29, డిసెంబర్ 2007, శనివారం

మీటింగ్ విశేషాలు, చిన్న వీడియో

కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం
డిసెంబర్ 24, మధ్యాహ్నం 3 గంటలు

హాజరైన పాఠకులు
1. సలీం భాషా
2. జి. చైతన్య
3. సి.హెచ్. సత్యనారాయణ
4. జి. శ్రీనివాస్
5. టి. నవీన్ రెడ్డి
6. ఎ. అభిరామ్
7. ఎం. మురళీధర్
8. పి. మౌర్య
9. ఎ. ఉమాశంకర్
10. జి.పి. జాకబ్
11. ఎం. నరేందర్ కుమార్
12. నల్లమోతు శ్రీధర్
13. మురళీధర్ గారి మిత్రులు పనిమీద ముందే వెళ్లిపోయారు, ఆయన పేరు జీవన్.


మొట్టమొదటిదే అయినా ఈ మీటింగ్ ఎంతో బాగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు అందరం కృష్ణకాంత్ పార్క్ టికెట్ గేట్ వద్ద జమకూడి లోపలికి ప్రవేశించాం. లోపలికి వెళ్లి కూర్చున్నాక మీటింగ్ యొక్క అజెండా జిరాక్స్ కాపీలను అందరికీ పంచడం జరిగింది. ఈ అజెండాలో చర్చించిన కొన్ని అంశాలు....

ఫోరమ్ కార్యకలాపాల విషయమై:జనవరి 2, 2008 నాటికి మన ఫోరంని ప్రారంభించి ఏడాది పూర్తవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫోరం ని మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశమై శ్రీనివాస్, మౌర్య, మురళీధర్, జాకబ్ గార్లు మంచి సలహాలు అందించారు. ఈ సందర్భంగానే కేవలం Thanks వంటి పోస్టుల సంఖ్యతో పోలిస్తే నిజంగా కంటెంట్ ఉన్న పోస్టుల సంఖ్య పెరగాలని దానిపై సభ్యుల సూచనలు కోరడం జరిగింది. సీరియస్ గా ఫోరంలో రోజుకు ఒకటి రెండు పోస్టులైనా కంటెంట్ తో కూడినవి చేస్తే ఫోరం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్ కి హాజరు అవని సభ్యులు కూడా దయచేసి.. కనీసం రోజుకి ఒక్క పావుగంట, అరగంటపాటైనా వెచ్చించి మన ఫోరంలో మరిన్ని మంచి పోస్టులు ప్రచురించడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.

ఇకపోతే ఫోరంలో కొత్త సభ్యులు తెలియక రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను ఎలా మోడరేట్ చేయాలి, కొత్త సభ్యులకు ఫోరంలో ఫలానా విధంగానే పోస్ట్ చేయాలని గైడ్ లైన్స్ ఎలా ఇవ్వాలి అన్న చర్చ జరిగింది. అందరికీ కన్పించే చోట రూల్స్ వంటివి పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాం. కానీ మనది ఉచిత ఫోరం అవడం వల్ల అన్ని పేజీల్లో కన్పించేలా వాటిని అమర్చడం వీలుపడదు. అందుకే ఇలాంటి గైడ్ లైన్స్ ని Sticky పోస్టులుగా ప్రచురిస్తున్నాం అని నేను వివరించడం జరిగింది. ఇకపోతే రాంగ్ సెక్షన్లలో చేసే పోస్టులను (ఉదా.కు.. సందేహాలను పాఠకుల సహకారం విభాగంలో పోస్ట్ చేయవలసింది పోయి పిసి టిప్స్ అనే విభాగంలో కొందరు పోస్ట్ చేస్తుంటారు) తిరిగి సరైన విభాగాల్లో మూవ్ చేయడానికి ఎవరో ఒక మోడరేటర్ పూర్తి బాధ్యతని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడడం జరిగింది. దయచేసి ప్రస్తుతం మోడరేటర్ హోదా కలిగిన వ్యక్తులలో ఈ బాధ్యతని (రాంగ్ పోస్టులను మూవ్ చేయడం, కొత్త సభ్యులను సరైన మార్గంలో నడిపించడం) ఎవరో ఒకరు స్వీకరిస్తే బాగుంటుంది. ఈ బాధ్యతని చేపట్టగల మోడరేటర్ ఈ పోస్ట్ క్రిందనే రిప్లై ఇవ్వగలరు.

అలాగే మనం ఇంత కష్టపడి ఓ టీమ్ స్పిరిట్ తో నడిపిస్తున్న ఫోరంని మరింత మంది దృష్టికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉందా అన్న చర్చ జరిగింది. ఫోరం ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్లని కేవలం పోస్టులను చదివి వెళ్లే ఫాలోయర్స్ గా కాకుండా తమకు తెలిసిన నాలెడ్జ్ ని సైతం పోస్ట్ చేసే లీడర్స్ గా వీలైనంత ఎక్కువమందిని మోటివేట్ చేయడం ఎలాగన్నది కొద్దిగా చర్చించాం. మీ సూచనలు కూడా ఇక్కడ తెలియజేయగలరు. ఇకపోతే ఫోరం లో మనం పోస్ట్ చేసే కంటెంట్ మరింత ఆకర్షణీయంగా కన్పించేలా స్ర్కీన్ షాట్లు, బోల్డ్, ఇటాలిక్ వంటి ఫాంట్ స్లైళ్లు, వివిధ కలర్స్ ని ఉపయోగించి రూపొందిస్తే బాగుంటుందని అనుకున్నాం. కొద్దిగా ఓపిక చేసుకుని మనం పోస్టులను ఇలా పబ్లిష్ చేస్తే ఫోరం అందరినీ ఆకట్టుకుంటుంది.

సాంకేతిక సహాయం కి సంబంధించి:
Team Viewer ద్వారా మనం ఇతరులకు అందించదలుకున్న టెక్నికల్ సపోర్ట్ విషయమై కొన్ని అంశాలు చర్చించడం జరిగింది. ఎవరు ఎప్పుడు ఆన్ లైన్ లో ఉంటున్నారు, ఎవరికి సహాయం అవసరం అవుతుంది అన్న కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బందిగా ఉంటుందని చెప్పాను. ఇదే విషయమై ఓ లేఖిని, కూడలి సృష్టికర్త వీవెన్ ప్రత్యేకమైన ఛాట్ రూమ్ ని మన కోసం తయారు చేయడానికి మన మీటింగ్ ముందు రోజే సుముఖత వ్యక్తపరిచారు. అదే విషయం నేను ప్రస్తావించాను. వీవెన్ చెప్పిన ప్రకారమే.. సరిగ్గా మీటింగ్ జరిగిన మరుసటి ఉదయమే... కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం పేరిట http://computerera.koodali.org/ అనే అడ్రస్ లో ఛాట్ రూం ప్రారంభమైంది. ఇందులో ఇప్పుడు చాలామంది ఇతరులకు సాయపడుతున్నారు, తమ నాలెడ్జ్ ని అప్ డేట్ చేసుకుంటున్నారు, అవసరమైతే టీమ్ వ్యూయర్ ద్వారా అవతలి వారి కంప్యూటర్లోకి ప్రవేశించి మరీ సమస్యని పరిష్కరించడం జరుగుతోంది. అలాగే టీమ్ వ్యూయర్ ద్వారా ఫలానా టైమ్ లో మేము సేవ చేయగలం అని మాట ఇచ్చిన వారు సాధ్యమైనంత వరకూ ఆయా సమయాల్లో (ఎప్పుడైనా కుదరకపోతే ఫర్వాలేదనుకోండి) ఎవరున్నా లేకపోయినా ఛాట్ రూంలో గడిపితే బాగుంటుంది.


మేగజైన్ కి సంబంధించి:మన అన్ని పనులకూ పునాది లాంటి కంప్యూటర్ ఎరా మేగజైన్ రీడబులిటీని మరింత పెంచడం ఎలా అన్నది చర్చించాం. మౌత్ పబ్లిసిటీ ఒక్కటే మార్గమని నిర్ణయానికి వచ్చాం. ఇంకేమైనా సూచనలు ఉంటే తెలుపగలరు. అలాగే అందరికీ ఉపయోగపడుతుంది అనుకున్న కొత్త విషయాలు ఏమైనా (గతంలో ప్రచురించబడకపోతే) మేగజైన్ లో రాయడానికి ఎవరికైనా అవకాశం ఇస్తానని ప్రకటించాను. మీరైనా మంచి కంటెంట్ ఉంటే ప్రతీ పిసి యూజర్ కి ఉపయోగపడుతుందనుకుంటే ఒక్కసారి 9848227008 నెంబర్ లో ఉదయం 10 గం. నుండి సాయంత్రం 4 గం. లోపు నాకు కాల్ చేసి మాట్లాడగలరు.


ఇతరత్రా అంశాలు:
అన్ని ఊళ్లలోనూ అనేకమంది కంప్యూటర్ ఎరా పాఠకులు ఉన్నారు. వారందరూ ప్రతీ మీటింగ్ కి హైదరాబాద్ రావాలన్నా రాలేరు. అదే ఏ ఊళ్లో ఉన్న రీడర్స్ ఆ ఊళ్లో నెలకో, రెండు నెలలకోసారి చిన్న సమావేశం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా అన్న అంశం చర్చించాం. అలాగే మనం చేస్తున్న ఇలాంటి ప్రొడక్టివ్ కార్యకలాపాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మెయిన్ స్ర్టీమ్ మీడియా కవర్ చేసేలా తద్వారా పదిమందికీ నాలెడ్జ్ ని పంచాలన్న మన ఉద్యమం మరింత బలోపేతం అయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదీ చర్చించడం జరిగింది.

అప్పటికే చీకటి పడడం, ఊళ్లకు వెళ్లవలసిన సభ్యులు ఉండడం కారణంగా అజెండాలో మరికొన్ని అంశాలు ఉన్నప్పటికీ సమావేశాన్ని ముగించాం.

ఈ మీటింగ్ కి విశేషత ఏమంటే.. అభిరామ్ అనే సభ్యుడు గుంటూరు నుండి ప్రత్యేకంగా ఆరోజు ఉదయం బయల్దేరి సరిగ్గా మీటింగ్ టైమ్ కి వచ్చి, మీటింగ్ అయిపోయిన వెంటనే అసలు రిఫ్రెష్ అవడానికి సమయం లేకపోయినా వెంటనే తిరుగు ప్రయాణం అవడం చాలా బాధ అనిపించింది. ఇంత కమిట్ మెంట్ ఉన్నవారం అందరం ఒకచోట కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కదా! అలాగే మనందరికీ చిరపరిచితుడైన మౌర్య ప్రత్యేకంగా నెల్లూరు నుండి బస్ లో సీటు దొరకకపోయినా అలాగే రాత్రంతా ఇబ్బందిపడుతూ హాజరవడం! మీటింగ్ అయిపోయిన వెంటనే అదే రాత్రి తిరిగి ప్రయాణమవడం అతని చిత్తశుద్ధికి నిదర్శనం. నరేందర్ ఓ రెండు రోజులు ముందే సూర్యాపేట నుండి వచ్చి మీటింగ్ ముందురోజు వ్యక్తిగతంగా నన్ను కలిసి మీటింగ్ కి హాజరయ్యారు. సత్యనారాయణ గారు, మురళీధర్ గారు ఆఫీసుకు సెలవు పెట్టి మరీ మీటింగ్ కి వచ్చారు. సలీంభాషా, జీవన్, చైతన్య, జాకబ్, ఉమాశంకర్, శ్రీనివాస్, నవీన్ రెడ్డి తదితరులు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఈ మీటింగ్ ని వీలైనంత బాగా కవర్ చేద్దామని ఫొటోలు, ఆడియో రికార్డ్ చేశాం. ఆడియో ఫైల్ కరప్ట్ అవడం వల్ల 132MB నుండి కంప్రెస్ అవక నాలుగైదు రోజులు విసిగించింది. అభిరామ్ గారు ఇలాగైతే లాభం లేదని పనిగట్టుకుని మరీ దాన్ని ఫ్లాష్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసే పనిలో ఉన్నారు. అది రెడీ అయ్యాక ఇక్కడే లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఫొటోలు మెమరీ కార్డ్ కరప్ట్ అవడం వల్ల ఒక్క ఫొటో కూడా పొందలేకపోయాం. ఇక మిగిలిన ఏకైక చిన్న సెల్ ఫోన్ వీడియో క్లిప్ ని ఆల్రెడీ పోస్ట్ చేశాం, మీరూ చూసే ఉంటారు. చాలా ఆనందంగా, స్నేహితులం కలిసినట్లు జరిగిన ఈ మీటింగ్ చాలా మోటివేషన్ ని కలిగించింది.

తదుపరి మీటింగులు:

1. జనవరి 27 ఆదివారం సాయంత్రం 3 గంటలకు, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
2. ఫిబ్రవరి 24, ఆదివారం సాయంత్రం 3 గంటలకు (అదే ప్రదేశం వద్ద)


ఏ కారణం చేతైనా మొదటి మీటింగ్ కి హాజరు అవలేకపోయిన వారు వాటికైనా వీలుచేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ మీటింగ్ ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు..!

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
- కంప్యూటర్ ఎరా

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా ఒక ముడడుగు. ఇదే స్పిరిట్ తో ఈ ఫోరం ముందుకు నడచి అందరికీ ఆదర్శవంతంగా రూపుదిద్దుకుంటుందని కోరుకుంటున్నాను. ఈ స్పూర్థి తో నావంతు సేవ నేనూ చేస్తానని కమిట్ అవుతున్నాను.

అజ్ఞాత చెప్పారు...

not a good idea to leave e mail address in public domain that to in full format , not on dot com,

attracts lot of spam is it not

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారు, మీటింగ్ జయప్రదం అయినందుకు అభినందనలు. అలాగే సభ్యుల కమిట్ మెంట్ విలువకట్టలేనిది. ఈ సమాచారాన్ని చదివిన తర్వాత నేను మూడు సూచనలు చేయాలనుకుంటున్నాను.
1. మీటింగ్ సమయం 3గం.కు పెడితే స్థానికంగా ఉండే సభ్యులకు తప్పితే వేరే ఊళ్ళ నుంచి వచ్చే సభ్యులకు ఉరుకులు పరుగులతోనే సరిపోతుంది. అది వారి కంట్రిబ్యూషన్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది మార్చే అవకాశం ఉందేమో చూడండి.
2. ప్రెస్ క్లబ్ వారికి ముందు సమాచారం ఈ మీటింగ్ గురించి ఇస్తే ఔత్సాహికులు ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంటుంది.
౩. అలాగే ఒకటి లేదా రెండు బ్యానర్లు ((Flex)ఒకటి మీటింగ్ స్థలం వద్ద, రెండవది దగ్గరలోని కూడలి లో ప్రస్ఫుటంగా కనపదే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, కాని మంచి ఫలితాన్ని ఇస్తుంది. మన మెంబర్స్ లోనే ఎవరో ఒకరు లేదా కొద్ది మంది కలిసి దీనికి స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.

oremuna చెప్పారు...

శ్రీధర్ గారూ అబినందనలు హృదయపూర్వకంగా!

విధ్యుల్లేఖ చిరునామ ఇలా @ ఇచ్చి ఇవ్వడం క్షేమదాయకం కాదు @ బదులుగా at అనో లేక పోతే తెలుగులోనో వ్రాయండి.

Unknown చెప్పారు...

గిరిచంద్ గారూ ధన్యవాదాలు. అనానిమస్, ఒరెమూనా గారూ మీరన్నదీ నిజమే, ఆ ఆలోచన రాలేదు, వెంటనే తొలగిస్తున్నాను. చిలకపాటి శివరామప్రసాద్ గారూ మంచి సూచనలు చేశారు ధన్యవాదములు.
- నల్లమోతు శ్రీధర్