16, నవంబర్ 2007, శుక్రవారం

మెమరీ పనితీరు - మెరుగు పరుచుకునే మార్గాలు

మెమరీ అంత ఎక్కువగా ఉంటే అప్లికేషన్ ప్రోగ్రాములు అంత వేగంగా పనిచేస్తాయని మనకు తెలుసు. అయితే RAM ఎలా పనిచేస్తుంది. దాని పనితీరుని పెంపొందించడానికి మనం స్వతహాగా చేయవలసిన సెట్టింగుల గురించి అవగాహన లేనివారికి ఈ వ్యాసం ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుందంటే ..

ప్రతీ మెమరీ మాడ్యూల్‌పై పలు చిప్‌లు అమర్చబడి ఉండడం గమనించే ఉంటారు. ఆయా చిప్‌లలొ ప్రతీ చిప్‌పై సూక్ష్మమైన కెపాసిటర్లు అనేకం ఒక సముదాయంగా పొందుపరచబడి ఉంటాయి. వీటిలో ప్రతీ కెపాసిటర్ కొంత విద్యుత్‌ని స్వీకరించగలుగుతంది. ఇలా ఏదైనా కెపాసిటర్ విద్యుత్ స్వీకరించినట్లయితే అప్పుడు బైనరీ విలువ 1ని ఆ కెపాసిటర్ కలిగి ఉన్నట్లు భావించాలి. కెపాసిటర్ విద్యుత్‌ని తీసుకోకపోతే బైనరీ విలువ 0కలిగి ఉన్నట్లు పరిగణించాలి. మన ఫైళ్ళు మొత్తం ఇలా 0, 1, లతో కూడిన బైనరీ డేటాగానే స్టోర్ చెయ్యబడుతుందని మీకు తెలిసిందే! మెమరీలో డేటాని స్టోర్ చెయ్యడానికి తిరిగి దానిని చదవడానికి పిసి ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. ఒక్కోసారి కాస్మిక్ కిరణాల ప్రభావం వల్ల మెమరీ చిప్‌లోని కెపాసిటర్లు తాము నిల్వ ఉంచుకున్న విద్యుత్‌ని కోల్పోతుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని సరిచేసి డేటాకి నష్టం వాటిల్లకుండా చేయడానికి ECC (Error Correction Code) అనే టెక్నాలజీని RAMలో వాడుతుంటారు.

నిలువు , అడ్డ వరుసలు

మన పిసి మెమరీ నుండి ఎదైనా అంశాన్ని రీడ్ చెయ్యాలని కోరుకున్నప్పుడు RAM కంట్రోలర్ సర్క్యూటరీ అ అంశం RAM లోని ఏ చిప్‌లో, ఏ అడ్డ వరుస, నిలువు వరుసలోని కెపాసిటర్‌లో స్టోర్ చేయబడి ఉందన్నది Row Address Strobe (RAS), Column Address Strobe(CAS), అనే పిన్‌ల ఆధారంగా పిసికి తెలియజేస్తుంది. ఈ పద్ధతి వల్ల రామ్ కంట్రోలర్ సర్క్యూటరీపై పెద్దగా భారం పడకుండా వీలైనంత వేగంగా మెమరీ నుండి డేటా యాక్సెస్ చేయబడుతుంది.

మెమరీ పెర్‌ఫార్మెన్స్ పెంచే BIOS సెట్టింగులు

సహజంగా BIOS లో RAM కి సంబంధించి ఐదు సెట్టింగులు లభిస్తుంటాయి. మొదటిది 'కమాండ్ రేట్ '.డేటాని మెమరీలో స్టోర్ చెయ్యవలసి వచ్చినప్పుడు మెమరీ మాడ్యూల్‌లోని ఏ చిప్‌ని ఎంచుకుని... దానికి కమాండ్లని పంపడానికి పట్టే సమయం ఇది. అలాగే మెమరీలోని కాలమ్‍ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలమ్ ఉండి డేటా రావడానికి మధ్య గల వ్యవధిని CAS Latency అని పిలుస్తారు. ఒక Row ని యాక్సెస్ చేయడం ముగించి తర్వాతి వరుస యాక్సెసింగ్ ప్రారంభించడానికి మధ్య గల వ్యవధిని RAS Percharge Delay(tRP) అంటరు. ఇకపోతే ఒక Rowని , కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మధ్య గల వ్యవధిని RAS to CAS Delay (tRCD) అంటారు. ఏక్టివేషన్, ప్రీ చార్జ్ కమాండ్లకు మధ్య గల వ్యవధిని Active Precharge Delay (tRAS) అనే పేరుతో వ్యవహరిస్తారు. వివిధ BIOS ప్రోగ్రాముల్లో ఈ సెట్టింగులు ఇవే పేర్లతో ఉండవచ్చు. లేదా సమీప అర్ధం ధ్వనించే వేరే పేర్లతో ఉండవచ్చు.ఏది ఏమైనా ఈ ఐదు సెట్టింగుల Delayలను తగ్గించడం వల్ల సిస్టమ్ పని తీరు మెరుగుపడుతుంది అయితే BIOSలోకి వెళ్ళి గుడ్డిగా ఈ సెట్టింగులను మార్చకండి. మీరు వాడుతున్న RAM అలా Delayలను తగ్గించడాన్ని సపోర్ట్ చేసేదైతేనే ఉపక్రమించండి. ఒకవేళ తక్కువ delayలటో పనిచేయగల సమర్ధత మీ మెమరీ మాడ్యూల్‌కి లేనట్లయితే సిస్టమ్ క్రాష్, లాక్ అయిపోవచ్చు. ఒక సారి ఆ పరిస్థితి తలెత్తితే మదర్‌బోర్డ్‌పై CMOS Clear జంపర్‌ని తోలగించడం ద్వారా సిస్టమ్‍ ని పూర్వస్థితికి తీసుకు వెళ్ళవచ్చు.
థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు ...

మనం క్లోజ్ చేసిన ప్రోగ్రాములు మెమరీ నుండీ పూర్తిగా తమ సమాచారాన్ని తొలగించకపోవడం వల్ల పిసిని ఆన్ చేసిన తర్వాత కొన్ని గంటలకు RAM లోనీ ఫ్రీ స్పేస్ ఉండవలసినంత ఉండదు. దీనినే ' మెమరీ లీకింగ్ ' అంటారు. మెమరీలో వౄధాగా నిలిచిపోయిన డేటాని తొలగించడంతో పాటు చెల్లాచెదురుగా పడిఉన్న డేటాని ఒక క్రమపద్ధతిలో పెట్టేలా RAM Defrag చేసే RAM Booster వంటి థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించడం వల్ల మెమరీ సక్రమంగా పనిచేస్తుంది.

ఇతర జాగ్రత్తలు ...

చాలామంది అనేక అప్లికేషన్ ప్రోగ్రాముల్ని ఒకేసారి ఓపెన్ చేసి పనిచేస్తుంటారు. వాటిలో దీర్ఘకాలం పాటు అవసరం లేని ప్రోగ్రాముల్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తుండడం వల్ల లేదా అవసరం అయినప్పుడే ఓపెన్ చేసుకోవడం వల్ల మెమరీ లీకింగ్ సంభవించదు. 3D గేములు, Maya, 3D Studio Max వంటి మెమరీని అధికంగా ఉపయోగించుకునే అప్లికేషన్లని ఒకసారికి ఒక దానిని వాడడమే శ్రేయస్కరం. అన్నింటిని ఒకేసారి వాడడం తప్పనిసరైతే ఏమీ చెయ్యలేమనుకోండి. అలాగే మెమరీని అప్‌గ్రేడ్ చెయ్యదలుచుకుంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ఒకే ఒక మాడ్యూల్‌ని సిస్టమ్‌లో అమర్చుకోండి తప్ప పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.

కామెంట్‌లు లేవు: