31, జనవరి 2008, గురువారం

కొత్తపాళీ …. నవంబర్ 2007


http://kottapali.blogspot.com

ముచ్చటగా మూడు వసంతాలు కూడ నిండని తెలుగు బ్లాగ్మయంలో ఒక యేడాదిగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ మళ్ళీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలాంటి టపాలతో చదువరులను అలరించడం ఆషామాషీ వ్యవహారం కాదు. సరిగ్గా అలాంటి అరుదైన విలక్షణత్వాన్ని సొంతం చేసుకున్నదే కొత్తపాళీ గారి బ్లాగు కొత్తపాళీగారి అసలు పేరు నారాయణస్వామి. కొత్తపాళిగారు ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికాలోని మిషిగన్ రాష్టంలో ఉంటున్నారు. కొత్తపాళిగారు నిర్వహిస్తున్న నాలుగు బ్లాగులలో ఇక్కడ మనం సమీక్షిస్తున్న "కొత్తపాళి" ఒకటి మాత్రమే. మిగతా బ్లాగులు విన్నవీ కన్నవీ , Classical Telugu Poetry in Translation, Classical Telugu Poetry . కొత్తపాళి బ్లాగు గత ఏడాది అక్టోబర్ నెలలో మొదలైంది. రచయిత తన బ్లాగులో తాను చెదురుమదురుగా వ్రాస్తున్న టపాలని, విషయాన్ని బట్టి గుర్తుంచుకోవడానికి వీలుగా 12 వర్గాలుగా విభజించారు. అవి. 1.మాటలు, 2.వ్యక్తులు, 3.కవిత్వం, 4.సంగీతం, 5.నీతి, 6.(అ)సాధారణ వ్యక్తులు, 7.జ్ఞాపకాలు, 8.నా గొంతు, 9.పుస్తకాలు, 10.ప్రకృతి, 11.భక్తి, 12.సంస్కృతం. ఈ అన్ని వర్గాల క్రింద పలు రచనలున్నాయి.

కొత్తపాళిగారి రచనలకు ప్రేరణ : "నేనూ నా కుటుంబం అనే స్వార్ధపరిధిని దాటి ఒక్క అడుగన్నా బయటికి వెయ్యాలి. ఊరికే మట్టిబొమ్మలా పెట్టినచోటే కూర్చుంటే ఎవరికి ప్రయోజనం .. ’కలుగ నేటికి? తల్లుల కడుపు చేటు’.. మీకిష్టమైన మీకు తృప్తి నిచ్చే పని కాబట్టి చెయ్యాల్సిన వ్యక్తి మీరే.. ఎందుకంటే ఇంకెవ్వరూ చెయ్యరు కాబట్టి, చెయ్యాల్సిన సమయం ఇప్పుడే" అంటారు రచయిత ’మనిషై పుట్టినందుకు’ అనే టపాలొ.

ఆయన ఇప్పటివరకు చేసిన టపాలన్నీ ఈ ప్రవచిత ఆశయానికి అనుగుణంగానే ఉండడం గమనార్హం. పైకి మాటామంతీలా కనపడే టపాల్లో సైతం ఏదో అంతర్లీన సందేశం మనల్ని అలవోకగా స్పృశిస్తుంది. " కదిలేది కదిలించేదీ పెను నిద్దుర వదిలించేది " అని కవిత్వం గురించి శ్రీశ్రీ చెప్పినది గుర్తొస్తుంది కొత్తపాళిగారి బ్లాగు చదివినప్పుడు. విభిన్న లక్ష్యాలకు అంకితమైన మహామనీషుల గురించి టూకీగా ఆయన రాసిన స్కెచ్‍లు తెలుగు బ్లాగు లోకంలో ఒక కొత్త ఒరవడిని దిద్దాయి. ఆ విధంగా ఆయన రచన అనే సంఘసేవకురాలి గురించి, కుర్ట్ వానగట్ అనే రచయిత గురించి, మేడసాని మోహన్‍గారి కృషి గురించి, నవోదయ పబ్లిషర్స్ అధినేత శ్రీ అట్లూరి రామమోహనరావుగారి గురించి, అమెరికాలో తెలుగు భాషాభోధనకై కృషి చేస్తున్న శ్రీ వేమూరి వేంకటేశ్వరరావుగారి గురించి విపులంగా నెజ్జనులకు తెలియజేసారు.

