3, డిసెంబర్ 2007, సోమవారం

వీడియో మెమరీ గురించి తెలుసా?


మన సిస్టమ్ లోని డిస్ ప్లే కార్డ్ స్వయంగా లేదా మెయిన్ RAM నుండి షేర్ చేసుకునే మెమరీ పరిమాణాన్ని బట్టి మన పిసిలోని గ్రాఫిక్స్ పనితీరు నాణ్యత, వేగం ఆధారపడి ఉంటాయి. డిస్ ప్లే కార్డులపై పొందుపరచబడి ఉండే మెమరీని 'ఫ్రేమ్ బఫర్' అని కూడా పిలుస్తుంటారు. వీడియో మెమరీ అవసరం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. మనకు మోనిటర్ పై కన్పించే ప్రతీ అంశాన్నీ స్టోర్ చేసుకోగల కెపాసిటీ వీడియో మెమరీకి ఉండాలి. ఒక ఫొటోని మార్చిన వెంటనే లేదా ఒక సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసిన వెంటనే అప్పటి వరకూ స్క్రీన్ పై ఉన్న దృశ్యం మారిపోతుంది. ఇలా మారిపోయిన దృశ్యాన్ని మన పిసిలోని సిపియు వీడియో కార్డ్ కి చేరవేస్తుంది. వీడియో కార్డ్ పై ఉండే 'వీడియో ప్రాసెసర్' దాన్ని ప్రాసెస్ చేసి టెంపరరీగా ఫ్రేమ్ బఫర్ లో భద్రపరస్తుంది. ఇలా వీడియో ఫ్రేమ్ బఫర్లో నిల్వ చేయబడి ఉండే ఇమేజ్ లను భారీ బిట్ మ్యాప్ ఇమేజ్ లుగా ఊహించుకోవచ్చు. ఇలా నిరంతరం మనకు మోనిటర్ పై ప్రదర్శించబడవలసిన స్క్రీన్ ఇమేజ్ రిఫ్రెష్ చేయబడుతూ సరికొత్త ఫ్రేమ్ లు ఫ్రేమ్ బఫర్ లోకి వచ్చి చేరుతుంటాయి. ఈ నేపధ్యంలో వీడియో రామ్ గా పిలవబడే ఫ్రేమ్ బఫర్ తక్కువగా ఉంటే అది ఎక్కువ ఇమేజ్ లను స్టోర్ చేసుకోలేక స్క్రీన్ పై అంశాలన్నీ స్లో మోషన్ లో కదులుతూ మనకు అసౌకర్యాన్ని కలుగజేస్తుంటాయి. ఇప్పుడు వస్తున్న మదర్ బోర్డ్ లలో ఆన్ బోర్డ్ డిస్ ప్లే చిప్ లు సైతం మెయిన్ మెమరీ నుండి ఎక్కువ మొత్తంలో స్థలాన్ని వినియోగించుకుంటుండడం వల్ల ఈ తరహా ఇబ్బందులు పెద్దగా తలెత్తడం లేదు.

కామెంట్‌లు లేవు: