14, ఆగస్టు 2007, మంగళవారం

CDలు ఎలా పని చేస్తాయంటే..


1.22mm మందం కలిగిన ప్లాస్టిక్ ముక్కగా సిడిని పరిగణించవచ్చు. Polycarbonate ప్లాస్టిక్‌తో సిడిలను తయారుచేస్తారు. తయారీ దశలో ఆ ప్లాస్టిక్‌ పై పల్చని రిఫ్లెక్ట్ అయ్యే అల్యూమినియం పొరని అమర్చుతారు. ఆ అల్యూమినియం పొరను కాపాడడానికి దానిపై మరో పల్చని Acrylic పొరని పొందుపరుస్తారు. చివరిగా దానిపై కంపెనీ లేబుల్‌ని ప్రింట్ చేస్తారు. లోపలి నుండి బయటకు వంపులుగా అమర్చబడి ఉన్న ఒకే ఒక ట్రాక్ సిడిపై పొందుపరచబడుతుంది. సిడిపై ఉండే ట్రాక్ 0.5 మైక్రాన్ల మందంతో (మైక్రాన్ అంటే మీటర్‌లో మిలియన్ వంతు అని అర్ధం) లోపలి వంపుకి దాని తర్వాత వచ్చే వంపుకి మధ్య 1.6 మైక్రాన్ల గ్యాప్‌ తో పొందుపరచబడి ఉంటుంది. ట్రాక్ నిర్మాణానికి ప్రాతినిధ్యం వహించే Polycarbonate ప్లాస్టిక్‌ పై ఉండే bumps 0.5 మైక్రాన్ల వెడల్పుతోనూ, కనీసం 0.83 మైక్రాన్ల నిడివితోనూ, 125 నానోమీటర్ల హైట్‌ని కలిగి ఉంటాయి. (మీటర్‌లో బిలియన్ భాగాన్ని నానోమీటరు అంటారు)

సిడిరామ్ డ్రైవ్ యొక్క లేజర్ సిడిని రీడ్ చేసే వైపు నుండి పరిగణిస్తే వీటిని bumps అంటారు. అదే సిడి పైభాగం నుండి పరిగణించేటప్పుడు వీటిని bumps అని కాకుండా pits అని పిలుస్తారు. ఇంత తక్కువ పరిమాణం కలిగిన bumps తో నిర్మితం కావడం వల్ల సిడిలోని ట్రాక్ చాలా నిడివి కలిగి ఉంటుంది. ఒక సిడిలోని ట్రాక్‌ని కనుక విడిగా తీసి తిన్నగా పరుచుకుంటూపోతే 5 కిలోమీటర్ల నిడివి కలిగి ఉంటుంది ఆ ట్రాక్. సిడిరామ్ డ్రైవ్ bumps రూపంలో సిడిపై పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని రీడ్ చేస్తుంది. సిడిరామ్ డ్రైవ్‌లో ఉండే Drive Motor మనం ఇన్‌సర్ట్ చేసిన డిస్క్‌ని నిముషానికి 200 నుండి 500 చుట్లు వేగంతో తిప్పుతుంది. సిడిరామ్ డ్రైవ్‌లోని లేజర్ మరియు లెన్స్‌లు సిడిలోని bumps పై దృష్టి కేంద్రీకరించి అందులోని డేటాని రీడ్ చేస్తాయి. ఇలా రీడ్ చేయబడిన డేటా , డేటాబ్లాక్‌లుగా కంప్యూటర్‌కి అందించబడుతుంది.

కామెంట్‌లు లేవు: