10, ఆగస్టు 2007, శుక్రవారం

కంప్యూటర్లో టి.వి. ప్రోగ్రాములు ఎలా చూడొచ్చు?



ఇటీవలి కాలంలో సామాన్య ప్రజానీకానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో శాటిలైట్ చానెళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద కంప్యూటర్ ఉంటే ఒక పక్క పనిచేసుకుంటూనే ఒక చిన్న విండోలో టివీ ప్రోగ్రాములు చూసే అవకాశం ఉంది. ఇలా కంప్యూటర్ ద్వారా టివి ప్రోగ్రాములు చూడడానికి మీ కంప్యూటర్లో 'టివి ట్యూనర్ కార్డ్' అనే హార్డ్‌వేర్ పరికరాన్ని అదనంగా అమర్చుకోవలసి ఉంటుంది. దీన్ని మీ పిసిలో ఇన్‌స్టాల్ చేసుకుంటే నిరభ్యంతరంగా మీ కంప్యూటర్ ద్వారా కేబుల్‌లో వచ్చే అన్ని ప్రోగ్రాములు చూడవచ్చు. దీని గురించి వివరంగా చూద్దాం.టెలివిజన్ ప్రసారాలు అనలాగ్ సిగ్నళ్ళ రూపంలో ఉంటాయి. అయితే కంప్యూటర్ కేవలం డిజిటల్ రూపంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే ప్రాసెస్ చెయ్యగలుగుతుంది. కాబట్టి టెలివిజన్ అనలాగ్ సిగ్నళ్ళని కంప్యూటర్ అర్ధం చేసుకోగలిగే డిజిటల్ రూపంలోకి మార్చి వాటిని కంప్యూటర్ మానిటర్‌పై చూడగలిగే విధంగా వీలు కల్పించే పరికరమే 'టివి ట్యూనర్ కార్డ్'. దీనిని మీ కంప్యూటర్లోని PCI స్లాట్‌పై అమర్చవలసి ఉంటుంది. మార్కెట్లో ఎక్స్ టర్నల్ టివి ట్యూనర్ కార్డు లు కూడా లభిస్తున్నాయి. మీరు కొత్తగా టివి ట్యునర్ కార్డ్ కొనుగోలు చేసినప్పుడు దానితోపాటు టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించడానికి, నచ్చిన ప్రోగ్రాములను కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌పై రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే డివైజ్ డ్రైవర్ల సిడి మరియు, టివికి మాదిరిగానే ఓ రిమోట్ కంట్రోల్ కూడా లభిస్తుంది.

మదర్‌బోర్డ్‌పై స్లాట్‌లో కార్డ్‌ని అమర్చిన తర్వాత దాని యొక్క డ్రైవర్లని మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది.దాంతో Start Menu> Programs గ్రూప్‌లో టి.వి.ట్యూనర్ కార్డ్‌కి సంబంధించిన ఓ సబ్ గ్రూప్ ప్రత్యక్షమవుతుంది.అందులో సరైన ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా స్క్రీన్‌పై టి.వి. ప్రసారాలను పొందవచ్చు.


వీడియో సిడిల్లో, టెలివిజన్‌లో ప్రసారం అయ్యేటంత నాణ్యంగా టి.వి ట్యూనర్ కార్డ్ ద్వారా కేబుల్ ప్రసారాలను రికార్డ్ చేసుకోవాలంటే మాత్రం Win VCR వంటి వీడియో రికార్డింగ్ సాప్ట్ వేర్లను ఆశ్రయించక తప్పదు.ఎంతో నాణ్యవంతమైన MPEG1, MPEG2, ASF వంటి ఫైల్ ఫార్మేట్లలో ఈ సాప్ట్ వేర్ల ద్వారా కేబుల్ ప్రసారాలను రికార్డ్ చేసుకోవచ్చు.

టి.వి ట్యూనర్ కార్డ్ సాప్ట్ వేర్‌లో Always on top అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేసినట్లయితే వీడియో విండో ఇతర అన్ని విండోలకన్నా పై భాగంలో చూపించబడుతుంది. దీని ద్వారా మీరు వర్డ్, పేజ్‌మేకర్, ఫోటోషాప్ వంటి ఇతర సాప్ట్ వేర్లపై నిరాటంకంగా పనిచేసుకుంటూ మరో ప్రక్క టెలివిజన్ ప్రసారాలను వీక్షించవచ్చు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఎక్స్ టర్నల్ టివి ట్యూనర్ కార్డు అయితే సి.పి.యు తో సంబంధం లేకుండా మానిటర్ కి అనుసంధానించి చూడవచ్చు. అయితే కార్యక్రమాలు రికార్డ్ చేయటం కుదరదు అనుకుంటా.

అజ్ఞాత చెప్పారు...

అవును లియో గారూ, ఎక్స్త్ టర్నల్ టివి ట్యూనర్ కార్డ్ ని మీరు చెప్పినట్లు నేరుగా మోనిటర్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రోగ్రాములను రికార్డ్ చేయడం కుదరదు.
-నల్లమోతు శ్రీధర్