తెలుగు భాషాభిమానం : ఈ విషయంలో నివాసాంధ్రులు ప్రవాసాంధ్రుల నుంచి నేర్చుకోదగినది ఎంతైనా ఉంది. కొత్తపాళిగారి ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నప్పటికీ ఆయనలో తెలుగు భాషాభిమానమూ, మాతృదేశాభిమానమూ ఇనుమడించాయే గాని మసకబారలేదు. "సీసపద్యం అంటే ఏంటి? అని అడిగేవాళ్ళు లక్షణ పద్యాన్ని వందసార్లు ఇంపోజిషన్ రాయాల్సి ఉంటుంది." అంటారు చలోక్తిగా "మీకిష్టమైన సీసపద్యం" అనే టపాలో!

సామాన్యత్వంలో అసామాన్యత్వం : "రొటీన్ అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది" అనే భావం స్పురిస్తుంది.. నా మట్టుకు నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు రచయితల్ని, కళాకారుల్ని చూసి అసూయపడతారు.. వాళ్లకు రొటీను లేదని. అది పొరబాటు.. పేరుపొందిన ఏ కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యడం కనిపిస్తుంది. " అంటారు కొత్తపాళి ఒక చోట. తెలుగు బ్లాగింగులో నూతన ప్రమాణాల్ని నెలకొల్పి అనతికాలంలోనే అనల్పమైన ప్రాచుర్యాన్ని ఆర్జించుకున్న కొత్తపాళి బ్లాగు అవశ్యం, పఠనీయం, పాఠనీయం..

సమీక్ష : తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

6 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

సమీక్ష క్లుప్తంగా కాక, ఇంకొంచం వివరంగా వుంటే, ఇంకా బాగుండేది.

అజ్ఞాత చెప్పారు...

సి.బి.రావు గారితో ఏకీభవిస్తున్నాను. సమీక్ష కాబట్టి కాస్త వివరంగా ఉంటే ఇంకా బాగుండేది.

రాధిక చెప్పారు...

చాలా మంది బ్లాగు సమీక్షలు మొదలు పెట్టి వదిలేసారు.మీరు అలా కాకుండా మంచి బ్లాగులను సవివరం గా సమీక్షించి అందిస్తారని ఆశిస్తున్నాను.

నల్లమోతు శ్రీధర్ చెప్పారు...

ఈ సమీక్ష కంప్యూటర్ ఎరా పత్రికలో వచ్చింది. ప్రతి నెల తెలుగువెలుగులు అనే శీర్షికలో సగం బ్లాగు సమీక్ష, సగం వికీ సమీక్ష ఇవ్వడం జరుగుతుంది.ఈ సమీక్ష నేను రాసింది కాదు. తాడేపల్లిగారు రాసింది. ప్రతి నెల ఒక బ్లాగరు తనకు నచ్చిన బ్లాగు గురించి నాకిచ్చిన సమీక్ష నేను పత్రికలో ఇస్తున్నాను. ముందు ముందు వీలైతే మొత్తం పేజీ బ్లాగు సమీక్షకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

రాధికగారు,
ఈ సమీక్షలు క్రమం తప్పకుండా నా పత్రికలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వీటిని సమీకరించి నాకందిస్తున్న జ్యోతిగారు ఊర్కోరుగా మధ్యలో ఆపేస్తే..

అందరు బ్లాగర్లకు నాదొక మనవి. మీకు నచ్చిన బ్లాగు గురించిన సమీక్ష రాసి పంపొచ్చు. నాకుగాని, జ్యోతిగారికి గాని. ఈ సమీక్ష వర్డ్ లో రెండు పేజీలు ఉండాలి.

వింజమూరి విజయకుమార్ చెప్పారు...

సమీక్ష గంభీరంగా, సమీక్ష రాయడంలో చేయితిరిగిన వారికి మల్లే అద్భుతంగా సాగింది. బ్లాగరు గురించీ, బ్లాగు గురించీ సాధ్యమైనంతలోనే వివరణాత్మకంగానూ వుంది. కాకుంటే బ్లాగులోని మంచిని చెప్పినట్టే కొన్ని టపాల్లోని చిన్న చిన్న సవరణలు (లోపాలు అనలేంగానీ) సమీక్షకర్త సూచించి వుంటే అటు బ్లాగరు పొరపాట్లు సరిదిద్దుకున్నట్టూ, యిటు సమీక్ష పరిపూర్ణత సంతరించుకున్నట్టూ వుండేది. మొత్తానికి నల్లమోతు శ్రీధర్ కృతజ్ఞతలు. పూర్తి పేజీ కేటాయించగలిగితే యింకా కృతజ్ఞతలు.

Ramani Rao చెప్పారు...

ఈ సమీక్ష ఇందులో ముందుగా కొత్తపాళీ గారి బ్లాగ్ గురించి రావడం చాల హర్షించతగ్గ విషయం.... నల్లమోతు శ్రీధర్ గారికి , జ్యోతిగారికి మా అభినందనలు.... ఇలాంటి కొత్త కొత్త మార్పులతో ఈ సమీక్షలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ..