27, ఫిబ్రవరి 2008, బుధవారం

అంతరంగం - ఫిబ్రవరి 2008


"బ్లాగరు నవ్వాలి" అనుకోకుండానే అసంకల్పితంగా బ్లాగరైన బ్లాగరు శ్రీ చరసాల రేణుకాప్రసాద్‍గారు. ఆయన బ్లాగు "అంతరంగం’ అనే పేరుతో సుప్రసిద్ధం. ఇది 2006 జూన్ నెలనుండి అంతర్జాలంలో ప్రకటితమౌతూ ఉంది. శ్రీ చరసాల కడప జిల్లాకు చెందినవారు. ఆయన ప్రొద్దుటూరులో పాలిటెక్నిక్, భీమవరంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తిచేశాక ఇండియాలో కొంత కాలంపాటు పనిచేసారు. తర్వాత 1997-98ప్రాంతంలో అమెరికా వెళ్ళారు. అక్కడ Verizon కంపెనీలో కొంతకాలం ఉండి , ఆ దేశపు రవాణాశాఖలో పని చేసి ప్రస్తుతం Morgan Stanley కంపెనీలో పని చేస్తున్నారు. చరసాలగారి బ్లాగు ముక్కుసూటిదనానికి, విషయస్పృష్టతకు, నిర్దుష్టమైన తెలుగు వ్యావహారిక శైలికి పేరెన్నిక గన్నది. ఆయన conclusionsతో విభేదించేవారు ఉండొచ్చునేమో గాని ఆయన విశ్లేషణతో విభేదించేవారెవరూ లేరు. అనుభవాలు, ఆధ్యాత్మికం, కవితలు, చరిత్ర మొదలైన 10 వర్గాలుగా అంతరంగం బ్లాగులోని తపాలు వింగడించబడ్డాయి. ఈ అన్ని వర్గాల కిందా కలిపి 200కు పై చిలుకు వ్యాసాలున్నాయి.

భౌతికవాదం : శ్రీ చరసాల ప్రసాద్ నాస్తికుణ్ణని ఎక్కడా సూటిగా చెప్పకపోయినా, దేవుడిని, మత గ్రంధాల్ని విమర్శించకపోయినా ఆయన రచనలు భౌతికవాదం వైపే పూర్తిగా మొగ్గుచూపుతాయి. ప్రకృతిలో ఉన్నది రకరకాల భౌతిక శక్తులు మాత్రమేనని పేర్కొంటూ "ఆ శక్తి దృష్టిలో నమ్మేవాడు ఎంతో నమ్మని వాడు అంతే " అంటారు "నమ్మకం" అనే టపాలో. అంతరాత్మ ఒకటుందని కూడా ఆయన విశ్వసించరు. "మనకు తెలియనిదేది అంతరాత్మకూ తెలియదనే చెప్పాలి" అంటారు అంతరాత్మ అనే టపాలో !. "నేను పురాణాల్లో చెప్పబడిన దేవున్ని, గుడిలో దేవున్ని నమ్మను. ఈ విశ్వమంతా కొన్ని భౌతిక సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఆ సూత్రాలే దేవుడనుకుంటాను." అని కుండబద్దలు కొట్టారు పాఠకుల కోరికపై "దేవుడి పుట్టుక" అనే టపా రాస్తూ.

అమెరికా జీవితం : అమెరికావాసి అయినప్పటికీ చరసాలగారిలొ మాతృదేశాభిమానం పదిలంగానే ఉంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆయన ఒక కంట నిశితంగా గమనిస్తూనే ఉన్నారనడానికి దాదాపు ప్రతి టపా నిలువెత్తు సాక్ష్యమే. తాను జన్మించిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం ఇటీవల పునర్విభజన కసరత్తుకు గురికావడం గుఱించి "అది నా కళ్లముందర పుట్టింది, పోనూపోయింది" అన్నారు. అమెరికన్ పౌరసత్వం గుఱించి రాస్తూ "పుట్టినచోటును బట్టి పౌరసత్వ విధేయత వస్తుందేమో గాని వారసత్వం వస్తుందా?" అని ప్రశ్నిస్తారు "పౌరసత్వ విధేయత" అనే టపాలొ! "అమెరికా ప్రజాస్వామ్యం మన రిగ్గింగుకు సామ్యం " అనే టపాలో "వీళ్ళ (అధ్యక్ష) ఎన్నికల తతంగం చూస్తే మా రాయలసీమలో చాలా పల్లెల్లో జరిగే ఎన్నికల తంతుకి దీనికీ పెద్ద తేడా లేదేమో అనిపించిం" దంటు మేడిపండు పొట్టవిప్పి చూపించారు.

సామాజిక చింతనాధార: నలుగురూ నడవగా నలిగిన బాట వెంటే పరుగులు తీయడం చరసాల గారి పద్ధతి కాదు. పాతచింతకాయ పచ్చళ్ళకు ఇష్టమైనా కష్టమైనా తనకు స్పురించిన ఒక క్రొత్త సత్యాన్ని నిర్భీతిగా వెల్లడించడమే ఆయనకు అభీష్టం. అందుకు వచ్చే వ్యాఖ్యలకు, విమర్శలకూ పేరుపేరునా ఓపికగా సమాధానం చెప్పడం ఆయన విశిష్టత. "భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడుచేస్తున్నాం" అంటారు "చదువుల్లో పోటీ -బాల్యం లూటీ" అనే టపాలో ! అమెరికా జీవనశైలిలో జరిగే ప్రకృతి వనర్ల దుర్వినియోగం గుఱించి రాస్తూ " ఈ భూమిని చెత్త కింద మార్చేసి మళ్ళి అదే చెత్తవాసన అంటకుండా ఎ.సి.రూముల్లో కలుగుల్లో ఎలుకల్లా అవసరమా ఈ జీవితాలు?" అని అంతర్మధనం చేస్తారు "ఉత్తమజీవితమా x వ్యర్ధ జీవితమా?" అనే టపాలో! శ్రీచరసాల ప్రసాద్ గారి బ్లాగు తొలి తెలుగు బ్లాగుల్లో ఒకటి మాత్రమే కాదు. తొలి తెలివైన బ్లాగుల్లో కూడా ఒకటి అంటే తప్పులేదేమో !!..


సమీక్ష తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం

5 కామెంట్‌లు:

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

చెరసాల వారి గురించి తెలుసుకోవడం బ్లాగర్ల అదృష్టం. ఆయన బ్లాగును నేను పెద్దగా చూడకపోయినా సూచాయిగా ఆయన ఉన్నత వ్యక్తిత్వం కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రస్ఫుటమవుతూనే వుంది. చెరసాల వారికీ, సమీక్ష కర్త తాడేపల్లి వారికీ, కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారికీ కృతజ్ఞతలు.

రాధిక చెప్పారు...

పొద్దులో ఇంతకుముందే చరసాల గారి బ్లాగు సమీక్షించారుకదా మళ్ళా కొత్త గా ఏముంటుంది చెప్పడానికి అనుకున్నాను.కానీ సమీక్ష చాలా బాగుంది.తాడేపల్లి వారి శైలిలోనే సాగింది.ప్రసాదుగారి బ్లాగు అభిమానిగా వారు తరుచుగా టపాలు అందించాలని కోరుకుంటున్నాను.శ్రీధర్ గారికి,తాడేపల్లి వారికి అభినందనలు.

cbrao చెప్పారు...

చరసాల గురించిన సమీక్ష బాగుంది. తాబాసు విశ్లేషణ సహేతుకంగా వుంది.తాను ఆస్తికులైనా,చరసాల నాస్తికులైనా,దాని ప్రభావం సమీక్ష పై పడకుండా సమన్వయం పాటించారు తాబాసు. అభినందనలు.

కొత్త పాళీ చెప్పారు...

చరసాల మహాశయులు వాల్ స్ట్రీట్ అనే చెరసాల బద్ధులుగా మిగిలిపోకుండా తమ అంతరంగాన్ని మళ్ళీ శ్రుతి చేసి దాన్ని ఘోషింప చెయ్యాలని ఇలా సభాముఖంగా విన్నవించుకుంటున్నాం.
తాలబాసు గారి సమీక్ష అమోఘం.

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, తెలుగు సౌరభాలని పరిమళించె ఎంత మంచి బ్లాగు లని పరిచయం చెశారు. ముఖ్యంగా చరసాల గారిచ్చిన లింకులు కూడ చాల చాల బాగున్నవి. "నీ మనసులో ఏమున్నదో?" కవిత ఎంత బాగుందో.