31, మార్చి 2008, సోమవారం

మార్చి 30వ తేదీ సమావేశ నివేదిక

స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్

హాజరైన సభ్యులు:
1. శ్రీనివాస్ (mr.Srinu ఐడితో వస్తుంటారు), మన సైట్ నిర్వహణలో ముఖ్య పాత్రధారి.
2. రుచిర శ్రీనివాస్ (ఛాదర్ ఘాట్)
3. వి. రంజన్
4. బి. పట్టాభిరాం
5. ఎస్. జాహ్నవి
6. ఎన్. విక్రమ్
7. ఎం. భాస్కర్
8. అనిల్ (వరంగల్ నుండి ఈ సమావేశం కోసమై వచ్చారు)
9. శ్రీధర్ పతి (గద్వాల నుండి హాజరయ్యారు)
10. నల్లమోతు శ్రీధర్
కిషోర్ నువ్వుశెట్టి గారు, మొగిలిచర్ల మురళీధర్ గారు.. మరికొంత మంది పనుల వత్తిడి వల్ల హాజరుకాలేకపోతున్నామని సమాచారం అందించారు.

సరిగ్గా సమావేశ సమయానికి కొద్దిపాటి చినుకులు ప్రారంభమవడంతో ఎప్పటిలా ఓపెన్ ప్లేస్ లో కూర్చోవడానికి సాహసించక చక్కని గూడుని ఎంచుకుని ఆశీనులమయ్యాం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ సమావేశానికి నలుగురైదుగురికి మించి హాజరు కారన్న భావనతో వెళ్లినా ఒకరొకరిగా వస్తూ పదిమంది వరకూ పోగయ్యాం. చాలా తక్కువమంది హాజరు అవుతారని ముందే అన్పించడం వల్ల పూర్వపు మీటింగులలా ప్రత్యేకమైన అజెండా అంటూ పాయింట్ వైజ్ గా డ్రాఫ్ట్ చేసుకోకుండానే ఈ సమావేశానికి వెళ్లడం జరిగింది. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సభ్యుల నుండి లభించిన ప్రోత్సాహం, పార్టిసిపేషన్, చక్కని సలహాలు చూసిన తర్వాత.. సభ్యుల రాశి తక్కువైనా వాసి తక్కువ లేదన్పించింది. చాలా ప్రొడక్టివ్ సలహాలు, సూచనలు వచ్చాయి.

final1

ఎడమ నుండి కుడికి.. రుచిర శ్రీనివాస్, విక్రమ్, శ్రీధర్ (గద్వాల), భాస్కర్, నల్లమోతు శ్రీధర్, గోరంట్ల శ్రీనివాస్, పట్టాభిరాం బొప్పన, అనిల్

ప్రధానంగా ఐ.టి. నాలెడ్జ్ ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజెయ్యడానికి మనం చేస్తున్న కార్యకలాపాల గురించి వివరంగా అన్ని ముఖ్యమైన లింకులతో సహా ఓ సమగ్రమైన అవగాహన కల్పించే డాక్యుమెంట్ ని రూపొందించి దానిని ఫోరంలో ఒక చోట అందరికీ అందుబాటులో ఉంచడం మంచిది అనే సూచన శ్రీనివాస్ అనే సభ్యుడి నుండి వచ్చింది. తద్వారా కొత్త వ్యక్తులకు మన సేవలను పరిచయం చెయ్యడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కసారి చదివించగలిగితే బెటర్ అనే చక్కని అభిప్రాయం కుదిరింది. కాలేజీ లైబ్రరీల వారు డిజిట్, చిప్ వంటి పుస్తకాలకు వందలాది రూపాయలు వెచ్చిస్తూ ఉంటారని ఒక్కసారి మన కంప్యూటర్ ఎరాని పరిచయం చేస్తే అంత కంటెంట్ ఉన్న పత్రికను వారు వదిలిపెట్టరని ఆ దిశగా ప్రయత్నాలు సాగించమని జాహ్నవి గారు, జి. శ్రీనివాస్ అనే సభ్యుల నుండి సూచనలు వచ్చాయి. దానికి గాను మన కంప్యూటర్ ఎరా యాజమాన్యం నుండి సానుకూల స్పందన కోసం ప్రయత్నిస్తాను.

ఎవరికి తెలిసిన నాలెడ్జ్ ని అది చిన్నవిషయమైనా, పెద్ద విషయమైనా ఫోరంలో ఓ ఐదు నిముషాలు వీలుచేసుకుని పోస్ట్ చేయమని హాజరైన సభ్యులందరికీ విన్నవించడం జరిగింది. అలాగే ఇంగ్లీషులో కూడా ఫోరం ప్రారంభించవచ్చు కదా అనే సూచనను రాజన్ గారు చేశారు. రెండు వేర్వేరు టెక్నికల్ ఫోరంలను రెండు భాషల్లో విభిన్నంగా నిర్వహించగలగడానికి ప్రధానంగా కమిటెడ్ సభ్యుల సహకారం చాలా అవసరం. మన టీమ్ మరింత విస్తరించిన తర్వాత కొంతమంది ఆంగ్ల ఫోరం బాధ్యతని చేపట్టడానికి అవకాశం ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది.  అలాగే రుచిర శ్రీనివాస్ గారు ఫోరంలో కొత్త ఉత్పత్తులకై ఒక విభాగాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. వివిధ ఉత్పత్తులు, వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్ల గురించి ఆయన అనర్గళంగా మాట్లాడడం, ఎక్కడెక్కడో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వద్దకు ప్రత్యేకంగా వెళ్లి బ్రోచర్లు కలెక్ట్ చేసుకురావడం అనేది ఆయన హాబీ. ఆయనతో మాట్లాడుతుంటే కంప్యూటర్ ఉత్పత్తుల పట్ల ఆయనకు గల నాలెడ్జ్ చాలామందికి ఉపయోగపడుతుంది అన్పిస్తోంది. అందుకే కొత్త ఉత్పత్తుల గురించి పోరంలో కొత్త విభాగాన్ని సృష్టించడానికి నిర్ణయించడం జరిగింది.

final2

 

ఈ సమావేశంలో అనూహ్యంగా చాలా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన సభ్యుల్లో జాహ్నవి గారు ఒకరు. తను ఇంజనీరింగ్ విద్యార్థిని కావడం వల్ల.. కాలేజీల్లో కంప్యూటర్ విద్యాబోధన ఎంత థీరిటికల్ గా సాగుతుందో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాలేజీల్లో లెక్చరర్లు Control Panel ఓపెన్ చేస్తే కంప్యూటర్ పాడవుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారని, అసలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయితే క్షణాల్లో వైరస్ వచ్చేస్తుందని భయపెట్టేస్తారని.. తాను, తన స్నేహితులు చదువుతున్న చాలా కాలేజీల్లో ఇదే తరహా వాతావరణం నెలకొని ఉందని.. ఈ నేపధ్యంలో ముందు స్టూడెంట్లలో సెమినార్ల ద్వారా అలాంటి భయాలను పారద్రోలవలసిన అవసరం ఉందని, లేదంటే ఐ.టి. ఫీల్డ్ లో మొక్కుబడి ఉద్యోగాలు చేసే బంట్రోతులుగానే మిగిలిపోతారు తప్ప ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదని అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. కేవలం సిలబస్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఐ.టి. ఆధారిత అవేర్ నెస్ ని అసలు పట్టించుకోని వైఖరి ఉన్న విద్యాసంస్థలు ఈ తరహా సెమినార్లకు ఎంతవరకూ సానుకూలంగా ఉంటాయన్నది ఆలోచించాలి, అలాగే మన ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. గద్వాల నుండి శ్రీధర్ గారు ఆ పట్టణంలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, డిటిపి సెంటర్, వెబ్ హోస్టింగ్ వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. ఆయన ఈ విషయమై స్పందిస్తూ కాలేజీలలో సెమినార్లు ప్రయత్నించడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లు మనకు బాగా సహకారం అందిస్తాయి కాబట్టి అక్కడికి వచ్చే విద్యార్థులకు అవేర్ నెస్ కల్పిస్తే మరింత బాగుంటుందని సూచించడం జరిగింది. ఒకవేళ కళాశాలల నుండి సరైన ప్రోత్సాహం లభించకపోతే ఈ ప్రత్యామ్నాయ మార్గంలోనైనా మన పని మనం చేసుకుంటూ వెళ్లవచ్చు. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే మొదటి కొద్దిరోజుల పాటు విద్యార్థులపై ఎలాంటి వత్తిడి లేకుండా ఖాళీగా ఉంటారని దానిని దృష్టిలో ఉంచుకుని ఆలోపు కాలేజీ యాజమాన్యాలతో చర్చించి సెమినార్లకు అనువైన సమయం నిర్ణయించుకుంటే బాగుంటుంది అని జాహ్నవి గారు సూచించారు. ఇక్కడ ఒక ఇబ్బంది నన్ను చాలారోజులుగా వేధిస్తోంది. ఒక కళాశాలలో సెమినార్ ఇచ్చేటప్పుడు కేవలం ఫీల్డ్ నాలెడ్జ్ లేని నేనొక్కడినే పార్టిసిపేట్ చెయ్యడం కన్నా వివిధ రంగాల్లో అనుభవం ఉండీ, ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న మిత్రులు పెద్ద మనసు చేసుకుని ఇలాంటి కార్యక్రమాల పట్ల ముందుకు వస్తే చాలామందికి అవేర్ నెస్ కల్పించినట్లు అవుతుంది, స్టూడెంట్ కి కావలసిన ప్రాపర్ గైడెన్స్ కూడా లభిస్తుంది. వివిధ ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న అనుభవజ్ఞులు దయచేసి ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.

SNAG-0002

ఇకపోతే ఈ కార్యకలాపాల నిర్వహణకు గాను ఆర్థిక పరమైన తోడ్పాటు ఏ విధంగా లభించినా బాగుణ్ణు అన్న ఆలోచన ఒకటి ప్రస్తావనకు వచ్చింది. దానికిగాను google adsense వంటి వాటితోపాటు స్థానికంగా ఉండే సంస్థల నుండి నామినల్ టారిఫ్ తో చిన్న చిన్న ప్రకటనలు సేకరించి ఫోరంలో, ఛాట్ లో ప్రచురిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చింది. ఆచరణలో సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి.

గత మీటింగులతో పోలిస్తే సరిగ్గా రెండు గంటల పాటు జరిగి త్వరగా ముగింపుకు వచ్చిన మీటింగ్ ఇది. ఆ రెండు గంటల వ్యవధిలోనూ చాలా మంచి సూచనలు వచ్చాయి. ఎవరివద్దా కెమెరా లేకపోవడంతో పట్టాభిరాం గారు అప్పటికప్పుడు వాళ్లబ్బాయికి ఫోన్ చేసి ఇంటి నుండి కెమెరా తెప్పించి ఫొటోలు తీయించడం విశేషం. అదీగాక గత మీటింగ్ నుండి ఆయన కృష్ణకాంత్ పార్క్ లో టికెట్ తీసుకునే ఎంట్రెన్స్ గేట్ వద్ద మీటింగ్ ఎక్కడ జరుగుతుందో కన్ ఫ్యూజ్ అయ్యే కొత్తవారిని గైడ్ చేసేలా బానర్ ఏర్పాటు చెయ్యడం వంటి అనేక విషయాల్లో సహకారం అందిస్తున్నారు. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన శ్రీధర్ (గద్వాల) గారికి, అనిల్ (వరంగల్) గారికి, సామాజిక వేత్త విక్రమ్ గారికి, విలువైన సూచనలు చేసిన జాహ్నవి గారికి, భాస్కర్, రాజన్, రుచిర శ్రీనివాస్, జి. శ్రీనివాస్ గార్లకు ధన్యవాదాలు.

కొసమెరుపు: మీటింగ్ జరిగిన రాత్రి 12 దాటకముందే రిపోర్ట్ రాయటమన్నది నేను అనుసరించే పద్ధతి. కానీ రాత్రి మీటింగ్ నుండి ఇంకా ఇంటికి చేరకముందే మన సర్వర్ డౌన్ అయినట్లు మెసేజ్ వస్తోందని మిత్రులు ఫోన్ చేయడం, అప్పటికప్పుడు సర్వర్ అప్ అయ్యేలా హోస్టింగ్ వాళ్లతో కమ్యూనికేట్ చేయడం, వారి సూచనలు అమలుపరచడానికి రాత్రి 2.30 గంటల వరకూ తెలియని వెబ్ టెక్నికల్ పారామీటర్ల గురించి మల్లగుల్లాలు పడడం వల్ల ఇంత ఆలస్యంగా రిపోర్ట్ రాయవలసి వచ్చింది.

తదుపరి హైదరాబాద్ పాఠకుల సమావేశం: ఏప్రిల్ 27, ఆదివారం, 2008న కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ వద్ద, మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది.

అలాగే ఏప్రిల్ 6వ తేదీన విజయవాడలో కంప్యూటర్ ఎరా పాఠకులు, తెలుగు బ్లాగర్ల సంయుక్త సమావేశం జరుగుతుంది. వివరాలకు: 9866369288 నెంబర్ లో సంప్రదించగలరు.

గణాంకాలు: మనం అందరం టీమ్ వర్క్ గా నిర్వహిస్తున్న ఫోరం, ఛాట్ రూమ్ లు జనవరి 5, 2008న ప్రారంభమైన రోజున Alexa ర్యాంకింగ్ లో 70 లక్షలకు పైబడి ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సైట్ Alexa ర్యాంక్ మూడు నెలల కాలంలో 5,75,645కి చేరింది. అలాగే భారతీయ సైట్లలో 9,234 ర్యాకింగ్ తో మొదటి 10వేల సైట్ల సరసన చేరింది. అలాగే మూడు నెలల కాలంలో ఫోరంలో 1819 మంది సభ్యులు చేరారు, 1017 టాపిక్ లు, 1766 పోస్టులు చేయబడ్డాయి. అధికశాతం తెలుగులోనూ, ఆకర్షణీయంగా స్ర్కీన్ షాట్లతోనూ రూపొందించబడిన పోస్టులే! అలాగే సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ద్వారా ఇంతవరకూ 650కి పైగా జెన్యూన్ సొల్యూషన్లు అందించబడ్డాయి. సరైన నిపుణులు సమయానికి అందుబాటులో లేక అపరిష్కృతంగా ఛాట్ లో జరిగిన సంభాషణలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఐ.టి. నాలెడ్జ్ ఉన్న మిత్రులకు విన్నవించుకునేది ఒక్కటే దయచేసి కొద్ది సమయమైనా ఈ వేదికపై స్పెండ్ చేయండి. మీ నాలెడ్జ్ ఎంతోమందికి ఆసరాగా నిలుస్తుంది. గద్వాల నుండి వచ్చిన శ్రీధర్ గారు అంతదూరం నుండి రావడానికి ఒకటే కారణం చెప్పారు.. ఒకరోజు నైట్ వాళ్ల బ్రదర్ కి ఏదో టెక్నికల్ ప్రాబ్లెం ఉంటే మన ఛాట్ రూమ్ లో ఎవరో అప్పటికప్పుడు అతని సిస్టమ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించారట.. అంత జెన్యూన్ సర్వీస్ కి చాలా హాపీ ఫీల్ అయి ఎలాగైనా మన టీమ్ సభ్యులను కలవాలని ఈ ప్రాజెక్ట్ లో మేమూ భాగస్వాములం అవాలని అక్కడి నుండి వచ్చాం అని చెప్పారు. మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చిత్తశుద్దిగా ఎంతో కొంత సమయం చేసుకుంటూ వెళితే ఇలా ఎంతోమంది తామూ ఇందులో భాగస్వాములవుతారు. సో.. ఇది మనకు సంబంధించిన వ్యవహారం కాదు అని దులిపివేసుకుని వెళ్లకుండా దయచేసి హృదయమున్న మిత్రులందరూ తమవంతు సహకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో అందిస్తారని ఆశిస్తున్నాం.

- నల్లమోతు శ్రీధర్
31-3-2008, 12.09 AM.

30, మార్చి 2008, ఆదివారం

USB కీచైన్ డ్రైవ్‌లు

ఇప్పుడు చాలామంది జేబుల్లో GB ల కొద్ది మెమరీ తిరుగుతూ ఉంటోంది. ప్రతీ ఒక్కరూ 1, 2,4, 8 GB వంటి వేర్వేరు సామర్ధ్యాల్లోని USB మెమరీ స్టిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లాపీ డిస్క్‌లు, జిప్ డిస్క్‌లు, సిడిలు, డివిడిలు వంటి ఇతర పద్ధతుల కన్నా డేటాని సులభంగా ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కి తీసుకువెళ్ళడానికి ఈ USB మెమరి స్టిక్‌లు అనువుగా ఉంటున్నాయి. ఇతర అన్ని రకాల ఫ్లాష్ మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి రీడ్ చేయాలంటె Card Reader అనే ప్రత్యేకమైన పరికరం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. అయితే USB మెమరీ స్టిక్‌లకు ఈ ఇబ్బంది లేదు.

మన కంప్యూటర్ క్యాబినెట్‌పై ఉండే ఏ USB పోర్ట్ కైనా ఈ మెమరీ స్టిక్‌లను సులభంగా కనెక్ట్ చేసి అందులో ఉన్న సమాచారాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఏదైనా USB కీచైన్ డ్రైవ్‌ని మన కంప్యూటర్ యొక్క USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే మన హార్డ్ డిస్క్‌లోని వివిధ డ్రైవ్‌లు, సిడిరామ్, డివిడి డ్రైవ్‌లకు అదనంగా ప్రస్తుతం మనం కనెక్ట్ చేసిన USB డ్రైవ్‌కి కూడా ఓ డ్రైవ్ లెటర్ My Computer లో ప్రత్యేకంగా ప్రత్యక్షమవుతుంది. ఆ డ్రైవ్ లెటర్‌ని క్లిక్ చేయడం ద్వారా ఆ USB మెమరీ స్టిక్‌లో ఉన్న సమాచారాన్ని మనం యాక్సెస్ చేయవచ్చు. ఈ తరహా మెమరీ స్టిక్‌ల డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ సెకనుకు 1MB ఉంటుంది. హార్డ్ డిస్క్‌లోని ఇతర డ్రైవ్‌లలో మాదిరిగానే ఈ USB మెమరీ స్టిక్‌లను కూడా ఫార్మేట్ చేయవచ్చు. ప్రస్తుతం 20GB వరకు వేర్వేరు స్టోరేజ్ కెపాసిటీ కలిగిన USB కీచైన్ డ్రైవ్‌లు మార్కెట్లో లభిస్తున్నాయి.

అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..


ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్ చేయగలిగేలా, ఇతర వెబ్‌సైట్ల నుండి రన్ అయ్యే స్క్రిప్ట్‌లు, ActiveX కంట్రోళ్ళు నిలుపుదల చేయబడేలా No Script అనే add-on లభిస్తుంది.

ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి

మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipic అనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం కదా! దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వెబ్‌సైట్ ప్రతీ టాపిక్‌ని ఫోటోలను చూపించడం ద్వారా సులభంగా అర్ధమయ్యేలా నేర్పిస్తోంది. Access, Excel, Publisher, Word, PowerPoint, Impress, Dreamweaver, HTML & CSS, Photoshop Elements, Fireworks, MySQL, PHP Basics, Perl Basic వంటి అనేక సబ్జెక్టులను నేర్పిస్తోంది.

ఈరోజే రీడర్స్ మీటింగ్, తప్పక హాజరు కాగలరు

ప్రియమైన మిత్రులకు.. ఈరోజు (ఆదివారం 30వతేదీ) మధ్యాహ్నం ౩ గంటలకు పాఠకుల సమావేశం జరుగుతుంది. హైదరాబాద్ యూసఫ్ గూడ బస్తీ వద్ద ఉన్న (అమీర్ పేట సారధి స్టూడియో నుండి హైటెక్ సిటీ వెళ్లే రూట్ లో) కృష్ణకాంత్ పార్క్ లో సమావేశమవుదాం. అలాగే సమావేశ స్థలానికి రావడం విషయంలో ఏవైనా సందేహాలుంటే 9848227008 నెంబర్ లో సంప్రదించగలరు. ౩ గంటల నుండి 5.30 గంటల వరకూ సమావేశం జరుగుతుంది. నలుగురైదుగురు వచ్చినా సమావేశం జరుగుతుంది. మంచి ఉద్దేశాలు కలిగిన వ్యక్తులు ఒకచోట కలవడమే ప్రధాన ఉద్దేశ్యం తప్ప ఎంతమంది హాజరవుతారు అన్నది కాదు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఈరోజు సాయంత్రం 3 గంటలకు కృష్ణకాంత్ పార్క్ టికెట్ తీసుకునే మెయిన్ గేట్ వద్ద గుమికూడి అందరం ఒకేసారి లోపలికి వెళదాం.

- నల్లమోతు శ్రీధర్

ఎడిటర్

కంప్యూటర్ ఎరా

29, మార్చి 2008, శనివారం

Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?


ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా

ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే

add-on ని వాడవచ్చు.

Acrobat లేకుండా PDFలను ఎడిట్ చేయాలా?




PDF ఫైళ్ళని ఓపెన్ చేసి చదవడానికైతే Acrobat Reader సరిపోతుంది. కానీ, ఆయా PDF ఫైళ్ళలొ ఏవైనా మార్పులు చేయాలంటే మాత్రం Adobe Acrobat Professional అనే సాఫ్ట్ వేర్ మన దగ్గర ఉండవలసి ఉంటూంది. దానికి ప్రత్యామ్నాయంగా PDFill PDF అనే సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని సాయంతో వేర్వేరు PDF ఫైళ్ళని ఒకే ఫైల్‌గా జత చేసుకోవచ్చు. PDF ఫైళ్లలోని పేజీల యొక్క వరుస క్రమాన్ని మార్చుకోవచ్చు. PDF ఫైళ్ళలోని పేజీలను రోటేట్, క్రాప్ చేసుకోవచ్చు. ప్రతీ పేజీకి మనకు నచ్చిన విధంగా Header మరియు Footer సమాచారాన్ని జత చేసుకోవచ్చు. అలాగే PDF ఫైళ్లలోని పేజీలను JPEG, BMP వంటి ఇమేజ్ ఫైల్ ఫార్మేట్లలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. నాలుగైదు పేజీలుగా ఉన్న డాక్యుమెంట్‌లోని సమాచారం మొత్తాన్ని ఒకే పేజీలో ఇమిడిపోయేలా reformat చేయవచ్చు. అలాగే PDF ఫైళ్ళకు వాటర్ మార్క్‌లను జత చేయవచ్చు. పలు ఆప్షన్లున్నాయి.

Welcome స్క్రీన్ చూపించబడకుండా ఉండాలంటే !


Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి Computer Configuration>Administrative Templates>System>Logon అనే విభాగంలోకి వెళ్ళి కుడిచేతి వైపు Dont display the Getting Started welcome screen at logon అనే ఆప్షన్‌ని మౌస్‌తో డబుల్ క్లిక్ చేసి Enabled గా సెట్ చేయండి. ఇకపై వెల్‌కమ్ స్క్రీన్ చూపించబడదు.

27, మార్చి 2008, గురువారం

Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..


సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే బటన్ క్లిక్ చేసి కుడిచేతి వైపు వెదకబడిన తర్వాత లభించే ఫైళ్ళపై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Download అనే ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఇలాంటి సాఫ్ట్ వేర్ల వల్ల అవతలి వ్యక్తుల సిస్టమ్‌లలో ఉన్న ఫైళ్ళతో పాటు వైరస్‌లు కూడా వచ్చేస్తాయి జాగ్రత్త.

PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on


మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక ప్రక్క మనం వేరే సైట్లను బ్రౌజింగ్ చేసుకుంటూనే PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయవలసిన వెబ్ పేజీల లింకుల్ని add చేసి పెడితే బ్యాక్ గ్రౌండ్‌లో అవన్నీ మనకు ఇబ్బంది కలిగించకుండా PDF ఫార్మేట్ లోకి కర్వర్ట్ చేయబడుతుంటాయి.

అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్



Nokia, Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ ఫోన్‍లోనే యాక్సెస్ చేయవచ్చు. ఆయా సర్వీసులలో మీకు గల స్నేహితులకు ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం Yahoo Messenger ని కూడా ఈ సాఫ్ట్ వేర్ సపోర్ట్ చేస్తుంది.

25, మార్చి 2008, మంగళవారం

ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..


ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లో about.config అనే కమాండ్ ద్వారా అనేక అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్‌ఫాక్స్ మరింత వేగంగా పనిచేసేటట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే అందులోని ఏ సెట్టింగులను ఎలా మార్చాలో అవగాహన లేని వారు సింపుల్‌గా FasterFox అనే add-on ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది simultaneous connections, pipelining, cache, DNS cache, initial paint delay వంటి పలు సెట్టింగులను మెరుగు పరచడం ద్వారా ఫైర్‌ఫాక్స్ పని తీరుని పెంచుతుంది.

DVD డిస్క్ లను బ్యాకప్ తీసుకోవడం ఎలా ?


సాధారణంగా వీడియో సిడిల్లోని వీడియో ఫైళ్ళని బ్యాకప్ తీసుకోవాలంటె సింపుల్‍గా MPEGAV అనే ఫోల్డర్‍లో గాని, లేదా సిడిలోని రూట్ ఫోల్డర్‍లోనే ఉండే .DAT ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍ని హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకుంటే సరిపోతుంది. లేదా సిడి రైటర్ ఉన్నట్లయితే Nero వంటి సిడిరైటింగ్ సాఫ్ట్ వేర్‍ని ఉపయోగించి ఓ ఖాళీ సిడిలోకి ఒరిజినల్ సిడిలోని వీడియో ఫైళ్ళని కాపీ చేసుకోవచ్చు. ఇదే విధంగా VCD ల్లో DAT ఫైల్‍లో వీడియో డేటా ఉన్నట్లే DVD డిస్క్ లలో VOB అనే ఎక్శ్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైల్‍లో డిజిటల్ ఫార్మేట్‍లో ఉన్న వీడియో డేటా స్టోర్ చేయబడి ఉంటుంది. అయితే DAT ఫైల్ మాదిరిగా ఈ ఒక్క ఫైల్‌ని హార్ద్ డిస్క్ లోకి కాపీ చేసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. DVD ల్లోని కంటెంట్ CSS ఎన్‌కోడ్ చేయబడి ఉంటుంది. ఈ కారణం వల్ల కేవలం VOB ఫైల్ వల్ల ఉపయోగం ఉండదు. దీనికి ప్రత్యామ్నాయంగా డివిడీల్లోని డేటాని బ్యాకప్ తీసుకోవడానికి DVD Decypter వంటి థర్డ్ పార్టీ ప్రోగ్రాములను ఆశ్రయించవలసి ఉంటుంది. ఇవి డిస్క్ లను బ్యాకప్ తీస్తాయి.

24, మార్చి 2008, సోమవారం

ముచ్చటైన తెలుగు వెబ్ సైట్


మాగంటి అనే వెబ్ సైట్ ని మాగంటి వంశీ మోహన్ అని ప్రవాస భారతీయుడు ప్రారంభించి అందులో సాహిత్యం, సంగీతం, జానపద గీతాలు, శతకాలు, చాటువులు, పిల్లల గీతాలు, స్తోత్రాలు, తెలుగు ప్రశస్తి, వ్యాసాలూ, ఆలయాల సమాచారం, కళలు, మొదలైన ఎన్నో విభాగాలలో అచ్చ తెలుగులో చక్కని ఉపయోగకరమైన సమాచారం మనకు అందిస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత అభిలాషతో లాభాపేక్ష లేకుండా నడుపుతున్న వెబ్ సైట్ ఇది.

ఫైర్ ఫాక్స్ స్క్రీన్ సేవర్ గా మారిపోతుంది..


కొద్దిసేపు ఎలాంటి వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా ఖాళీగా ఉన్నామనుకోండి. వెంటనే ఫైర్ ఫాక్స్ విండో మాయమై ఆకర్షణీయమైన చిత్రాలతో కూడిన స్క్రీన్ సేవర్ ప్రత్యక్షమయ్యేలా Fox Saver అనే add-on సయామ్తో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతేరొజూ కొత్త చిత్రాలు అప్ డేట్ చేయబడతాయి.

రోజువారి కార్యకలాపాలు రికార్డ్ చేసుకోవడానికి




వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ తమ్ అరోజువారీ కార్యకలాపాలను ముందుగానే నమోదు చేసి పెట్టుకోవడానికి ఉపయోగఫడే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామే My Personal Diary . ఇందులో మన రోజువారి నిర్వర్తించవలసిన కార్యకలాపాలను కొత్త ఎంట్రీలుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే...అవసరం అయినప్పుడు ఈ రోజు/వారం/నెలలో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

23, మార్చి 2008, ఆదివారం

విండోస్ XP టిప్స్….


Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏవైనా కొత్త సాఫ్ట్ వేర్లని సరిగ్గా పని చెస్తాయో లేదో తెలియని డివైజ్ డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకునే ముందు Accessories>System Tools ప్రోగ్రామ్ ఫోల్డర్‌లో ఉండే System Restore అనే ఆప్షన్‌ని ఉపయోగించి ఒక Restore Point ని క్రియేట్ చేసుకోవడం మంచిది.

మీవద్ద Bootable WinXP సిడి లేదా? అయితే మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో లభించే ఓ టూల్‌ని ఉపయోగించి XP బూటబుల్ ఫ్లాపీలను క్రియేట్ చేసుకోవచ్చు. XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్న సమయంలో Setup ముందుకు సాగకుండా ఫ్రీజ్ అయిపోయినట్లయితే మీ సిస్టమ్‌లో PCI స్లాట్లపై అమర్చబడి ఉన్న మోడెమ్, టివి ట్యూనర్ కార్డ్, నెట్‌వర్క్ అడాప్టర్ వంటి కార్డులను తొలగించి Setup రన్ చేసి చూడండి. ఇన్‌స్టలేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఆ కార్డ్ లను తిరిగి అమర్చుకుని ఫ్రెష్‌గా వాటి డ్రైవర్లని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.


Windows XP Professional తో పాటు డీఫాల్ట్ గా Backup యుటిలిటీ ఇన్‌స్టాల్ అయిపోతుంది. అయితే XP Home ఎడిషన్ యూజర్లు మాత్రం Windows Backup టూల్ కావాలనుకుంటే.. XP ఇన్‌స్టలేషన్ సిడిలో valudeadd\msft\ntbackup\ntbackup.msiఅనే ఫైల్‌ని వెదికిపట్టుకుని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే బ్యాకప్ యుటిలిటీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యబడుతుంది. XP ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైళ్ళు, సెట్టింగులను యధాతధంగా Win98, Me వంటి పూర్వపు వెర్షన్లకు గానీ, లేదా 2003. Server వంటి తర్వాతి ఆపరేటింగ్ సిస్టమ్‌కి గానీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

దీనికి గాను..Start.Programs>Accessories>System Tools విభాగంలో ఉండే Files and Settings Transfer Wizard అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో ఏ ప్రదేశంలో ఈ సెట్టింగులు సేవ్ చేయబడాలన్నది స్పెసిఫై చేయవలసి ఉంటుంది.

ఏదైనా మీ సిస్టంలో ఉన్న ఫోల్డర్‌ని నెట్‌వర్క్ లో ఇతర యూజర్లు కూడా వినియోగించుకునే విధంగా షేర్ చెయ్యదలుచుకుంటే, ఆ ఫోల్డర్‌పై మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి Properties Sharing విభాగాన్ని ఎంచుకోండి. అందులో Share this folder on the network అనే ఆప్షన్‌ని టిక్ చేస్తే సరిపోతుంది.

డీఫాల్ట్ గా విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే Internet Connection Firewal (ICF) ని ఎనేబుల్ చెయ్యదలుచుకుంటే.. Control Panel లో Network Connections అనే విభాగంలో మీ నెట్‌వర్క్ కనెక్షన్‌ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మౌస్‌తొ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆప్షన్ ఎంచుకుని అందులో Advanced అనే విభాగంలోకి వెళ్ళండి. అక్కడ Protect my computer and network by limiting preventing access to this computer from the internet అనే చెక్ బాక్స్ టిక్ చేయండి.


ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్ కనెక్షన్లు మీ సిస్టంలో ఉన్నట్లయితే ప్రతీ కనెక్షన్‌కూ వేర్వేరుగా ' ఫైర్‌వాల్ ' ని ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. అలాగే మీ నెట్ కనెక్షన్ నాలుగైదు సిస్టంలకు షేర్ చెయ్యబడి ఉన్నట్లయితే సర్వర్‌గా వ్యవహరిస్తూ నేరుగా ఇంటర్‌నెట్‌కి కనెక్ట్ అయి ఉన్న సిస్టంలో మాత్రమే ఫైర్‌వాల్‌ని ఎనేబుల్ చేయండి.

మీ నెట్ వర్క్ కనెక్షన్ గురించి వివరంగా రిపోర్ట్ కావాలనుకుంటే Programs.Accessories>System Tools>System Information డైలాగ్ బాక్స్‌లో మళ్ళీ Tools>Net Diagnostics అనే విభాగంలోకి వెళ్ళి.. Scan అనే బటన్‌ని క్లిక్ చెయ్యండి. దీనితో మీ విండోస్ ఇన్‌స్టలేషన్‌కి సంబంధించి, నెట్‌వర్క్ కనెక్షన్ యొక్క వివరాలు లభిస్తాయి.

Welcome స్క్రీన్‌లో కనిపించే ఇమేజ్‌ని మార్చదలుచుకుంటే... Control Panel>User Account లో మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని అందులో Change my Picture అనే బటన్‌ని క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్‌నైతే సెట్ చెయ్యదలుచుకున్నారో దాన్ని స్పెసిఫై చేయండి.

ఏదైనా ప్రోగ్రామ్ యొక్క షార్ట్‌కట్ Start మెనూలో అన్నింటికన్నా పై భాగాన కనిపించే విధంగా సెట్ చెయ్యదలుచుకుంటే Start మెనూ నుండి ఆ ప్రోగ్రామ్ షార్ట్ కట్‌పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Pin to Start Menu అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది.


మీ Recent Documents ఫోల్డర్‌లో ఏయే అంశాలున్నాయో చూడాలనుకుంటే Start>Run కమాండ్ బాక్స్ లో %UserProfile%Recent అని టైప్ చేయండి. సిస్టమ్ పెర్‌ఫార్మెన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగులు వేటినైనా మోడిఫై చెయ్యదలుచుకున్నట్లయితే...Administratorగా లాగిన్ అయి చేయవలసి ఉంటుంది.

ఒక యూజర్ ఫోఫైల్‌ని కాపీ చెయ్యదలుచుకుంటే.. Control Panel/System/Advanced అనే విభాగంలోకి వెళ్ళి User Profiles>Settings అనే ఆప్షన్ ఎంచుకుని ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసుకుని Copy to ఎంచుకోవాలి.

22, మార్చి 2008, శనివారం

లాప్ టాప్ బ్యాటరీ ఎక్కువ బ్యాకప్ ఇవ్వాలంటే...


రూ.26 వేల రూపాయల నుండే ప్రాధమిక స్థాయి లాప్ టాప్ లు లభిస్తుండడంతో ఇటీవలి కాలంలో చాలామంది లాప్ టాప్ ల కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. లాప్ టాప్ విషయంలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్! ఖరీదైన మోడళ్ళు అయితె నాలుగు గంటలకు మించి బ్యాటరీ బ్యాకప్ లభించదు. ఈ నేపధ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ బ్యాటరీ ఇప్పటికన్నా ఎక్కువ సమయం వచ్చేలా చేయవచ్చు. కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న అప్లికేషన్లని మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని క్లోజ్ చేయండి. బ్యాటరీపై నడిచేటప్పుడు స్క్రీన్‍ని డిమ్ చేయండి. లాప్ ‍టాప్ అడుగుభాగంలో వేడి బయటికి ప్రసరించడానికి holes ఉంటాయి. వేడి బయటకు వెళ్ళకుండా ఆ holes కి ఏదైనా అడ్డుగా ఉంటే లోపలి ఉష్ణోగ్రతలు పెరిగి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. అలాగే బ్యాటరీపై నడిచేటప్పుడు డివిడి మూవీలను చూడడం గానీ, ఎక్కువ సిస్టమ్ వనరులను ఉపయోగించుకునే త్రీడి గేమ్‍లను ఆడడం గానీ చేయకండి. USB పోర్టులకు కనెక్ట్ చేసుకునే డివైజ్‍ల సంఖ్య పెరిగే కొద్ది వాటికి విద్యుత్ సరఫరా చేయబడుతుంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ తగ్గిపోతుంది. వీలైనన్ని తక్కువ USB డివైజ్‍లను కనెక్ట్ చేయండి. లాప్‍టాప్‍ని Standby, Hibernate చేయకండి. నేరుగా సూర్యకాంతిలో వాడకండి. Wireless LAN (WLAN) , Bluetooth వంటి అదనపు సదుపాయాలని అవసరం లేనప్పుడు డిసేబుల్ చేయండి. బ్యాటరీ ఆదా అవుతుంది.


సమయం గురించి అన్ని కోణాలలో వివరాలు


ప్రస్తుతం న్యూజెర్సీలో సమయం ఎంత అయిన్దన్నది తెలుసుకోవాలనుకున్తున్నారు, లేదా ఎ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అయినా చూదాలనుకున్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు ? నెట్ లో కుస్తీపడతారు కదూ. ఆయితే టైం కి సంబంధించిన ప్రతీ పనికి వేర్వేరు వెబ్ సైట్లని వెదికి పట్టుకోవలసిన పని లేకుండా నేరుగా టైం తెలుసుకోవచ్చు. ఇందులో టైం జోన్ క్యాలిక్యు లెటర్ , మీటింగ్ ప్లానర్, సూర్యోదయ, సూర్యాస్తమయ వివరాలు ... ఇలా అన్నీ ఒకే చోట లభిస్తాయి. చాలా చక్కని వెబ్ సైట్ ఇది.

21, మార్చి 2008, శుక్రవారం

మౌస్ తో డబల్ క్లిక్ చేస్తే ఫలితం లేకపొతే ....


ఫైళ్ళు, ఫోల్డర్లు, ప్రోగ్రాములను ఓపెన్ చెయ్యడానికి మౌస్ తో డబల్ క్లిక్ చేస్తుంటాం. అయితె ఒక్కోసారి సింగిల్ క్లిక్ సక్రమంగానే పనిచేస్తూ డబల్ క్లిక్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఆగిపోతుంది. దీనికి ప్రధాన కారణం Mouse Properties లో డబల్ క్లిక్ రేట్ ని పూర్తి Fast గా సెట్ చేసి ఉంచడం. వెంటనే Control Panel>Mouse>Buttons విభాగంలో ఉండే Double Clik speed ని మధ్యస్తంగా సెట్ చేయండి. సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.

ఫోటో బకెట్


మీ డిజిటల్ కెమేరా ద్వారా తీసుకున్న ఫోటోలను అప్ లోడ్ చేసుకోవడానికి ఎన్నో ఇమేజ్ హోస్టింగ్ సర్వీసులు ఉన్నప్పటికీ http://photobucket.com/about అనే సర్వీసు ఎంతోకాలంగా చక్కని సర్వీసును అందిస్తోంది. ఈ వెబ్ సైట్ లోకి ఫోటోలను, వీడియొలను అప్ లోడ్ చేసుకోవడమే కాకుండా మీ ఫోటోల ఆధారంగా ఉచితంగా ఆకర్షణీయమైన ఆల్బం లను రూపొందించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయ్యే విధంగా స్లైడ్ షోల రూపంలో పొండుపరుచుకోవచ్చు. వీడియోలు, మ్యూజిక్ ఫైల్లని సైతం స్లైడ్ షోలో పొందుపరుచుకునే అవకాశం లభిస్తోంది. ఫోటో బకెట్ ద్వారా హోస్ట్ చేసుకున్న మీ మీడియా ఫైల్లని మెయిల్, యాహూ మెసెంజర్ వంటి ఇన్ స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రాములు, సెల్ ఫోన్ల ద్వారా మీ స్నేహితులతో పంచుకుని వారి యొక్క స్పందనను కూడా పొందవచ్చు.

అన్ని లింకుల్లోని ఇమేజ్ లను తెచ్చే ప్రోగ్రాం


ఇంటర్నెట్ పై అనేక వెబ్ సైట్లలో భారీమోట్టంలో పిక్చర్ గ్యాలరీలు పొందుపరచబడి ఉంటాయి. ఒక్కో గ్యాలరీని ఎక్స్ ప్లోర్ చేస్తూ ఫోటొలను సేకరించడానికి ఇబ్బందిపడేవారు Picaloader అనే సాఫ్ట్ వేర్ ఉపయోగించి వెబ్ సైట్లలోని
ఫోటోలను ఆటోమేటిక్‌గా పొందవచ్చు. ఈ సాఫ్ట్ వేర్‌లో ఒక వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే ఆ సైట్‌లోనూ , ఆ సైట్‌కి లింక్ చేయబడి ఉన్న ఇతర సైట్లలోనూ ఉన్న ఇమేజ్‌లన్నీ డౌన్ లోడ్ చేయబడతాయి.

20, మార్చి 2008, గురువారం

వేర్వేరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు వాడాలా ??


మీరు IE 5.5,IE6, IE7 వంటి వేర్వేరు ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ వెర్షన్లలో ఏదో ఒకదానిని మాత్రమే ఒకేసారి ఉపయోగించడానికి వీలుపడుతుంది. ఒకవేళ ఒకే వెబ్‌సైట్‌ని IE3,4.01, 5.01,5.5, 6.0వంటి వేర్వేరు వెర్షన్లలో ఏ విధంగా కనిపిస్తుందో తనిఖీ చేయాలంటే Multiple IE Installer అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేయండి. Vista ఆపరేటింగ్ సిస్టం మినహాయించి ఇతర అన్ని వెర్షన్లలో ఇది బాగా పని చేస్తుంది. ఏ వెర్షన్ కావాలో ముందే ఎంపిక చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారాన్ని వెదికి పట్టుకోవాలంటే



మీ స్నేహితులు పంపించిన SMS మెసేజ్‌లలో ఎక్కడో ముఖ్యమైన సమాచారం ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూద్దామంటే Inbox ఉన్న భారీ మొత్తంలోని మెసేజ్‌లను ప్రతీదాన్నీ ఓపెన్ చేసే ఓపిక మీకు లేదనుకోండి. అలాంటప్పుడు AllFinder అనే సాఫ్ట్ వేర్ సాయం తీసుకోండి. NokiaS60 3rd జనరేషన్ ఫోన్లు అయిన N71, N93,E60, E61, E70,E50,5500, N91 వంటి మోడళ్ళపై ఈ సాఫ్ట్ వేర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏ పదం కోసమైతే వెదకదలుచుకున్నారో ఆ పదాన్ని టైప్ చేస్తే.. మీ ఫోన్‌లోని SMS, Email, Calendar, Contact List వంటి వేర్వేరు ప్రదేశాల్లో ఆ పదం వెదకబడి ఎక్కడ తారసపడినా పట్టుకోబడుతుంది.

ఇమేజ్‍ల క్వాలిటీని తిరిగి రప్పించే ప్రోగ్రామ్


TIFF,BMP వంటి హైక్వాలిటీ ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఇమేజ్‌లను
ఫైల్ సీజ్‌ని తగ్గించుకోవడానికి JPEG ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేస్తుంటాం.
JPEG లోకి మార్చబడేటప్పుడు ఫైల్ సైజ్ తగ్గడానికి కొంత ఇమేజ్ క్వాలిటీ
కూడా తగ్గించబడుతుంది. అలా ఇమేజ్ క్వాలిటీ కోల్పోయిన JPEG
ఇమేజ్‌లను తీసుకుని తిరిగి వాటిని సాధ్యమైనంత పూర్తి క్వాలిటీలోకి రప్పించే
ప్రోగ్రామే.. "Unjpeg". ఈ ప్రోగ్రాం అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తుంది.

19, మార్చి 2008, బుధవారం

ఫైర్‍ఫాక్స్ కీబోర్డ్ షార్ట్ కట్‍లు


ఫైర్ ఫాక్స్ కొన్ని విషయాల్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కన్నా వెనుకబడి ఉంది. యూనికోడ్ తెలుగు డిస్‍ప్లే అవాలంటే "పద్మ" వంటి ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లను ఇన్ ‍స్టాల్ చేసుకోవాలి. ఐతే IE లో ఉన్న సెక్యూరిటీ లోపాల గురించి, వాటి తీవ్రత గురించి చాలామందికి తెలియదు. మైక్రోసాఫ్ట్ నిపుణులు నిరంతరం ఆయా లోపాలను సరిచేయడానికే పని చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఫైర్ ఫాక్స్ చాలా ఉత్తమమైనదే , IE కన్నా!. IE లో మాదిరిగానే Firefox లోనూ కీబోర్డ్ షార్డ్ కట్‍లను ఉపయోగించి పలు పనులను చేసుకోవచ్చు. Ctrl + T అనే కీబోర్డ్ షార్ట్ కట్ ఉపయోగిస్తే ఒక ఖాళీ టాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు కావలసిన వెబ్‍సైట్‍ని ఓపెన్ చేసుకోవచ్చు.

Ctrl + R షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్‍లోని వెబ్‍సైట్ రిఫ్రెష్ చేయబడుతుంది. Alt + Home ద్వారా హోమ్ పేజికి, Ctrl + Tab షార్ట్ కట్ ద్వారా ప్రస్తుతం ఉన్న టాబ్ నుండి తర్వాతి టాబ్‍కి, Ctrl + Shift + Tab ద్వారా ముందరి టాబ్‍కి, Esc కీని ప్రెస్ చేయడం ద్వారా లోడ్ అవుతున్న పేజిని నిలుపుదల చేయడానికి, Ctrl + Shift +T ద్వారా క్లోజ్ చేసిన టాబ్‍ని తిరిగి పొందడానికి వీలవుతుంది.

టాస్క్ బార్ నుండే విండో ప్రివ్యు



Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో పలు అప్లికేషన్లని ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్‍పై ఆయా అప్లికేషన్ల పేర్లపై మౌస్ పాయింటర్‍ని ఉంచితే ఆ అప్లికేషన్ యొక్క విండో ప్రివ్యూ చూపించబడుతుంది కదా! అదే విధమైన సదుపాయాన్ని Win XPలో పొందాలంటే Visual Task Tips అనే కేవలం 90KB మాత్రమే పరిమాణం గల ప్రోగ్రామ్‍ని మీ కంఫ్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్‍పై ఏ అప్లికేషన్ యొక్క మీద అయినా మౌస్‍ని ఉంచితే దాని ప్రివ్యూ వస్తుంది.

ఒక ఫోన్ లోని మెసేజ్ లు మరో ఫోన్లోకి ...

మీ పిల్లల ఫోన్ కి ఏయే మెసేజ్ లు వస్తున్నాయి, ఎవరి నుండి వస్తున్నాయి అన్నది ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారా ? SMS Anywhere అనే సాఫ్ట్ వేర్ ని వారి ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్ కి వచ్చిన అన్ని మెసేజిలను, ఆ ఫోన్ నుండి ఇతరులకు పంపించ బడిన మెసేజ్ లను మీ నెంబర్ కి
ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా తమ ఫోన్‍లోని మెసెజ్‍లు మీ ఫోన్‍కి చేరవేయబడుతున్నాయన్న సందేహం మీ పిల్లలకు కలుగకుండానే ఇదంతా జరుగుతుంది. టీనేజ్ పిల్లల నడవడికపై ఓ కన్నేసి ఉంచాలనుకునే తల్లితండ్రులకు ఇది పనికొస్తుంది.

15, మార్చి 2008, శనివారం

ఎ కలర్ పేరేమిటో మీకు తెలుసా ?



చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా అనే భారతీయుడు రూపొందించాడు ఈ సదుపాయాన్ని.

అన్ని ఫైలు షేరింగ్ నెట్ వర్క్ లను వెదకడానికి


ఇంటర్నెట్‌పై రేపిడ్ షేర్, మెగా అప్‌లోడ్, టోరెంట్స్ వంటి వివిధ రూపాల్లో మన కంప్యూటర్లో ఉన్న ఫైళ్ళని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలోని లక్షలాది మంది కూడా ఇలా తమ వద్ద ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులతో ఆయా ఫైల్ షేరింగ్ నెట్‌వర్క్ ల ద్వారా షేర్ చెసుకుంటుంటారు కదా! ఈ నేపధ్యంలో మీకు ఏదైనా ఇంగ్లీష్ సినిమా కావాలనుకోండి. దానిని ఎవరైనా ఏ ఫైల్ షేరింగ్ సర్వీసులో అయినా అప్‌లోడ్ చేసి ఉంటే సింపుల్‌గా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కదా, అయితే మీకు కావలసిన ఆ ఫైల్ ఏ లింక్ రూపంలో ఉందో వెదికి పట్టుకోవడం మామూలుగా అయితే మీ వల్ల కాదు. దీనికి గాను sharingengines అనే వెబ్‌సైట్ యొక్క సాయం తీసుకోండి. ఇది Rapidshare, Bandango, Filefront, Sendspace, Multiply,Megashare, Megaupload, Turboupload వంటి అనేక రకాల ఫైల్ షేరింగ్ సర్వీసులతో పాటు టొరెంట్ ఫైళ్ళ వివరాలను సైతం వెదికి పెడుతుంది. Search బాక్స్ లో కీవర్డ్ ని టైప్ చేసి వేటిలో వెదకాలో ఆ అంశాలను టిక్ చేసుకుంటే సరిపోటుంది.

14, మార్చి 2008, శుక్రవారం

చదివిన తర్వాత మెసెజ్ కనిపించకుండా చెయలా?




మనం క్లయింట్లకు పంపించే మెయిల్ మెసేజ్‌లు ఒకసారి వారు చదివిన తర్వాత రెండవసారి చదవడానికి వీల్లేకుండా చెయవచ్చు. Gmail,Yahoo, Rediff వంటి మెయిల్ సర్వర్లలో నేరుగా ఇలా ఎక్స్ పైర్ అయిపోయే మెసేజ్‌లను పంపించడానికి అవకాశం లేదు. అయితే దీనికి దొడ్డిదారి ఉంది. సహజంగా ఒకసారి ఎవరైనా చూసిన తర్వాత ఇకపై ఆ పేజి కనిపించని విధంగా HTML పేజీలను రూపొంచించే మార్గముంది. ఈ టెక్నిక్‌ని ఆసరాగా చేసుకుని Kicknotes వంటి వెబ్ సైట్లో మనం టైప్ చేసే మెసేజ్‌ని, మనం పేర్కొన్న విధంగా ఎక్స్ పైర్ అయ్యే HTML లింక్‌గా మార్పిడి చేసి ఎవరికైతే మెయిల్ చేయదలుచుకున్నామో వారికి చేరవేయగలుగుతాయి.దాంతో మన మెసేజ్ అవతలి వారికి ఒక లింక్ రూపంలో పంపించడుతుంది. అయితే వారు ఆ లింక్‌ని మొదటిసారి క్లిక్ చేసినప్పుడు మాత్రమే అందులో మనం పంపిన మెసేజ్ కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే .. మెసెజ్ తొలగించబడింది అని మొండి చేయి చూపిస్తుంది.

XP స్టార్ట్ బటన్‍ పేరుకి మరో మార్గం



Start బటన్ యొక్క పేరుని Startకి బదులుగా మీకు నచ్చిన విధంగా మార్చడానికి అనేక మార్గాలున్నాయి. StartBtn Renamer అనే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ సోర్స్ కోవకు చెంది ఉండడం వల్ల ఒకవేళ మీకు కావాలంటే ఈ ప్రోగ్రామ్ యొక్క రూపాన్ని మీకు నచ్చినట్టు సోర్స్ కోడ్‍ని మోడిఫై చేయడం ద్వారా మార్చుకోవచ్చు.

CGI స్క్రిప్ట్ ల వలన తలెత్తే అనర్ధాలు



వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్న వారికి CGI Scripts గురించి తెలిసే ఉంటుంది. CGI Common Gateway Inerface అని అర్ధం. Perl,Tcl,C , C++ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల ద్వారా ఈ స్క్రిప్టులను రాస్తుంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఇంటర్ రిజల్ట్స్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ చేసారనుకోండి. Candidate number టైప్ చేయమని ఓ HTML వెబ్‌పేజ్ కోరుతుంది. మనం నెంబర్ టైప్ చేసిన తర్వాత దానిని తీసుకుని బ్యాక్ గ్రౌండ్‌లో CGI స్క్రిప్ట్ అందరు అభ్యర్థుల ఫలితాలతో కూడిన డేటా బేస్‌లో వెతుకుతుంది. ఆ నెంబర్ యొక్క ఫలితం డేటా బేస్‌లో దొరికిన వెంటనే ఈ CGI స్క్రిప్ట్ మళ్ళీ HTML పేజి రూపంలో యూజర్ యొక్క కంప్యూటర్లో స్క్రీన్ మీద ఫలితాన్ని చూపిస్తుంది. అంటే ప్రశ్నకి డేటా బేస్‌కి మధ్య ఈ స్క్రిప్ట్ వాహకంగా పనిచేస్తుందన్న్నమాట. అయితే CGI స్క్రిప్టులు అధికశాతం సెక్యూరిటీ లోపాలను కలిగి ఉంటాయి. ఈ స్క్రిప్ట్ లను రాసే ప్రోగ్రామర్లు తగినంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఇవి అనేక ఇబ్బందులకు దారి తీస్తుంటాయి. CGI స్క్రిప్ట్ లలో ఉన్న రిస్క్ ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల మరింత సురక్షితంగా ఉండే సర్వర్ ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ASP (Active Server Pages ), JSP ( java server pages), servlets, వంటివి బాగా వాడుకలో ఉన్నాయి.

11, మార్చి 2008, మంగళవారం

మంచితనం మూర్తీభవించిన మిత్రునికి జన్మధిన శుభాకాంక్షలు

ట్రెక్కింగ్ లో సేదదీరుతూ మిత్రులు గిరిచంద్

అందరూ మాటలు చెబుతారు.. కొందరే చేతల్లో చూపిస్తారు. ఆ చేతలు కూడా మనస్ఫూర్తిగా నిర్వర్తించి అందరికీ ఆత్మీయులవుతారు. అటువంటి అరుదైన ఆదర్శదాయకమైన వ్యక్తిత్వం నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారిది. కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ప్రారంభమైనది మొదలుకుని నిరంతరం దానిని అభివృద్దిపరచడంలో, చాట్ లో జరిగిన సంభాషణలను అర్థవంతంగా పదిలపరచడంలో, కొత్తవారిని ఉత్తేజపరచడంలో, ఛాట్ లో సందర్భానుసారం నవ్వులు పూయిస్తూ ఉల్లాసాన్ని నింపడంలో ఆయనది అందెవేయిన చేయి. నిజంగా గిరిచంద్ లాంటి మిత్రులు కంప్యూటర్ ఎరా టీమ్ మొత్తానికీ లభించినందుకు నేను వ్యక్తిగతంగా గర్వపడని రోజంటూ లేదు. మీజిల్స్ తో బాధపడుతూ నిలువెల్లా నీరసం ఆవహించినా ఛాట్ లో ఓపిగ్గా పలువురి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అవసరమైతే మధ్యలో ఫోన్ చేస్తూ ఆయన ప్రదర్శించిన కమిట్ మెంట్ మనసుని కదిలిస్తుంది. మానవత్వమంటే ఇదే అన్పిస్తుంది. అవకాశం వస్తే అందరూ కబుర్లు చెబుతారు, కానీ గిరిచంద్ గారిలా కట్టుబడేవారు చాలా చాలా అరుదు. వారు తమ స్నేహపూరిత స్వభావంతో అందరినీ సమన్వయపరుస్తూ ఛాట్ లో పోషిస్తున్న పాత్ర నిజంగా అద్భుతమైనది. నేను ఈ ప్రాజెక్ట్ కి కట్టుబడి పనిచేస్తాను అని ఆయన ప్రకటించిన క్షణం నుండి ఈరోజు వరకూ ఆయనలో అదే ఉత్సాహం. మనిషి ఆర్థికంగా ఎదగవచ్చు.. కానీ మానవత్వంలో మనీషి గా ఎదడగమెలాగో ఆత్మీయులు గిరిచంద్ గారిని చూస్తే అర్థమవుతుంది. ఇది ఆయనని పొగడడం కాదు.. మామూలు సందర్భాల్లో మా టీమ్ సభ్యులందరి మనసులో ఆయనపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నా అవి వ్యక్తపరడానికి సరైన సందర్భం లభించదు, అందుకే ఆయన గొప్పదనాన్ని కనీసం ఆయన జన్మదినం రోజైనా ఈ పోస్ట్ రూపంలో వ్యక్తపరిచే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గిరిచంద్ గారు మనసువిప్పి చెబుతున్నాను మీరు మాకు అత్యంత ఆత్మీయులు, మిమ్మలను చూసి, మీ కమిట్ మెంట్ ని చూసి గర్వపడని క్షణమంటూ
లేదు. మీ వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మరో పదిమందికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ..

జ్యోతి, ప్రసాద్, జీవి, శ్రీనివాస్ కర, సాయి పోతూరి, జాకబ్, మొయిన్, జాహ్నవి, రాధిక, రామ్ యనమల, వినయ్, రవీంద్ర కాట్రగడ్డ, టి.రామచంద్రరావు, నాగభూషణం, నరేష్ వంటి ఎందరో మిత్రుల ఆశీస్సులతో మీరు కలకాలం ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

- మీ మిత్రుడు
నల్లమోతు శ్రీధర్

ప్రసిద్ధి గాంచిన మొదటి ఐదుగురు హ్యాకర్లు


సెక్యూరిటీ లోపాలను అడ్డుగా పెట్టుకుని సిస్టం లను హ్యాక్ చేయడంలో హ్యాకర్లు దిట్టలు. ప్రపంచవ్యాప్తంగా Most Wanted జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్లు గురించి తెలుసుకుందాం. పై ఫొటోలో ఉన్న Kevin Mitnik
యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి ఇతను. Adrian Lamo ది తర్వాతి స్థానం. మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసిన ఘనత ఇతనిది. మూడవ స్థానంలో Jonathan James నిలుస్తాడు. కేవలం 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపించబడిన ఘనత ఇతనిది. Defence Threat Reduction Agency వంటి అత్యంత కీలకమైన సంస్థల వెబ్‍సైట్లని హ్యాక్ చేసి ముచ్చెమటలు పోయించాడు ఇతను. తర్వాతి స్థానం Robert Tappan Morris ది. Morris అనే వార్మ్ సృష్టికర్త్గ ఇతను.నెట్ ద్వరా వ్యాప్తి చెందిన మొట్టమొదటి వార్మ్ గా దీన్ని చెప్పవచ్చు. చివరి స్థానాన్ని Kevin Poulsen ఆక్రమిస్తాడు. FBI ఇతని కోసం వెతుకుతుంది.

యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి

ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.

సులభంగా వాడదగ్గ డెస్క్ టాప్ షేరింగ్ ప్రోగ్రాం


అనుకోకుండా మీరు ఊరు వెళ్లవలసి వచ్చింది. మీ వద్ద లాప్ టాప్ లేదు. మీ కంప్యూటర్ ని మీరు వెళుతున్న ఊరి నుండి యాక్సెస్ చేద్దామంటే ఇక్కడ మీ పిసిని అలా ఆన్ చేసి వెళ్ళాలి. అప్పుడే R Admin, Logmein వంటి సర్వీసుల ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ పొరబాటున కరెంట్ పొతే ఇక్కడ ఉన్న అ మీ పిసి ఆప్ అయిపోతే కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ నేపధ్యంలో Webtop అనే సర్వీసు ఎంతొ ఉపయుక్తంగా ఉంటుంది. ముందు మీ కంప్యూటర్ లోని ముఖ్యమైన ఫైల్లని webtop సర్వీస్ ద్వారా ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేసుకోండి. ఇప్పుడు పై చిత్రంలో విధంగా మీరు ఎక్కడి నుండైనా యాక్సెస్ చేసుకోగలిగేలా ఒ వర్చ్యువాల్ డెస్క్ టాప్ క్రియేట్ అవుతుంది. ఎ ఊరిలో ఉన్నా ఈ సర్విఇసులోకి ప్రవేశించి మీరు ఇంతకుముందు అప్ లోడ్ చేసుకున్న ఫిల్లని ఉపయోగించుకోవచ్చు. అయితె ఎక్కువ స్పీడ్ కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే దీనిని ఉపయోగించడం బావుంటుంది. యూజర్ నేఁ , పాస్ వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

9, మార్చి 2008, ఆదివారం

రేగోడియాలు


http://trajarao.wordpress.com/

తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు అనబడే తాడిమేటి రాజారావుగారి బ్లాగు ఇది. కొల్లేటి చాంతాడంత ఉన్న తన పేరు పురికొసగా మారడానికి గల కారణాలు వివరిస్తూ ఆగస్టు 2007 లో బ్లాగు మొదలెట్టారు రాజారావుగారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాస్తవ్యులైన రాజారావుగారు ప్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. వారి అర్ధాంగి వసుంధర కూడా బ్లాగరే..

చాలా మంది బ్లాగర్లలాగే రాజారావుగారు తన బ్లాగులో ఎక్కువగా తన ఆలోచనలు, మరిచిపోలేని జ్ఞాపకాలు, చిన్ననాటి ఆటలు, అమెరికాలో పడుతున్న తిప్పలు , తను చూసిన సినిమాల గురించి రాస్తూ అందరితో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. నేను నా ఊరు అనే వర్గంలో తన చిన్ననాటి ఆటలు, తన ఊరిలోని విశేషాలు ఎంతో వివరంగా చెప్పారు. తన బ్లాగులో ఊసుపోక జాబులు రాయకుండా ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన కొన్ని ఆటల గురించి వివరించారు. ముఖ్యమైనవి ఉదయం మొదలుపెట్టి రాత్రి అమ్మలు వచ్చి చెవి మెలేసి పట్టుకెళ్ళేదాకా అడిన సబ్జా విండూర్, పెంకులాట, రోజు అమ్మతో చీవాట్లు తిన్నా విడువని వీపు చట్నీలు, అష్టాచెమ్మా, వైకుంఠపాళి మొదలైనవి . రాజారావుగారి ఈ టపాలు , ఎందరో బ్లాగరులు ఉద్యోగ,కుటుంబ భాధ్యతలలో పడి మర్చిపోయిన చిన్ననాటి స్మృతులను మళ్ళీ గుర్తుకు చేసుకునేలా చేసాయి అంటే అతిశయోక్తి కాదు. రాజారావుగారి బ్లాగులోని టపాలు చదువుతుంటే అవి మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి. అంత వివరంగా ఉంటాయన్నమాట. అరే !ఇవి మనకు తెలిసినవే కదా అనుకోవడం కూడా జరుగుతుంది.







ఇక సినిమాల గురించి రాజారావుగారు చేసే విశ్లేషణలు చదివే వారికి ఇక ఆ సినిమాల గురించి ఎటువంటి తర్జన భర్జన లేకుండా ఒక నిర్ణయానికొచ్చేస్తారు. మంచి సినిమా ఐతే చూడొచ్చు అని బుర్ర చెడగొట్టే సినిమా ఐతే బ్రతికిపోయామని అనుకుంటారు. రాజారావుగారు నా అభిప్రాయాలు అనే వర్గంలో రాసిన ఒక టపా "నెరవేరిన నా జీవితాశయం" నిజంగా మహోన్నతమైనది. ఒక్క గదిలో కాపురముంటు అష్ట కష్టాలు పడి తమను పెంచి పెద్ద చేసిన తండ్రి షష్టిపూర్తికి ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చి అందుకు తనకు తోడుగా ఉన్న ధర్మపత్నికి మనసారా కృతజ్ఞ్తతలు చెప్పుకున్నారు.

రాజారావుగారు తన అభిప్రాయాలని చాలా నిర్మొహమాటంగా చెప్తారు. తన చాకిరేవు వర్గంలో అమెరికాలోని భారత సూపర్ బజార్లలొ జరిగే తేదీ ఎక్స్ పైరు అయిపోయిన సరుకులు అమ్మడం గాని, జెమిని టీవీలో వచ్చే "చిత్ర"హింసలు, ఎన్నో ఇంగ్లీషుపదాలను తెలుగులోకి మార్చాలని ప్రయత్నిస్తున్న తెలుగు బ్లాగర్లని, చందమామ, చిరుత చూసి కలిగిన అనుభవం మొదలైన వెన్నింటినో నిజంగానే చాకిరేవు పెట్టేసారు. మా ఊరు వీధి సినిమా కాని గోళీసోడా కాని చదివిన వారెవరైనా వావ్ ! సూపర్ అనుకోకమానరు తమ అనుభవాలు కూడా ఏకరువు పెట్టకుండా ఆగలేరు మరి. అప్పుడప్పుడూ తమ అమెరికా అనుభవాలు కూడా సవివరంగా రాస్తుంటారు.తరచుగా రాయకున్నా, ఆయన రాసిన టపాలన్నీ కూడా చదువరులను ఆకర్షించి ఆలోచింప చేస్తాయి. ఈ రెగోడియాలు బ్లాగు పేరు , దాని ట్యాగ్ లైన్ లాగానే నిజంగా ఈ రేగొడియాలు తీయ తీయగా కొంచెం కారం కారంగా ఉంటాయనడం లో అతిశయోక్తి లేదు.


సమీక్షకులు తమ పేరు గోప్యంగా ఉంచారు.

నోకియాని మింగేస్తున్న Nokla


ప్రముఖ సెల్‌ఫోన్ తయారీ సంస్థ Nokia ఫోన్లకు ఇప్పుడు Nokla పేరిట చైనాలో తయారవుతున్న నకిలీ ఫోన్లు వచ్చేసాయి. అచ్చం ఒరిజినల్ మోడళ్ళని తలపించే మాదిరిగానే ఉండే ఈ Nokla ఫోన్లలో నిశితంగా పరిశీలించి చూస్తే కొద్దిపాటి వృత్యాసాలు కనిపిస్తాయి. ఉదా.కు.. Nokia N 95 ఒరిజినల్ ఫోన్‌లో Menu/Multimedia Keys ఉండే ప్రదేశంలో నకిలీ ఫోన్‌లో ఒకవైపు Play బటన్, మరోవైపు Stop బటన్ ఉంటాయి. అలాగే ఒరిజినల్ నోకియా ఫోన్లు 5 megapixel కెమెరాని కలిగి ఉంటుంటే, నకిలీ ఫోన్ 2megapixel కెమెరాని కలిగి ఉంటున్నాయి.ఇలా తెలియకుండా అనేక వృత్యాసాలు ఉన్నాయి. అయితే ఒరిజినల్ N95 ధర 40 వేలవరకు ఉంటే Nokla N95 మాత్రం కేవలం రూ.7,500లకే లభిస్తుంది. ఎంత చవకో చూడండి. దాదాపు అన్ని నోకియా మోడళ్ళకు అతి తక్కువ ధర కలిగిన నకిలీలు లభిస్తున్నాయి.

గూగుల్‌ని మరింత బాగా వెదకడం ఇలా...



ఇంటర్నెట్‌పై గడిపే సగటు పిసి యూజర్‌కి www.google.com అనే వెబ్‌సైట్ ఒక్క రోజు ఓపెన్ చేయకపోయినా పొద్దు పొడవదు Googleలో మీరు ఎన్నో రకాల కీవర్డ్ లు టైప్ చేసి వెదుకుతూ ఉంటారు.అయితే మీరు ఒక వీడియో కోసమో, ఆడియో ఫైల్ కోసమో, సాఫ్ట్ వేర్లు వంటి ఇతరత్రా అంశాల కోసమో గూగుల్‌లో వెదకాలంటే ఆ పదాన్ని వేర్వేరు రకాలుగా Search బార్‌లో టైప్ ఛేసి వెదుకుతుంటారు. అసలు మీరు వెదకదలుచుకున్నది ఏ తరహా ఫైలో ముందే మీరు నిర్ణయించుకోగలిగితే Google Hacks అనే ప్రోగ్రాంని ఉపయోగించి అందులో కనిపించే Music, Book, Video, Tools, Hacks, Torrent, Web Hosting వంటి వేర్వేరు విభాగాల్లో కావలసిన అంశాన్ని టిక్ చేయడం ద్వారా కేవలం ఆ తరహా ఫైళ్ళే వెదకబడేలా చేయవచ్చు.

8, మార్చి 2008, శనివారం

2MB సైజులోనే ఎం.ఎస్. ఆఫీసుకి ప్రత్నామ్నాయం





మీ ఇంట్లో నెట్ పనిచేయకపోవడం వల్ల బయటి ఇంటర్నెట్ సెంటర్ ద్వారా నెట్‍ని బ్రౌజ్ చేయడానికి వెళ్ళారనుకుందాం. అకస్మాత్తుగా ఆ సిస్టమ్‍లో మీ వద్ద ఉన్న Excel డాక్యుమెంట్లని మోడిపై చేయవలసి వచ్చింది. తీరా చూస్తే అక్కడి కంప్యూటర్లలొ MS. Office ఇన్‍స్టాల్ చేయబడి లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆందోళన చెందకండి. Floppy Office అని ముఖ్యమైన టూల్స్ తో కూడిన ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. ఇది 2MB కన్నా తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇందులో పొందుపరచబడిన అప్లికేషన్లని ప్రత్యేకంగా ఇన్‍స్టాల్ చేయవలసిన అవసరం లేదు. నేరుగా రన్ చేసుకోవడమే. ZIP ఫైల్‍లో పొందుపరచబడి ఉండే ఈ టూల్స్ ని USBమెమరీ స్టిక్‍లోకి కాపీ చెసి వాడుకోవచ్చు. FTP క్లయింట్, Rich Text ఏడిటర్, నోట్‍పాడ్ తరహా ఎడిటర్, స్ప్రెడ్ షీట్ ప్రోగ్రామ్, POP Mail క్లయింటూ, వెక్టార్ గ్రాఫిక్స్ ఎడిటర్ ఉన్నాయి.

డివైజ్ డ్రైవర్లని సక్రమంగా తొలగించకపోతే


ఏదైనా హార్డ్ వే పరికరాన్ని సిస్టమ్ నుండి తొలగించిన తర్వాత దాని డివైజ్ డ్రైవర్లని కూడా తీసేయడం ఉత్తమం. అలాగే మీ డివైజ్ డ్రైవర్లని లేటెస్ట్ వెర్షన్‍తో అప్‍గ్రేడ్ చేసుకునే ముందు పాత డ్రైవర్లని డివైజ్ మేనేజర్ ద్వారా uninstall చేసుకోండి. నిరుపయోగంగా లేదా పాతవి,,కొత్తవి రెండు వెర్షన్లుగా సిస్తమ్‍లో పేరుకుని పోయే డివైజ్ డ్రైవర్లు బూటింగ్ సమయంలో సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఏయే డివైజ్ డ్రైవర్లు మీ సిస్టమ్‍లో వృధాగా పడి ఉన్నాయో మీరు గుర్తించకపోతే ఇంటర్నెట్‍లో Driver Sweeper పేరిట ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. అది డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేయండి. అది సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసి వృధాగా పడి ఉన్న డివైజ్ డ్రైవర్లని చూపిస్తుంది. వాటిని నిస్సందేహంగా తొలగించవచ్చు.

6, మార్చి 2008, గురువారం

విండోలను ట్రాన్స్ పరెంట్‍గా మార్చుకోవడం..


విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‍లో మీరు ఏ విండోనైనా పై చిత్రంలోని విధంగా ట్రాన్స్ప్ రెంట్‍గా (క్రింది విండోలోని సమాచారం కూడా కన్పించేలా) మార్చుకోవాలంటే Vitrite అనే చిన్న ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసిన తర్వాత ఇది సిస్టమ్ ట్రేలోకి వెళ్ళి కూర్చుంటుంది.ఇక మీరు ఏ విండోలో ఉన్నప్పుడైనా Ctrl+Shift+1 లేదా Ctrl+Shift+2 మాదిరిగా వరుసగా కీబోర్డ్ షార్ట్ కట్‍లను ఉపయోగిస్తే అది ట్రాన్స్ పరెంట్‍గా అవుతుంటుంది.

ఎ వెబ్ సైట్లో ఎ టెక్నాలజీ వాడబడింది


వెబ్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి, లేదా తమకు తాము స్వంతంగా వెబ్ సైట్లని రూపొందించుకోదలుచుకున్న వారికినెట్‍లో వివిధ ఆకర్షణీయమైన వెబ్ సైట్లని చూసినప్పుడు అవి ఏ వెబ్ టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడ్డాయన్న ఆసక్తి కలగడం సహజం. మీకు తారసపడే ఏ వెబ్‍సైట్ అయినా ఏయే టెక్నాలజీల ఆధారంగా రూపొందించబడిందో తెలుసుకోవాలనుకుంటే builtwith అనే వెబ్ సైట్‍ని ఓపెన్ చేసి అక్కడి అడ్రస్ బార్‍లో మీరు ఏ సైట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో దాని అడ్రస్‍ని టైప్ చేసి Lookup అనే బటన్‍ని క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో వివరాలు ప్రత్యక్షమవుతాయి.

5, మార్చి 2008, బుధవారం

అన్ని రకాల కాలిక్యులేషన్స్ చేయాలంటే


ఒక అంగుళానికి ఎన్ని మిల్లిమీటర్లు, ఎన్ని సెంటిమీటర్లు, ఒక మైలుకి ఎన్ని సెంటిమీటర్లు, అంగుళాలు ఉంటాయి వంటి ధర్మసందేహాలు వస్తే మీ వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే వెంటనే worldwide metric అనే వెబ్ పేజిని ఓపెన్ చేయండి. ఇందులో నిడివి, బరువు, వత్తిడి, పరిమాణం, ఉష్ణోగ్రత వంటి వేర్వేరు అంశాలను వేర్వేరు ప్రమాణాల్లో కొలిచే సదుపాయం లభిస్తోంది. ఏదైనా బాక్శ్ లో మీకు కావలసిన విలువని టైప్ చేసి Calculate అనే బటన్‍ని ప్రెస్ చేసారంటే, వెంటనే ఇతర ప్రమాణాల్లో అది ఎంత విలువ అవుతుందో కనిపిస్తుంది.

4, మార్చి 2008, మంగళవారం

మార్చి నెల కంప్యూటర్ ఎరా



ఈ నెల కంప్యూటర్ ఎరా పత్రిక మార్కెట్లో సిద్ధంగా ఉంది. విలువైన సమాచారం మీ సొంతం చేసుకోండి.

అన్ని రకాల వీడియొలను వెదకడం


Youtube, Google Video, Bglip.tv వంటి వీడియో షేరింగ్ వెబ్ సైట్లతో పాటు CNBC, ABC News, BBC వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రముఖ వార్తలను వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరుస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో కోసం వెదికే కన్నా www.truveo.com అనే వెబ్ సైట్‍ని సందర్శించండి. ఇందులో Search బాక్స్ లో మీరు ఏ కీవర్డ్ టైప్ చేసినా అన్నివీడియో సైట్లలో వెదకబడుతుంది. ఈ వెబ్‍సైట్ ద్వారా మనం టైప్ చేసిన కీవర్డ్ కేవలం ఒక నిర్ధిష్టమైన విభాగంలోనే (స్పోర్ట్స్, ఎంటర్‍టైన్‍మెంట్) వెదకబడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.అలాగే బాగా పాపులర్ అయిన వీడియోలను మాత్రమే, లేదా ఎక్కువ మంది చూసిన వీడియోలను మాత్రమే లేదా తాజాగా అప్‍లోడ్ చేయబడిన వీడియోలను మాత్రమే .. ఇలా భిన్న అంశాల ఆధారంగా వీడియోలను వెదికే అవకాశం కల్పించబడింది. ఇందులో టివి షోస్, మూవీక్లిప్స్, మ్యూజిక్ వీడియోస్ వంటి వేర్వేరు విభాగాల క్రింద వీడియోలు అమర్చబడి ఉన్నాయి.

ఆడిటింగ్ అంటే ఎమిటో తెలుసా ?



ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలొ ఉన్న కంప్యూటర్లు, ఇతర మౌలిక వనరులను విశ్లేషించి, వాటి ఇంటిగ్రిటీని తనిఖీ చేయడంతోపాటు రక్షణా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చేప్పే ప్రక్రియను EDP Audit అంటారు. సహజంగా ఈ తరహా ఆడిట్లని నిర్వహించడానికి ప్రతీ సంస్థలోనూ EDP Auditor పేరిట ఓ వ్యక్తి నియమించబడి ఉంటాడు ఆడిట్ నిర్వహించడానికి audit softwareలు ఉపయోగించబడుతుంటాయి. ఇవి సంస్థ యొక్క డేటాబేస్‍లను శాంప్లింగ్ చేసి సంస్థ ఖాతాదారులకు , మన సంస్థకు వనరులు సమకూర్చే వెండర్లకు కన్ఫర్మేషన్ లెటర్లు పంపిస్తుంటాయి. సంస్థ యొక్క ఐటి వనరులను విశ్లేషించడానికి Intely Audit వంటి ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వాడబడుతుంటాయి. వివిధ రకాలైన ఆడిటింగ్ సాఫ్ట్ వేర్లు వేర్వేరు ప్రయోజనాలను సాధించి పెడతాయి. కొన్ని ప్యాకేజీలు రుజువులను సేకరించడానికి ఉపకరిస్తే మరికొన్ని ఎనలటికల్ పరీక్షలునిర్వహించడానికి, మరికొన్ని సంస్థ అంతర్గత నియంత్రణని విశ్లేషించడానికి ఉపయోగపడతాయి. అలాగే ఆడిట్ నిర్వహించబడిన తర్వాత ఆ వివరాలను డాక్యుమెంట్ల రూపంలో పొందుపరచడానికి, నిర్ధిష్ట సమయంలో ఆడిట్ నిర్వహించబడేలా కాన్ఫిగర్ చేయడానికి, ఎక్సెప్షన్ రిపోర్టులను ప్రింట్ చేయడానికి ఇలా పలు రకాల పనులను చేయడానికి సాఫ్ట్ వేర్లు లభిస్తుంటాయి.