5, ఫిబ్రవరి 2008, మంగళవారం

జ్యోతి ... జనవరి 2008


http://vjyothi.wordpress.com


తెలుగు బ్లాగ్లోకం "జ్యోతక్క" అని ప్రేమగా, కించిత్ గౌరవంగా పిల్చుకునే శ్రీమతి వలబోజు జ్యోతిగారు ఏకకాలంలో ఐదు బ్లాగుల్ని పంచకళ్యాణి గుర్రాల్లా నడిపిస్తూ పనిలోపనిగా పొద్దు వెబ్జీన్లో సరదా శీర్షికను కూడా నిర్వహిస్తున్నారు. జ్యోతిగారి ఆసక్తి, చొరవ, అనుకున్న విషయాన్ని సాధించాలనే పట్టుదల నిజంగా మెచ్చుకోదగినవి. పిన్నలకి, పెద్దలకి కూడా అనుసరణీయమైనవి. బ్లాగు మొదలుపెట్టేనాటికి కంఫ్యూటర్ వాడకం పెద్దగా తెలియకపోయినా ("సాధారణ" గృహిణి అనే పదబంధం నాకు అస్సలు నచ్చదు. గృహిణులు ఎవ్వరూ సాధారణం కాదు!) ఓపిగ్గా అడిగి తెలుసుకుంటూ, కొండొకచో తన పిల్లలనే గురువులుగా స్వికరించి, అనేక చిట్కాలని సొంతం చేసుకుని తన బ్లాగుల్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతుంటారు.

తన బ్లాగు చూసినప్పుడల్లా ఆమె ప్రవేశపెట్టే వింత ఫీచర్లు నన్ను విస్మయ పరుస్తుంటాయి. కనుమరుగై పోతున్న ఓణీల గురించి ఒక టపా రాస్తూ ఒక స్లైడ్ షో పెట్టారు. ఓణీధారిణులైన అమ్మాయిల చక్కటి బొమ్మలతో ! బ్లాగులో ప్రవేశించగానే కనిపించే బేనరు ఆ రోజుకి సందర్భోచితమైన చిత్రంతో, సందేశంతో నిత్యనూతనంగా స్వాగతిస్తుంది. తన షడ్రుచులు బ్లాగులో కూడా వంటకాల చక్కని వర్ణచిత్రాలతో ఒక రోలింగ్ బేనరు చదువరులని ఆకర్షిస్తుంది. అంతర్జాలంలో ఎక్కడెక్కణ్ణించో తమాషాలని వెతికి పట్టుకుని తన బ్లాగులో పరిచయం చేస్తుంటారు. కంఫ్యూటర్ తెరమీద ఎక్కడ నొక్కినా అక్కడొక చిన్ని పువ్వు పూసే ఒక సైటు నాకెంతో నచ్చింది.

జ్యోతి హాస్యప్రియత్వం బ్లాగ్జగద్విదితం. తన టపాల్లో రాసుకునే జోకులే కాదు, వేరే బ్లాగుల్లో జ్యోతి రాసే వ్యాఖ్యలు కూడా చదువరుల ముఖాల మీద చిర్నవ్వు మొలిపించక మానవు. ఒకసారి తను రాసిన ఎలుకా సింహం జోకు అర్ధం కాలేదని జనాలు తిక్క కామెంట్లు రాస్తే… అంతే కదా, వొదిలెయ్యండి అనెయ్యగలిగిన హుందాతనం జ్యోతిగారిది. వింతలూ, జోకులే కాకుండా జ్యోతి రాసే టపాలు ఎక్కువగా తనకి ఆత్మీయులైన బ్లాక్కుటుంబ సభ్యులతో చెప్పేసుకునే ఒక అమాయకత్వం కనిపిస్తుంది ఈ రచనల్లొ. " పడ్డానండీ ప్రేమలో మరి", "పెళ్ళైనవారికి మాత్రమే " మంచి ఉదాహరణలు. షడ్రుచులు బ్లాగులో వంటకాల వర్గీకరణ, హడావుడిగా వెతుక్కునే వినియోగదారులకు ఉపకరిస్తుంది.

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా మనిషి తనని తాను కొంత మార్చుకోగలడు కానీ పుట్టిపెరిగిన ఇంటి భోజనపు అలవాట్లని ఒక పట్టాన మార్చుకోలేడు. మాతృభూమిలోనే ఉన్నా ఈ రోజుల్లో సుపుత్రులూ, సుపుత్రికలూ వంటగదిలో అడుగుపెట్టకుండానే పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. ఇటువంటి వారందరికి కోరిన రుచులిచ్చే కల్పతరువు, కామధేనువు జ్యోతిగారి వంటల బ్లాగు "షడ్రుచులు" ౩౦౦ లకు పైగా శాకాహార (శాఖాహారం కాదు , గమనించండి !), మాంసాహార వంటలు, అల్పాహారాలు, పొడులు, పచ్చళ్ళతో, ఔత్సాహికులకే కాదు, ఆరితేరినవారికీ కాసిని కొత్త రుచులు దొరుతాయందులో !

జ్యోతి తాను రాయడమే కాకుండా తన స్నేహితులకి, పరిచయస్తులకి తెలుగు బ్లాగుల్ని పరిచయం చేసి వాళ్ళని కూడా బ్లాగులు రాయడానికి ప్రోత్సహింస్తుంటారు. నేడు లబ్ధ ప్రతిష్టులైన కంఫ్యూటర్ ఎరా పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్, ప్రసిద్ధ కథా రచయిత వింజమూరి విజయ్‍కుమార్ ప్రబృతులు జ్యోతి ప్రోద్బలంతో బ్లాగులు ప్రారంభించినవారే. తొలి బ్లాగు మొదలెట్టిన అనతి కాలంలోనే అన్ని బ్లాగుల్లోనూ కలిపి 1500 టపాలు వెలువరించిన ఘనత జ్యోతిగారిది. తెలుగు బ్లాగుల్లో ఖచ్చితంగా ఇది అపూర్వం !

సమీక్ష : ఎస్. నారాయణస్వామి

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

dear nallamotu sridhar garu
greetings from your blog reader.
what i want to say is this
i wanted to create a blog in telugu
i read the write up in telugu ennadu book about how ur team have achieved great heights with regads to creating a telugu bloggers association, i don,t have ur personal id so iam taking this opprtunity to congratulate u and ur team, can u ghelp me to create m own telugu blog and help me to maintain mainly i will be publishing social awareness articles also some fun material

అజ్ఞాత చెప్పారు...

We are happy to introduce a new BLOG aggregator. http://telugu.blogkut.com. Blogs, news, Videos are aggregated automatically through web. No need to add your blogs to get listed. Have to send a mail to get listed in comments section. Comments section is operating only for Blogspot right now. We welcome everybody to have a look at the website and drop us your valuable comments.


Website is BLOGKUT

సత్యసాయి కొవ్వలి Satyasai చెప్పారు...

అంతేకాకుండా చవకగా మెరుగైన సబ్బుల తయారీ గురించి అందరికీ తెలియచెప్పి, అదే చేత్తో దుష్టవ్యాఖ్యలు రాసే దుష్కరులని కడిగి పాడేసిన ఝాన్సీరాణి మన జ్యోతక్క.
మంచి షడ్రసోపేతమైన తెలుగు బ్లాగు ఆవిడది.
సమీక్ష బాగుంది.

cbrao చెప్పారు...

సమీక్ష సమగ్రంగా వుంది. జ్యోతక్క - కొద్దికాలంలో 1500 టపాలు రాయటం- ఇది Limca Book of Records లోకి ఎక్కవలసిన విషయమే. జ్యోతక్కకు అభినందనలు.

యోగేంద్ర చెప్పారు...

జ్యోతి గారికి అభినందనలు

తెలుగు'వాడి'ని చెప్పారు...

బ్లాగుల గురించి సమీక్ష వ్రాయాలనుకోవటం నిజంగా అభినందించవలసిన విషయం అందుకు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మరియు ద్వితీయవిఘ్నం దాటటం కూడా బహుధా రశంసనీయం

నాకు కొత్తపాళీ గారి బ్లాగుల గురించి అంత ఎక్కువ అవగాహన లేదు (చాలా వరకు చదివాను గానీ) కనుక ఇంతకు ముందు సమీక్షకు నేను స్పందించలేదు కానీ ఇప్పుడు కూడా స్పందించక పోతే ఈ సమీక్షలన్నీ ఇలాగే ఉంటాయేమో అనే భయంతో, నా అభిప్రాయం వరకు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పటమే నా ఈ స్పందన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

మేము ఏదో క్లుప్తంగా నాలుగు వాక్యాలు వ్రాద్దామనుకున్నాము లేదా ప్రింట్ మీడియాలో ఉన్నది ఇక్కడ తర్జుమా చేయటమే లేదా తెలిసిన వాళ్లకు మరలా ఒకసారి గుర్తుచెయ్యటనికే(ఇది ఖచ్చితంగా కాదు అని నాకు అనిపిస్తుంది) ఈ ప్రయత్నమనుకుంటే ... ఇక్కడి నుంచి క్రింద ఉన్న నా అభిప్రాయం చదవకపోవటమే మంచిదేమో ...


ఈ టపాలోని సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం నాకు అనిపించినంతలో ... ముందుగా కొత్తపాళీ గారితో మొదలు పెట్టాము కాబట్టి వెంటనే జ్యోతి గారి గురించి వ్రాయకపోతే బాగోదేమో కనుక ఏవో నాలుగు వాక్యాలు హడావిడిగా వ్రాసేద్దాము అని తప్ప నిజంగా తన బ్లాగులను చదివి, పరిశోధన చేసి లేదా కనీసం ఈ టపాలో ప్రస్తావించిన విషయాలకన్నా లంకెలు సేకరించకపోవటం/ఇవ్వకపోవటం నిజంగా శోచనీయం..

1. జ్యోతి గారి పాత వర్డ్ ప్రెస్ బ్లాగు అడ్రస్ ఇచ్చారు. హైపర్ లింక్ లేదు దానికి. కొత్త బ్లాగర్ అడ్రస్ ఇవ్వలేదు.

2. అయిదు బ్లాగులు అన్నారు...వాటి పేర్లు లేవు, లంకెలు లేవు (ఒక్క షడ్రుచులకు తప్ప)

3. ఓణీల గురించి స్లైడ్ షో అన్నారు ... లంకె లేదు (ఈ టపా నేను చూడలేదు)

4. ఎలుక సింహం జోకు టపా, దానికి వచ్చిన వ్యాఖ్య అందుకు జ్యోతి గారి 'వదిలెయ్యండి' అన్న ప్రతిస్పందన ... దేనికీ లంకెలు లేవు.

5. " పడ్డానండీ ప్రేమలో మరి", "పెళ్ళైనవారికి మాత్రమే " అని రెండు మంచి ఉదాహరణలు ఇచ్చారు .. చాలా మంచి ప్రయత్నం...షరా మామూలుగా లంకెలు లేవు..

6. విజయకుమార్ గారి పేరు చెప్పారు...బ్లాగు పేరు లేదు కనుక లంకె ఎలాగూ ఉండదు...అలాగె శ్రీధర్ గారి పేరు, బ్లాగు, లంకె కూడా షరా మామూలే

నేను ఈ లంకెల గురించి ఇంతగా ప్రస్తావించటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, వంద, నూట యాభై హిట్లు వచ్చిన టపాలకు కూడా పట్టు మని పది మంది (ఉదా : నేను లేటెస్ట్ గా వ్రాసిన టపాకు వచ్చిన హిట్లు 120, రేటింగ్ ఇచ్చింది ముగ్గురు ... కారణాలు ఏవైనా కానీ ... నా టపా మొత్తం చివర వరకు చదివేంత బాగాలేకపోవటం, లేక మధ్యలోనే ఏదో ఒక లంకె నొక్కటంతో వేరే విండో ఓపెన్ అవ్వటమో లేక వారు ఇవ్వాలి అనుకున్న సూపర్ డూపర్ పరమ చెత్త అనే దానికి ఏ స్టార్ సరిపోకపోవటమో) కూడా రేటింగ్ ఇవ్వటం లేదు (ఇక్కడ జస్ట్ ఏదో ఒక స్టార్ మీద నొక్కటమే) అలాంటిది ఇక్కడ టపాల గురించి తెలుసుకోని జ్యోతి గారి బ్లాగులోకి వెళ్లి ఆ టపాలు వెదుక్కోని చదువుతారు అని ఆశించటం నిజంగా చాలా అత్యాశే అవుతుంది....

ఇక అసలు విషయానికి వస్తే, అసలు తను వ్రాసిన బ్లాగుల్లో ఈ సమీక్షకుడికి బాగా నచ్చిన టపాలు (మచ్చుకు కొన్ని), ఎక్కువ వ్యాఖ్యలు వచ్చినవి కొన్ని, తన బ్లాగుల్లో ఏయే వర్గాల మీద ఎక్కువగా టపాలు వ్రాశారు....సగటున ఎన్ని బ్లాగులు వ్రాస్తున్నారు, ఎన్ని వైవిధ్యభరితంగా వ్రాస్తున్నారు, తన టపాలలో వ్రాసే విషయంపై తనకు ఉన్న అవగాహన, మక్కువ, ఉత్సాహం మొదలగు వాటి గురించి ప్రస్తావించకుండా ఒక 1500 టపాలు అని చెప్పటం రాశి గురించి మాత్రమే ప్రస్తావించినట్లుగా ఉంది.

ఒక్క ముక్కలో ఈ సమీక్ష ఎలాగుంది చెప్పాలి అంటే .... జ్యోతి గారి గురించి బాగా తెలిసిన వారికి మరొక్క సారి వారి గురించి, తెలుగు బ్లాగ్లోకానికి వారు చేస్తున్న సేవలు, సహాయం, ప్రోత్సాహం మొదలగు వాటి గురించి గుర్తు చేయటానికి .. లాగా ఉంది.

నా అభిప్రాయాలు ఇంత నిక్కచ్చిగా చెప్పటానికి కారణం.... ఇక తెలిసిన వాళ్లు వచ్చి ఆహా, ఓహో అంటారు కాబట్టి మిగతా సమీక్షలు కూడా ఇలాగే ఉంటే బాగుంటుందేమో అని మీరు భావించకూడదు అని ...

ఇంతటి మంచి/గొప్ప ప్రయత్నానికి/శ్రమకు కొన్ని చిన్న చిన్న మెరుగులతో ఇంకా ఎంతో అధ్బుతంగా చేయవచ్చు అనీ...ముఖ్యంగా కొత్తవారికి ఈ సమీక్షతో జ్యోతి గారి గురించి తెలుసుకున్న విషయాలతో కలిగిన ఉత్సాహాన్ని .. లంకెలు ఇవ్వటం ద్వారా సులభంగా ఆయా టపాలను/బ్లాగులను చేరుకోవటానికి అవకాశం కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పటమే నా మరో ముఖ్య ఉద్దేశ్యం...

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

kishore,
u can chat with me here.. http://computerera.co.in/chat and i can help in starting a blog..

తెలుగువాడు గారు,
మీరు చెప్పింది నిజమే.. ఇంతవరకు ఇచ్చిన బ్లాగు సమీక్షలు నవంబరు, జనవరి నెలల్లో ఇచ్చినవి. నాకున్న పరిమితులవల్ల సగం పేజి బ్లాగుకు, సగం వికి కి ఇస్తున్నాను . ముందు ముందు వీలైతే ఒక్కో పేజీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇకపోతే ఇక్కడిచ్చింది పత్రికలో వచ్చింది వచ్చినట్టుగానే. లింకులు ఇవ్వడం మంచిదే మీరన్నట్టు. జ్యోతిగారిని అడిగి ఇక్కడ చెప్పిన టపాలకు లింకులు ఇస్తా. మీరు శ్రమ అనుకోకుండా జ్యోతిగారు బ్లాగు సమీక్షకు ఆహ్వానం పలికిన టపాలో సమీక్ష ఎలా ఉండాలో, ఎలాటి వివరాలు ఉండాలో కామెంట్ రాస్తారా ప్లీజ్...

నల్లమోతు శ్రీధర్

cbrao చెప్పారు...

గతంలో రేడియోలో సంక్షిప్త శబ్దచిత్రం అంటూ, నేడు mini movie అంటూ TV programmes వస్తున్నై. ఈ సమీక్షను మినీ సమీక్ష అనుకుంటే,సరిపోతుంది. అక్క ఈ రోజు మెగా బ్లాగరు.ప్రచండ బ్లాగరి. కీ బోర్డ్ పై రాస్తే, ఇంత తక్కువ కాలంలో, ఇన్ని టపాలు రాయటం అసాధ్యం. కీబోర్డ్ తో కాదు, అక్క టపాలు కంటి చూపుతో రాస్తుంది.

తెలుగు'వాడి'ని చెప్పారు...

శ్రీధర్ గారు ... జ్యోతి గారి టపా చదివానండి ... దానికి సూచనలు, సలహాలు వ్రాసే ఆలోచనలోనే ఉన్నాను .... ఇప్పుడు మీరు చెప్పినాక కొంచెం తొందరగా వ్రాయవలసిన అవసరం వచ్చింది :-) అతిత్వరలో, వీలైతే సోమవారం లోపు వ్రాయలనేది ప్రస్తుత లక్ష్యం ;-) చూద్దాం ఏమవుతుందో !??!

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

బ్లాగ్లోకంలో జ్యోతి గారి సేవలు ఎనలేనివి. ఆమె గురించి చెప్పడానికి అక్కడ స్థలం చాలదు కూడా. 'తెలుగువాడి'ని గారి వ్యాఖ్య ఆలోచనాత్మకంగా వుంది. ఆయన అన్నట్టు ఆమె బ్లాగుల చిరునామాలు యిచ్చి వుంటే యింకా బావుండేది. మొత్తానికి కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు.

నిషిగంధ చెప్పారు...

సమీక్ష చాలా చక్కగా ఉందండి.. మొన్ననే జ్యోతి గారితో పరిచయం అయింది (కూడలి కబుర్లు లో).. కొత్త అని మొహమాట పడుతూ దిక్కులు చూస్తున్న నన్ను చక్కగా పలకరించారు.. ఈ బ్లాగ్ప్రపంచంలో కొన్ని తెలియని విషయాల గురించి అడగగానే అవసరమైన లింక్స్ ఇచ్చారు.. తను రాసిన టపాలు చదువుతుంటే నిజంగా తన ఆసక్తిని మెచ్చుకోకుండా ఉండలేము!! నాకు చాలా ఇష్టమైన టపా 'పడ్డానండి ప్రేమలో మరి ' :-)

జ్యోతి చెప్పారు...

మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు..

తెలుగువాడుగారు, మీరు చెప్పింది నిజమే. శ్రీదర్ పత్రికలో ప్రచురింపబడింది అలాగే ఇక్కడ ఇచ్చాడు. లింకులు ఇవ్వడం నా భాధ్యత. కాని ఆ బ్లాగులో 265 పోస్టులు ఉన్నాయి. మొదట్లొ తెలీక చాలా వాటికి లేబిల్స్ ఇవ్వలేదు. అతి కష్టం మీద వీలైన లింకులు ఇచ్చాని. త్వరలో నా పాత , కొత్త బ్లాగులోని ముఖ్యమైన టపాల విందు ఇవ్వబోతున్నాను. మీ సలహాలు సూచనలు నా బ్లాగులోకాని, మెయిల్ కి కాని నిర్మొహమాటంగా ఇవ్వండీ. నన్ను నేను దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను సరదాగానే రాస్తుంటాను అన్నిబ్లాగులు.

జ్యోతి చెప్పారు...

సత్యసాయిగారు,

మనలోని మురికిని, బట్టల మురికిని, మన చుట్టు ఉన్న మురికిని మనమే శుభ్రం చేయాలి కదండి. తప్పు చేస్తే ఒప్పుకుంటాను, అనవసరంగా నన్ను ఏదన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోనండి . దులిపేయాల్సిందే..

తెలుగు'వాడి'ని చెప్పారు...

శ్రీధర్/జ్యోతి గారు :

సమీక్ష ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై నా సూచనలు/సలహాలు జ్యోతి గారి ఆహ్వానం టపాలో... చదవండి ఇక్కడ