16, జులై 2007, సోమవారం

పవర్ సప్లై - నిజానిజాలు




230 Watts అని SMPS పై రాసి ఉంది కదా.. అంత ఓల్టేజీకి కంప్యూటర్లోని సున్నితమైన పరికరాలు తట్టుకుంటాయా? అని ఓ స్టూడెంట్‌కి సందేహం వచ్చింది. కాని SMPS ఉందే అందుకు అని చెప్పేసరికి ఆశ్చర్యపోవడం అతని వంతైంది! క్యాబినెట్ లోపల అమర్చబడి బయటి నుండి విద్యుత్ కేబుల్‌ని అమర్చడానికి వీలుగల చిన్నపాటి బాక్సే SMPS (Switching Mode Power Supply). విద్యుత్ లైన్ నుండి వచ్చే AC విద్యుత్‌ని తక్కువ ఓల్టేజీలతో కూడిన DC పవర్‌గా SMPS మారుస్తుంది.


విభిన్న భాగాలకు వేర్వేరు ఓల్టేజీలు

కంప్యూటర్‌లోని వేర్వేరు భాగాలకు వేర్వేరు మొత్తాలలో విద్యుత్ అవసరం అవుతుంటుంది. సహజంగా SMPS 3.3, 5, 12 volts అనే మూడు పరిమాణాల్లో DC ఔట్‌పుట్‌ని ఇస్తుంటుంది. డిజిటల్ కంప్యూటర్‌లోని డిజిటల్ సర్క్యూట్లు 3.3 volts, 5 volts విద్యుత్‌ని వినియోగించుకుంటుండగా హార్డ్‌డిస్క్, డివిడి డ్రైవ్‌ల వంటి వాటిలోని మోటార్లు, కూలింగ్ ఫ్యాన్‌లోని మోటార్లు నడవడానికి 12 volts విద్యుత్ అవసరం అవుతుంటుంది.


పిసి ఆఫ్ ,ఆన్ ఎలా అవుతుంటుందంటే...

మనం కంప్యూటర్‌ని ఆఫ్ చేయాలంటే సింపుల్‌గా Start>Shut down మెనూలో ఆప్షన్‌ని ఎంచుకుంటున్నాం. వెంటనే అది ఆఫ్ అయిపోతుంది. అలాగే పిసి ఆన్ చేయాలన్నా క్యాబినెట్‌పై ఓ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతోందంటే.. Start>Shutdown ఆప్షన్‌ని ఎంచుకున్నప్పుడు మనం వాడుతున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టం అన్ని ప్రోగ్రాముల్ని క్లోజ్‌ చేసిన తర్వాత Power Supplyకి సిగ్నల్ పంపిస్తుంది.దానితో మదర్ బోర్డ్‌పై ఉండే పవర్ మేనేజిమెంట్ చిప్ కంప్యూటర్ భాగాలకు విద్యుత్ నిలబడిపోయేలా ఆదేశాలు పంపిస్తుంది.ఇకపోతేం మనం కంప్యూటర్ ఆన్ చేయాలనుకున్నపుడు క్యాబినెట్‌పై ఉండే పవర్ బటన్‌ని క్లిక్ చేయగానే ఓ 5volts సిగ్నల్ పవర్‌సప్లైకి పంపించబడి పిసిలోని అన్ని భాగాలకు పవర్‌సప్లై జరుపబడుతుంది.




పవర్‌సప్లై ఎలా పని చేస్తుంటుంది...


1980వ సంవత్సరానికి పూర్వం పవర్‌సప్లై యూనిట్లు భారీగా ఉండేవి. 220 Watts AC విద్యుత్‌ని 12 volts DC విద్యుత్‌గా మార్చడానికి భారీ పరిమాణం కలిగిన ట్రాన్స్ఫార్మర్లు, కెపాసిటర్లు అవసరం అయ్యేవి. ప్రస్తుతం వాడబడుతున్న పవర్‌సప్లై యూనిట్లు 60 Hertz కరెంట్‌ని సెకనుకి మరిన్ని ఎక్కువ cycles నడిచే ఎక్కువ ఫ్రీక్వెన్సీకి మార్చగలుగుతున్నాయి. దీనివల్ల 220 volts విద్యుత్‌ని పిసిలోని విడి భాగాల అవసరాలకు అనుగుణంగా 3.3, 5, 12 volts మేరకు గణనీయంగా తగ్గించడానికి కేవలం చిన్నపాటి ట్రాన్స్‌ఫార్మర్లే సరిపోయేటంతగా పరిస్థితులు మారిపోయాయి. ఇవాళ మనం చిన్న క్యాబినెట్లతో కూడిన సిస్టంలను వాడగలుగుతున్నామంటే SMPS లోని ట్రాన్స్‌ఫార్మర్ల, కెపాసిటర్ల సైజ్ తగ్గడమే కారణం. అలాగే SMPS లోని ట్రాన్సిస్టర్లు, హై ఫ్రీక్వెన్సీ AC విద్యుత్‌ని ట్రాన్స్‌ఫార్మర్లకు అందించడం వల్ల ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గుల వల్ల పిసిలోని సున్నితమైన భాగాలు దెబ్బ తినకుండా సరిచేయడం వీలవుతోంది. ఇకపోతే తనకు అవసరం అయినంత మేరకు మాత్రమే SMPS మెయిన్ AC లైన్ నుండి విద్యుత్‌ని గ్రహిస్తుంటుంది. SMPSలో ఓ లేబుల్‌పై అది ఇన్‌పుట్‌గా ఎంత కరెంట్‌ని తీసుకుంటూంది, ఏయే పరిమాణాల్లో ఔట్‌పుట్ ఓల్టేజ్‌ని అందిస్తున్నదని వివరంగా రాయబడి ఉంటుంది.


మనకు అవసరం అయ్యే విద్యుత్ పరిమాణం


ప్రస్తుతం 400 watts SMPSలు వినియోగంలో ఉన్నాయి. వాస్తవానికి రకరకాల PCI కార్డ్‌లూ, పవర్‌ఫుల్ గ్రాఫిక్‌కార్డ్ వంటివి వాడితే తప్ప సాధారణ పరిస్థితుల్లో 250 Watts మించి ప్రస్తుతం మనం వాడుతున్న P4 Core 2 Duo సిస్టంలలో అవసరం ఉండదు. AGP card 20-30 Watts, PCI card 5 Watts, Floppy 5 W, LAN Card 4 W, CD-ROM Drive 10-25, 128 MB RAM 10 W, Hard Disk 5-15 W, Motherboard 20-30 Watts (CPU, RAM లను మినహాయించి) మొత్తంలో విద్యుత్‌ని వినియోగించుకోవడం జరుగుతుంది.

కామెంట్‌లు లేవు: