9, మార్చి 2008, ఆదివారం

రేగోడియాలు


http://trajarao.wordpress.com/

తాడిమేటి రామ శ్రీనివాస లక్ష్మీనారాయణ శివనాగ రాజారావు అనబడే తాడిమేటి రాజారావుగారి బ్లాగు ఇది. కొల్లేటి చాంతాడంత ఉన్న తన పేరు పురికొసగా మారడానికి గల కారణాలు వివరిస్తూ ఆగస్టు 2007 లో బ్లాగు మొదలెట్టారు రాజారావుగారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ వాస్తవ్యులైన రాజారావుగారు ప్రస్తుతం San Jose,California లో Cisco Systems లో Software Engineer గా పనిచేస్తున్నాను. వారి అర్ధాంగి వసుంధర కూడా బ్లాగరే..

చాలా మంది బ్లాగర్లలాగే రాజారావుగారు తన బ్లాగులో ఎక్కువగా తన ఆలోచనలు, మరిచిపోలేని జ్ఞాపకాలు, చిన్ననాటి ఆటలు, అమెరికాలో పడుతున్న తిప్పలు , తను చూసిన సినిమాల గురించి రాస్తూ అందరితో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. నేను నా ఊరు అనే వర్గంలో తన చిన్ననాటి ఆటలు, తన ఊరిలోని విశేషాలు ఎంతో వివరంగా చెప్పారు. తన బ్లాగులో ఊసుపోక జాబులు రాయకుండా ఎంతో మానసిక వికాసాన్నీ, శారీరక వ్యాయామాన్నీ, మరచిపోలేని అనుభూతులనీ, మిత్రులనీ అందించిన కొన్ని ఆటల గురించి వివరించారు. ముఖ్యమైనవి ఉదయం మొదలుపెట్టి రాత్రి అమ్మలు వచ్చి చెవి మెలేసి పట్టుకెళ్ళేదాకా అడిన సబ్జా విండూర్, పెంకులాట, రోజు అమ్మతో చీవాట్లు తిన్నా విడువని వీపు చట్నీలు, అష్టాచెమ్మా, వైకుంఠపాళి మొదలైనవి . రాజారావుగారి ఈ టపాలు , ఎందరో బ్లాగరులు ఉద్యోగ,కుటుంబ భాధ్యతలలో పడి మర్చిపోయిన చిన్ననాటి స్మృతులను మళ్ళీ గుర్తుకు చేసుకునేలా చేసాయి అంటే అతిశయోక్తి కాదు. రాజారావుగారి బ్లాగులోని టపాలు చదువుతుంటే అవి మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగానే ఉంటాయి. అంత వివరంగా ఉంటాయన్నమాట. అరే !ఇవి మనకు తెలిసినవే కదా అనుకోవడం కూడా జరుగుతుంది.ఇక సినిమాల గురించి రాజారావుగారు చేసే విశ్లేషణలు చదివే వారికి ఇక ఆ సినిమాల గురించి ఎటువంటి తర్జన భర్జన లేకుండా ఒక నిర్ణయానికొచ్చేస్తారు. మంచి సినిమా ఐతే చూడొచ్చు అని బుర్ర చెడగొట్టే సినిమా ఐతే బ్రతికిపోయామని అనుకుంటారు. రాజారావుగారు నా అభిప్రాయాలు అనే వర్గంలో రాసిన ఒక టపా "నెరవేరిన నా జీవితాశయం" నిజంగా మహోన్నతమైనది. ఒక్క గదిలో కాపురముంటు అష్ట కష్టాలు పడి తమను పెంచి పెద్ద చేసిన తండ్రి షష్టిపూర్తికి ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చి అందుకు తనకు తోడుగా ఉన్న ధర్మపత్నికి మనసారా కృతజ్ఞ్తతలు చెప్పుకున్నారు.

రాజారావుగారు తన అభిప్రాయాలని చాలా నిర్మొహమాటంగా చెప్తారు. తన చాకిరేవు వర్గంలో అమెరికాలోని భారత సూపర్ బజార్లలొ జరిగే తేదీ ఎక్స్ పైరు అయిపోయిన సరుకులు అమ్మడం గాని, జెమిని టీవీలో వచ్చే "చిత్ర"హింసలు, ఎన్నో ఇంగ్లీషుపదాలను తెలుగులోకి మార్చాలని ప్రయత్నిస్తున్న తెలుగు బ్లాగర్లని, చందమామ, చిరుత చూసి కలిగిన అనుభవం మొదలైన వెన్నింటినో నిజంగానే చాకిరేవు పెట్టేసారు. మా ఊరు వీధి సినిమా కాని గోళీసోడా కాని చదివిన వారెవరైనా వావ్ ! సూపర్ అనుకోకమానరు తమ అనుభవాలు కూడా ఏకరువు పెట్టకుండా ఆగలేరు మరి. అప్పుడప్పుడూ తమ అమెరికా అనుభవాలు కూడా సవివరంగా రాస్తుంటారు.తరచుగా రాయకున్నా, ఆయన రాసిన టపాలన్నీ కూడా చదువరులను ఆకర్షించి ఆలోచింప చేస్తాయి. ఈ రెగోడియాలు బ్లాగు పేరు , దాని ట్యాగ్ లైన్ లాగానే నిజంగా ఈ రేగొడియాలు తీయ తీయగా కొంచెం కారం కారంగా ఉంటాయనడం లో అతిశయోక్తి లేదు.


సమీక్షకులు తమ పేరు గోప్యంగా ఉంచారు.

2 కామెంట్‌లు:

రాధిక చెప్పారు...

సమీక్ష చాల బాగుంది.సమీక్షకులకు అభినందనలు.నా అభిమాన బ్లాగుల్లో దీనిని చేర్చడం మరిచిపోయా.ఇప్పుడే చేరుస్తాను.ధన్యవాదాలు.

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

ఈ సమీక్ష ద్వారా శ్రీ రాజారావు గారి గురించి తెలిసింది. వారికి నా అభినందనలు. వ్యాసకర్తకూ, కంప్యూటర్ ఎరా వారికీ నా కృతజ్ఞతలు.