4, ఆగస్టు 2007, శనివారం

ఆటో రన్ వల్ల నష్టమే ఎక్కువ!


Windows XP, 9x ఆపరేటింగ్ సిస్టంలలో సిడి/డివిడి డ్రైవ్ లో సిడి/డివిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు వాటిలో ఉండే సమాచారం ఆటోమేటిక్ గా ఓపెన్ చేయబడే విధంగా Autorun సదుపాయం డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. వాస్తవంగా సిడి/డివిడి డ్రైవ్ ల Autorun వల్ల మనకు కలిగే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. ఈ సదుపాయం ఎనేబుల్ చేయబడి ఉన్నప్పుడు మనం సిడి డ్రైవ్ లో సిడిని పెట్టినా పెట్టకున్నా ఏవో కొంపలు ముంచుకుపోతున్నాయన్నట్లు ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి డ్రైవ్ వైపు దృష్టి మళ్లిస్తుంటుంది. అంటే ప్రతీ 5 సెకండ్లకోసారి విండోస్ ఆపరేటింగ్ సిస్టం సిడి/డివిడి డ్రైవ్ లను తనిఖీ చేయడానికే కొన్ని వనరుల్ని వినియోగిస్తుందన్న మాట. దీనివల్ల చాలా సూక్ష్మ పరిమాణంలో సిస్టం పనితీరు నెమ్మదిస్తుంది. ఇకపోతే Autorun.inf అనే ఫైల్ పొందుపరచబడి ఉన్నసిడిలను ఇన్ సర్ట్ చేసినప్పుడు మాత్రమే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని ఆటోరన్ సదుపాయం ఆ ఫైల్ని ఏక్టివేట్ చేసి అందులో పొందుపరచబడి ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సాధారణంగా మనం ఎక్కువగా autorun.inf ఫైల్ లేని మామూలు సిడిలనే ఇన్ సర్ట్ చేస్తుంటాం. Autorun సదుపాయం మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో డీఫాల్ట్ గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది కాబట్టి.. అలాంటి మామూలు సిడిలను సైతం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఎక్కడైనా Autorun.inf ఫైల్ ఉందేమోనని అన్వేషిస్తుంది. దీనివల్ల కూడా కొంతవరకూ పిసి పనితీరు క్షీణిస్తుంది. ఈ నేపధ్యంలో సిడి/డివిడిల ఆటోరన్ సదుపాయాన్ని డిసేబుల్ చేసుకోవడం ఉత్తమం. దీనికిగాను విండోస్ రిజిస్ట్రీని మోడిఫై చేయాలి. Start>Run కమాండ్ బాక్స్ల్ లో regedit అని టైప్ చేసి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రాం ని ఓపెన్ చేసి, అందులో HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\Services\CDRom అనే విభాగంలోకి వెళ్లి కుడి చేతి వైపు AutoRun అనే Dword వేల్యూని వెదికి పట్టుకుని దానిపై మౌస్ తో రైట్ క్లిక్ చేయడం ద్వారా Modify అనే ఆప్షన్ ని ఎంచుకోండి. ఇప్పుడు ఆ Dwordకి ఆల్రెడీ ఉన్న 1 అనే విలువ స్థానంలో 0 అనే విలువను ఇస్తే autorun డిసేబుల్ అవుతుంది.

2 కామెంట్‌లు:

గిరి Giri చెప్పారు...

చాలా బావున్నాయి మీరు రాస్తున్న విషయాలు..

అజ్ఞాత చెప్పారు...

గిరి గారూ,

మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్