait Cropping లో ఏది సూటబుల్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఇమేజ్‌ని చూస్తే ఏ తరహ క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నది మనకే అర్ధమవుతుంది. అలాగే ఇమేజ్‌లోని Top/Bottom, Left/Right అంచులలో ఏవి మనకు ముఖ్యమైనవో అదే డైలాగ్‌బాక్స్‌లో క్రింది భాగంలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా డైలాగ్‌బాక్స్‌లో కనిపించే Done అనే బటన్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం Crop Wizard డైలాగ్‌బాక్స్‌లో సెలెక్ట్ చేసుకున్న సైజ్‌లలో ఆ ఇమేజ్ ప్రింట్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: