12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ - 7



విండోస్ రిజిస్ట్రీ టిప్స్
స్మాల్ థింగ్స్


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్ట్రి అనేది కీలకభూమిక వహిస్తుంది. చాలామందికి రిజిస్ట్రీ అనేది ఒకటి ఉంది అన్న విషయమే తెలియదు. అందులో ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అనేక కీలకమైన సెట్టింగులు పొందుపరచబడి ఉంటాయని కొద్దిమంది హార్డ్‌వేర్ టెక్నిషియన్లు, ప్రొఫెషనల్స్‌కి మాత్రమే ఆవగాహన ఉంటుంది. విండోస్ రిజిస్ట్రీ పూర్వాపరాలలోకి వెళితే విండోస్ 95 విడుదల అయిన తొలినాళ్ళలో మైక్రోసాఫ్ట్ సంస్థ రిజిస్ట్రీని ఆపరేటింగ్ సిస్టమ్‌లో అంతర్భాగం చేసింది. అప్పట్లో కేవలం వివిధ రకాల ఫైల్ టైప్‌లను ఆపరేటింగ్ సిస్టమ్‌లో నిక్షిప్తం చెయ్యడానికి మాత్రమే రిజిస్ట్రీ ఉద్దేశించబడింది. ఉదా... BMP ఫైల్ టైప్‌ని ఆరేటింగ్ సిస్టమ్‌లో రిజిస్టర్ చేయడంతో పాటు ఆ ఫైల్ టైప్‌కి చెందిన ఫైళ్ళని డీఫాల్ట్‌గా ఏ అప్లికేషన్ ప్రోగ్రామ్‌తో ఓపెన్ చెయ్యాలి అన్న అసోసియేషన్లు కూడా రిజిస్ట్రీలోనే పొందుపరచబడతాయి. ఇలా విండోస్ 95 ఆవిర్భవించిన తొలినాళ్ళలో కేవలం ఫైల్ అసోసియేషన్లు రిజిస్టర్ చెయ్యడానికి మాత్రమే పరిమితమైన విండోస్ రిజిస్ట్రీ తర్వాత కాలంలో మరింత పరిధిని పెంచుకుంది. విండోస్ 98 నుండి ఇటీవలి కాలంలో విడుదల అయిన విస్టా ఆపరేటింగ్ సిస్టమ్ వరకూ విండోస్ రిజిస్ట్రీ అత్యంత కీలకమైన భాగంగా విస్తరించింది. ఇప్పుడు రిజిస్ట్రీలో డెస్క్‌టాప్, టాస్క్‌బార్ ,స్టార్ట్‌మెనూ సెట్టింగులూ, కంట్రోల్ పేనల్, ప్రింటర్స్, మోడెమ్స్ వంటి అంశాల సెట్టింగులు, సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిన ఫాంట్లు, ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ సెట్టింగులు ఇలా అనేక అంశాలు రిజిస్ట్రీలో భద్రపరచబడుతున్నాయి. కేవలం ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అంశాలే కాకుండా మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకునే పేజ్‌మేకర్, ఫోటొషాప్, రియల్ ప్లేయర్, అక్రోబాట్ వంటి పలు థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు సైతం తమ అప్లికేషన్లకి సంబంధించిన అనేక కాన్ఫిగరేషన్ సెట్టింగులను రిజిస్ట్రీలో స్టోర్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రిజిస్ట్రీపై ఆవగాహన కలిగి ఉండి కొద్దిపాటి చిన్న చిన్న మార్పులను చెయ్యడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్వరూపాన్నీ, అప్లికేషన్ ప్రోగ్రాముల పనితీరునూ మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అసలు రిజిస్ట్రీ అంటే ఏమిటి, దానిని ఎలా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్‌కి పూనుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రిజిస్ట్రీ ఎడిటింగ్‌లో పొరబాట్లు జరిగితే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి వంటి ప్రాధమికమైన అంశాలను చర్చించడంతోపాటు రిజిస్ట్రీలో చేయదగ్గ పలురకాల మార్పుల గురించి ఈ పుస్తకంలో వివరంగా చర్చించడం జరిగింది. అలాగే ప్రతీ కంప్యూటర్ యూజర్‌కి వివిధ సందర్భాల్లో ఉపకరించే పలు సూచనలను ఇదే పుస్తకంలో "స్మాల్ థింగ్స్" అనే విభాగం క్రింద చర్చించడం జరిగింది. కంప్యూటర్ ఉన్న ప్రతీ వినియోగదారుడికీ ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోండి.

కామెంట్‌లు లేవు: