30, నవంబర్ 2007, శుక్రవారం

మీరు సేవకు రెడీనా?

బ్లాగు మిత్రులందరికీ నమస్కారం. కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఇప్పటివరకూ 2100 మంది సభ్యులున్నారు. వారిలో చాలామంది ఏదో రకంగా సర్వీస్ చేయాలన్న తలంపుని కలిగి ఉన్నారు. వారందరి ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్నమైన ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది. కంప్యూటర్ ఎరా ఫోరమ్ సభ్యులను ఉద్దేశించి రాసిన ఈ క్రింది పోస్టుని.. మన బ్లాగు మిత్రులు ఎవరైనా ఈ ప్రాజెక్టులో పాల్గొంటారేమో, దీని గురించి తెలియజేద్దామని ఈ బ్లాగులో పోస్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయాలు పంచుకోగలరు.

ప్రియమైన కంప్యూటర్ ఎరా పాఠకులకు నమస్కారాలు.

మనం ఇతరులకు పంచితే మనకు మరింత పెరిగేది నాలెడ్జ్ మాత్రమే. కంప్యూటర్ రంగంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని కంప్యూటర్ ఎరా ఫోరమ్ ద్వారా తోటి పాఠకులతో షేర్ చేసుకుంటూ సమాజసేవ చేస్తున్న మహానుభావులందరి కృషి మాటల్లో వ్యక్తపరచలేనిది. ఇటీవలి కాలంలో కొందరు పాఠకులు మన పత్రిక నేపధ్యం, లక్ష్యాలు, నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మీదట "ఏ రకంగానైనా మీ వెనుక మేముంటాం" అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. Really I am feeling so happy after hearing those supporting words". వ్యక్తిగతంగా నాకే సాయమూ అవసరం లేదు. నేను చాలారోజులుగా కొన్ని ప్రాజెక్టులు నా మనసులో ఉన్నాయి అని చెబుతూ వస్తున్నాను కదా. వాటిలో ఒక ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు వివరిస్తాను. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చు.

మీ కంప్యూటర్ నుండే ఇతరులకు హెల్ప్ చేయడం:

మనలో చాలామందికి వేర్వేరు రంగాలపై నాలెడ్జ్ ఉంటుంది. ఉదా.కు.. నాకు హార్డ్ వేర్, రిజిస్ట్రీ , కొత్త సాఫ్ట్ వేర్లు, ట్రబుల్ షూటింగ్ వంటి వాటిపై అవగాహన ఉంది. అలాగే మరో వ్యక్తికి MS-Office గురించి బాగా తెలిసి ఉండవచ్చు. మరో వ్యక్తికి పేజ్ మేకర్, ఫొటోషాప్ లపై అవగాహన ఉండి ఉండవచ్చు. మరో పాఠకుడికి C, C++, Javaలపై నాలెడ్జ్ ఉంటుంది... ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంపై కొద్దోగొప్పో అవగాహన కలిగి ఉంటారు.

ఇప్పటివరకూ మనం చేస్తున్నది ఏమిటంటే:

నాకు MS-Officeలో ఏదైనా డౌట్ ఉంటే నేను నా డౌట్ ని ఈ ఫోరమ్ లో రాస్తే దానిపై అవగాహన ఉన్న వారు తిరిగి తమ సమాధానాన్ని టైప్ చేసి నా డౌట్ ని క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఈ ఫోరమ్ లో ప్రశ్నలు, సమాధానాల ద్వారా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు కదా! అయితే ఈ విధానం వల్ల ఒక పరిమితి ఉంది, ఒకవేళ మీ సమాధానాన్ని నేను అర్థం చేసుకోగల బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదనుకోండి.. మీరు అంత కష్టపడి ఇచ్చిన సమాధానం వృధానే అవుతుంది కదా! ఇలాంటి కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్నది నా ఆలోచన.

కొత్తగా మనం చేయగలిగింది:

ఇప్పుడు RAdmin, Remote Desktop, Team Viewer వంటి అనేక రకాల రిమోట్ డెస్క్ టాప్ మోనిటరింగ్, అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మనం ఇతరుల కంప్యూటర్లోకి ప్రవేశించి వారి సందేహాలను తీర్చవచ్చు. ఉదా.కు... నాకు C లాంగ్వేజ్ లో ఒక ఫంక్షన్ ఎలా రాయాలో తెలియడం లేదనుకోండి. 'Dilse' అనే పాఠకుడికి దానిపై అవగాహన ఉంది అనుకుంటే.. అతను ఇలాంటి సాఫ్ట్ వేర్ల సాయంతో నా కంప్యూటర్లోకి ప్రవేశించి ఇక్కడ నేను నా కంప్యూటర్ పై చూస్తుండగానే ఫంక్షన్ రాసి చూపించవచ్చు. అలాగే మౌర్య అనే పాఠకుడికి కంప్యూటర్లో తెలుగు టైప్ చేయడం ఎలాగో తెలియదనుకోంఢి... అప్పుడు నేనో, ప్రసాద్ గారో, వర్మ దాట్ల గారో మౌర్య కంప్యూటర్ లోకి ప్రవేశించి అతని సిస్టమ్ లో తెలుగు టైప్ చేసుకోగలిగేలా కాన్ఫిగర్ చేసి పెడతాం. అంటే మనం పాఠకులం అందరం ఒకరు తిరుపతిలో ఉన్నా, ఒకరు నిజామాబాద్ లో, మరొకరు గుంటూరులో, వేరొకరు వైజాగ్ లో, ఒకరు హైదరాబాద్ లో ఉండి కూడా ఎక్కడ ఉన్న వారి సందేహాలనైనా నేరుగా వారి కంప్యూటర్లోకి ప్రవేశించి పరిష్కరించవచ్చు. దీనికిగాను పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అవసరం లేదు. ఎంత సులభంగా ఈ పనిని నిర్వర్తించవచ్చో నేను తర్వాత వివరిస్తాను. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టుని దృష్టిలో ఉంచుకుని రకరకాల రిమోట్ మోనిటరింగ్ టూల్స్ పనితీరుని పరీక్షిస్తూ వస్తున్నాను. అన్నింటి కంటే ఉచితంగా లభించే Team Viewer అనే సాఫ్ట్ వేర్ చాలా బాగా పనిచేస్తోంది. సో.. మనమందరం కేవలం 1MB సైజ్ మాత్రమే గల ఆ సాఫ్ట్ వేర్ ని మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

మీరు చేయగలరా?

ఎలాంటి ప్రతిఫలం లేకుండానే చిన్న చిరునవ్వు కూడా నవ్వనంతగా మనం బిగదీసుకుపోతున్న నేటి రోజుల్లో ఒక్క పైసా ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలన్న ఆలోచన చాలామందికి "ఎందుకు టైమ్ వేస్ట్, ఆ కష్టపడేదేదో మన కోసం మనం కష్టపడితే ఓ నాలుగు రాళ్లయినా వెనుకేయవచ్చు" అనిపించడం ఖాయం. అయితే నిజంగా ఒకటి ఆలోచించండి మనం పోతూ పోతూ ఇవ్వాళ చెమటోడ్చి సంపాదించే డబ్బు మూటలను మనతోపాటు కట్టుకుపోలేం. అదే ఓ పదిమందికి సాయపడితే "ఫలానా మనిషి దేవుడు లాంటి వాడు" అని వారి జీవితాంతం ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. మనం పోయినా మిగిలి ఉండేది మనం చేసిన సేవే. అలాగే మనం పంచిన నాలెడ్జ్ తో ఎందరో జీవితంలో స్ధిరపడవచ్చు. అంటే మన ఒక్కళ్ల జీవితం ఎంతోమందికి నిండు జీవితం, స్థిరత్వం ప్రసాదిస్తోందన్నమాట. అంతకన్నా కావలసిన తృప్తి ఏముంటుంది? ఇదీ నా ఆలోచనావిధానం. అలాగని ఎవరినీ నేను స్వంత పనులు మానేసుకుని సమాజసేవ చేయమని కోరడం లేదు. మీకు తెలిసిన నాలెడ్జ్ ని రోజుకి ఓ గంటో, రెండు గంటలో ఇతరుల సందేహాలు తీర్చడానికి వెచ్చించండి చాలు. ఏ ఛాటింగ్ లోనో వేస్ట్ చేసే టైమ్ ని ఇలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది కదా! ఒక్కటి మాత్రం నిజం.. ఇలా నలుగురికీ సాయపడడంలో లభించే తృప్తి కోట్లు సంపాదించినా రాదని నేను స్వతహాగా ఎక్స్ పీరియెన్స్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీకూ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఉంటే మీరూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవండి. ఒకవేళ "మా వల్లేం అవుతుంది, మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఏదో 15 రూపాయలు పెట్టి కంప్యూటర్ ఎరా చదువుతున్నాం కదా అని శ్రీధర్ గారు మనల్ని ఎలా ఇరికిస్తున్నారో చూడండి" అని ఫీల్ అయితే మీ ఇష్టం. మీరు సేవ చేయాలని ఎలాంటి బలవంతం లేదు. నేను నా స్వంత పనులను మీరు చేయమని కోరడం లేదు. మీకు ఇష్టమైతే చేయవచ్చు, ఇష్టం లేకపోతే వదిలివేయవచ్చు. నా లక్ష్యం ఒక్కటే మనందరం కలిసి ఇలాంటి వినూత్నమైన ప్రాజెక్ట్ ద్వారా యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలవాలన్నది. ఇవ్వాళ ఓ నలుగురే ముందుకు రావచ్చు, కొన్నాళ్లకు ఓ పదిమందవుతారు, మరికొన్నాళ్లకు వంద, వేయి.. ఇలా పెరుగుతారు. ఒకరికొకరు ఎలాంటి డబ్బూ ఆశించకుండా ఇలా సాయం చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది చాలా గొప్ప సమాజ సేవ అవుతుంది. సో.. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, మధ్యలోనే చేతులు ఎత్తేయమని, ఈ ప్రాజెక్టుకి వీలైనంత వరకూ జీవితాంతం కట్టుబడి ఉంటామనుకుంటే మీరూ ఇందులో భాగస్వాములు కావచ్చు.

మీ వివరాలు అందించండి:

ఇతరులకు సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఇదే పోస్ట్ లో మీ వివరాలు తెలియజేయండి. అవేంటంటే:

మీ పేరు, మెయిల్ అడ్రస్, మీకు ఏయే రంగాలపై మంచి నాలెడ్జ్ ఉంది, మీరు ఏయే సమయాల్లో ఇతరుల కోసం టైమ్ కేటాయించగలుగుతారు (ఉదా.కు.. సాయంత్రం 6-7 గంటల వరకూ). ఇబ్బంది లేదనుకుంటే మీ ఫోన్ నెంబర్. మీరు ఏం చేయాలంటే, మీరు ఏ టైమ్ మీకు వీలు అవుతుందని చెప్పారో ఆ సమయంలో తప్పనిసరిగా యాహూ మెసెంబర్/Gtalk వంటి వాటిలో ఛాటింగ్ లో అందుబాటులో ఉండాలి, లేదా మీ ఫోన్ ని ఆ టైమ్ లో ఆన్ చేసి ఉంచాలి. మెసెంజర్ లేదా ఫోన్ ద్వారా సాయం కావలసిన వాళ్లు మీకు రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు మీరు Team Viewer సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసి.. అవతలి వ్యక్తి తెలియజేసిన అతని యూజర్ ID, పాస్ వర్డ్ ల సాయంతో అతని కంప్యూటర్ లోకి ప్రవేశించి, అతని సందేహాన్ని క్లారిఫై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మీరు బిజీగా ఉంటే మరో టైమ్ లో మీ ఇద్దరూ కలిసి సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఎలాంటి కండిషన్స్ లేవు, కావలసిందల్లా సాయపడే స్వభావమే!

ఎక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి?

ఈ క్రింది వెబ్ అడ్రస్ నుండి Team Viewerని డౌన్ లోడ్ చేసుకోండి.

http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe


డౌన్ లోడ్ చేశాక ఇన్ స్టాల్ చేసేటప్పుడు క్రింది చిత్రంలోని విధంగా Install Team Viewer అనే ఆప్షన్ టిక్ చేసి ఇన్ స్టాల్ చేయండి:



ఆ తర్వాత క్రింది విధంగా బాక్స్ వస్తుంది:



అందులో Start TeamViewer automatically with windows అనే ఆప్షన్ ని టిక్ చేయకండి. క్రింద పాస్ వర్డ్ అనే ప్రదేశం వద్ద మీ పేరుని పాస్ వర్డ్గ్ గా ఇవ్వండి. ఈ పాస్ వర్డ్ గుర్తు ఉంచుకోండి. ఆ తర్వాత Next, Next కొట్టి ఇన్ స్టలేషన్ పూర్తి చేయండి. మీ కంప్యూటర్లో ఫైర్ వాల్ ఉంటే Team Viewer ని నెట్ యాక్సెస్ చేయడానికి అనుమతించమంటారా అని అడుగుతుంది. Allow/Accept చేయండి. చివరిగా క్రింది చిత్రంలో విధంగా విండో వస్తుంది.


అందులో ID అనే బాక్స్ లో మిమ్మల్ని హెల్ప్ అడిగిన వ్యక్తి యొక్క కంప్యూటర్ ID టైప్ చేసి, Connect to Partner అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్ వర్డ్ అడుగుతుంది. అతను మీకు తెలియజేసిన పాస్ వర్డ్ టైప్ చేస్తే సరిపోతుంది.

ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా సందేహాలుంటే అడగగలరు. అలాగే నిజంగా ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ వివరాలు ఇక్కడ తెలియజేసి ఇందులో భాగస్వాములు అవండి, గొప్ప నాలెడ్జబుల్ సొసైటీ ని నిర్మిద్దాం.

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా

29, నవంబర్ 2007, గురువారం

వెబ్‌సైట్లలోని కలర్ కోడ్‌లు ఎలా తెలుసుకోవాలి.




కొన్ని ఆకర్షణీయంగా ఉండే వెబ్‌సైట్లలో డిజైనింగ్ కోసం ఏయే రంగులు ఉపయోగించారన్నది సులువుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్‌పై కనిపిస్తున్న ఏ రంగు యొక్క కలర్ కోడ్‌నైనా సులువుగా తెలియజేసేలా Color Picker వంటి కొన్ని చిన్న చిన్న సాఫ్ట్‌వేర్లు లభిస్తున్నాయి. మీరు వాటిని వాడవచ్చు. లేదా నెట్‌పై redalt.com అనే వెబ్‌పేజీలోకి వెళ్ళి అడుగున Type the Url అనే ప్రదేశం వద్ద మీరు ఏ వెబ్‌సైట్ యొక్క రంగుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్ అడ్రస్ టైప్ చేసి Get Colors అనే బటన్‌ని క్లిక్ చేయండి.

టాబ్‌లు ఆకర్షణీయమైన రంగుల్లోకి వచ్చేలా...




ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో మనం వేర్వేరు ట్యాబ్‌ల క్రింద వేర్వేరు వెబ్‌సైట్లని బ్రౌజ్
చేసుంటాము కదా!! అలా ఓపెన్ చేయబడిన ప్రతీ ట్యాబ్ ఆకర్షణీయమైన
రంగుల్లో చూపించబడితే కళ్లకు ఇంపుగా ఉంటుంది కదూ!! దీనిని సాధ్యం
చేసేదే colourful tabs డౌన్‌లోడ్ చేసుకుని ఆనందించండి.

వైరస్‍‍లను ఇలా తయారుచేస్తారు...

కంప్యూటర్ వైరస్‌లను తయారు చేయాలంటే బాగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలన్న అభిప్రాయం మనలో చాలామందికి ఉంది. వాస్తవానికి అది నిజమే! అయితే ఇటీవలి కాలంలో రెడీమేడ్‌గా ఎవరైన క్షణాల్లో తమకు తాము వైరస్‌లను క్రియేట్ చేసుకోగలిగేలా Virus Builder ప్రోగ్రాములు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇలాంటి ప్రోగ్రాముల్లో హార్డ్ డిస్కులోని ఫైళ్ళని డిలీట్ చేసేలా, Control Panel, Task Manager, Mouse, Desktop వంటి వేర్వేరు అంశాలను డిసేబుల్ చేసేలా ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఇక్కడ మీరు ఏయే అంశాలను టిక్ చేసి, Create Virus అనే బటన్‌ని క్లిక్ చేస్తే వెంటనే ఓ EXE ఫైల్ సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఆ వైరస్ ప్రోగ్రామ్‌ని రన్ చేసిన సిస్టంలో ఇంతకుముందు టిక్ చేసిన అంశాలు ఆచరించబడతాయి. ఇలా ఎవరైనా సులభంగా వైరస్‌లు తీర్చిదిద్దగలుగుతున్న ప్రస్తుత తరుణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం కదా!

26, నవంబర్ 2007, సోమవారం

థంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో గ్యాలరీ సృష్టించడానికి



థంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో కూడిన HTML ఇమేజ్ గ్యాలరీలను సృష్టించడానికి
Express Thumbnail Creator అనే ప్రోగ్రామ్ ఉపయుక్తంగా ఉంటుంది.
మనం గ్యాలరీగా క్రియేట్ చేయదలుచుకున్న ఇమేజ్‌లను సెలెక్ట్ చేసుకుని ఫైనల్
ఔట్‌పుట్ ఎక్కడ సేవ్ చేయబడాలో స్పెసిఫై చేస్తే సరిపోతుంది. HTML, CSSలపై
ఆవగాహన ఉన్నవారు స్వంతంగా టెంప్లేట్లు క్రియేట్, ఎడిట్ చేసుకోవడానికి ఈ
ప్రోగ్రామ్‌లో అవకాశం ఉంది.

నెట్ నుండి కావలసిన సమాచారానికి




నెట్‌పై మీరొక ఆసక్తికరమైన వెబ్‌పేజీ చూస్తున్నారనుకుందాం. అందులోని కొంత
సమాచారాన్ని కాపీ చేసుకుని మీ సిస్టమ్‌లో సేవ్ చేసుకోవాలనిపించింది. అలాగే
నెట్‌పై స్ట్రీమ్ అవుతున్న ఆడియో,వీడియోలను భద్రపరుచుకోవాలనుకున్నారు.
అలాంటప్పుడు ఉపయోగపడే DataBites అనే సాఫ్ట్‌వేర్! దీని సాయంతో
డైనమిక్‌గా మారుతుండే సమాచారాన్ని సైతం సిస్టంలోకి డ్రాగ్ చేసుకోవచ్చు.
అలాగే మనం మోనిటర్ చేస్తున్న సమాచారం ఎంత సేపటికి రెఫ్రెష్
చేయబడుతుండాలన్నదీ సెట్ చేసుకోవచ్చు.

25, నవంబర్ 2007, ఆదివారం

కీబోర్డ్ పై టైప్ చేసేవాటిని రికార్డ్ చేసే డివైజ్


Golden Eye వంటి సాఫ్ట్ వేర్ల సహాయంతో మీ కంప్యూటర్ పై ఏమి టైప్ చేస్తున్నారు అన్నది మీ కంప్యూటర్ పై కూర్చున్న వారికి తెలియకుండానే రికార్డ్ చేయవచ్చని మీకు తెలిసే ఉంటుంది. అయితే సిస్టమ్ ని ఫార్మేట్ చేస్తే ఆ సాఫ్ట్ వేర్లు పనిచేయకుండా పోతాయి. అలా కాకుండా పై చిత్రంలో విధంగా నేరుగా మీ PS/2 కీబోర్డ్ పిన్ కే గుచ్చగలిగే కీషార్క్ అనే ఓ డివైజ్ ని ఉపయోగిస్తే కీబోర్డ్ ద్వారా మీరు గానీ, మీ కంప్యూటర్ పై కూర్చున్న ఎవరైనా ఏమి టైప్ చేసినా ఇది తన మెమరీలో రికార్డ్ చేసుకుంటూ వెళుతుంది. ఎప్పుడైనా దానిని తిరిగి చదువుకోవచ్చు. అవసరం లేదనుకుంటే దానిని కేబుల్ నుండి తొలగించి దాచిపెట్టుకోవచ్చు. పై చిత్రంలో నల్ల రంగులో ఉన్న భాగమే ఆ డివైజ్. దీని ధర రూ. 2500/-.

స్టెగనోగ్రఫీతో దాచిపెట్టబడిన వాటిని కనుక్కోవచ్చు..


ఫొటోలలోనూ, MP3 ఫైళ్లలోనూ రహస్యంగా ఇతర ఫైళ్లని జొప్పించి ఇతరులకు కనపడకుండా చేరవేసే ప్రక్రియను స్టెగనో గ్రఫీ అంటారు. ఇలా ఒక ఫైల్ లో రహస్యంగా సమాచారాన్ని జొప్పించడానికి అనేక రకాల స్టెగనోగ్రఫీ సాఫ్ట్ వేర్లు లభిస్తున్నాయి. అయితే ఈ స్టెగనోగ్రఫీకి విరుగుడుగా స్టెగనాలసిస్ అనే ప్రత్యేకమైన టెక్నిక్ సైతం వాడుకలోకి వచ్చింది. మనం ఏ పేరెంట్ ఫైళ్లలో అయితే రహస్య సమాచారాన్ని పొందుపరిచామో ఆ పేరెంట్ ఫైళ్లని స్వీకరించి, విశ్లేషించి, అందులో అంతర్గతంగా పొందుపరచబడి ఉన్న సమాచారాన్ని గుర్తించి నాశనం చేసే ప్రక్రియనే స్టెగనాలసిస్ గా వ్యవహరిస్తారు. స్టెగనోగ్రఫీ కంటెంట్ ని గుర్తించే ఇలాంటి సాఫ్ట్ వేర్లలో Stegdetect అనే ప్రోగ్రామ్ JPEG ఇమేజ్ ఫైళ్లలో రహస్యంగా పొందుపరచబడిన సమాచారాన్ని వెదికిపట్టుకోగలుగుతుంది.

పవర్ పోగానే UPS కూడా ఆగిపోతోందా?


మీవద్ద UPS ఉన్నట్లయితే అకస్మాత్తుగా పవర్ సప్లై నిలిచిపోతే మెయిన్ పవర్ సప్లై నుండి UPSలోని బ్యాటరీ ఛార్జ్ తీసుకుని సిస్టమ్ కి విద్యుత్ సరఫరా అందిస్తుంది. అయితే కొన్ని UPSలు అలా కరెంట్ పోగానే అవీ ఆగిపోయి సిస్టమ్ నిలిచిపోవడానికి దారితీస్తాయి. AC నుండి DCకి మారే స్విచ్ఓవర్ సర్క్యూటరీలో లోపం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. నాసిరకం కంపెనీలకు చెందిన UPSలలో ఇలాంటి ఇబ్బంది ఎక్కువగా తలెత్తుతుంటుంది. అలాగే UPSపై పరిమిత మొత్తంలో మాత్రమే లోడ్ వేయాలి. లేదంటే అవి కరెంట్ పోగానే లోడ్ తట్టుకోలేక ట్రిప్ అవుతుంటాయి, దానితో సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. చాలామంది సిస్టమ్ తోపాటు, స్పీకర్లు, ప్రింటర్, స్కానర్ వంటి అన్ని రకాల పెరిఫెరల్స్ నీ UPSకే కనెక్ట్ చేస్తుంటారు. అలాగే 17", 19" వంటి పెద్ద మోనిటర్ల వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఉదా.కు.. మోనిటర్ వరకూ మాత్రమే ఆఫ్ చేయబడి ఉన్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి. వెంటనే మీరు మోనిటర్ ని ఆన్ చేశారంటే మొత్తం సిస్టమ్ రీస్టార్ట్ చేయబడే ప్రమాదం ఉంది. దీనికి కారణం మోనిటర్ ఆన్ చేయబడిన మొదటి కొద్ది క్షణాల్లో భారీ మొత్తంలో విద్యుత్ ని వాడుకుంటుంది. అంత స్థాయిలో విద్యుత్ ని ఆ కొన్ని క్షణాలపాటు అందించలేక యుపిఎస్ చేతులు ఎత్తేస్తుంది.

24, నవంబర్ 2007, శనివారం

మనం వాడేది అసలైన కొటేషన్ మార్క్ కాదు..


కీబోర్డ్ ద్వారా ' మరియు " చిహ్నాలను మనం కొటేషన్ మార్కులుగా ఎంటర్ చేస్తుంటాం కదా. వాస్తవానికి అవి నిజమైన కొటేషన్ మార్కులు కావు. వీటిని Hash Marks అంటారు. అడుగులు, అంగుళాలను తెలియజేసేటప్పుడు మాత్రమే (ఉదా.కు.. 9'6") వీటిని ఉపయోగించాలి. వంపులుగా ఉండే (“) నిజమైన కొటేషన్ మార్కులకు బదులుగా ఈ హాష్ మార్క్ ని మీరు ఉపయోగిస్తున్నట్లయితే మీకు సరైన పరిజ్ఞానం లేనట్లే భావిస్తారు. మరి నిజమైన కొటేషన్ మార్కులకు కీబోర్డ్ నుండి పొందడం ఎలాగంటే..

ముందు న్యూమరిక్ కీప్యాడ్ ని ఆన్ చేయండి. ఇప్పుడు..

Alt+0145 (న్యూమరిక్ కీపాడ్ పై సంఖ్యలని ప్రెస్ చేయాలి) - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ‘ అనే ఎడమచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0146 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ’ అనే కుడిచేతి వైపు సింగిల్ కోట్ వస్తుంది.
Alt+0147 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే “ అనే ఎడమ చేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.
Alt+0148 - అనే కీల సముదాయాన్ని ప్రెస్ చేస్తే ” అనే కుడిచేతి వైపు డబుల్ కోట్ వస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, ఇలా కొటేషన్ మార్కులు ఎంటర్ చేయవచ్చినప్పుడల్లా అన్ని కీలను ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుంది కదూ! అందుకే పేజ్ మేకర్, క్వార్క్ ఎక్స్ ప్రెస్ వంటి సాఫ్ట్ వేర్లలో Typographer's Quotes లేదా Smart Quotes పేరిట ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఈ ఆప్షన్లని ఎనేబుల్ చేసిన తర్వాత ఇంతకాలం మనం ఎంటర్ కీకి పక్కనే కనిపించే హాష్ మార్క్ కీని ప్రెస్ చేస్తే అని నిజమైన కర్లీ కొటేషన్ మార్కుగా మార్చబడుతుంటుంది.

హార్డ్ డిస్క్ లో చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు


వేర్వేరు సాఫ్ట్ వేర్లను కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేయడం సరదాగానే ఉంటుంది. అయితే వాటిని సిస్టమ్ నుండి తొలగించేటప్పుడే తంటా! ప్రతీ సాఫ్ట్ ‌వేరూ తాను uninstall అయినా కూడా ఏవో కొన్ని ఫైళ్ళని, రిజిస్ట్రీ ఎంట్రీలను హార్డ్ డిస్కులో మిగిల్చే పోతుంది. దీంతో హార్డ్ డిస్క్ నిండా చెత్త పేరుకుపోతుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి Easy Sweep అనే సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ముందుగా హార్డ్ డిస్క్ లోని వివిధ డ్రైవ్‌ల యొక్క snapshot తీసుకుంటుంది. ఆ తర్వాత మనం ఏ సాఫ్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నా, తిరిగి దాన్ని uninstall చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఒక్క ఆనవాలు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది.

డిజిటల్ కెమెరా వినియోగదారులకు



ఫోటోషాప్ వంటి శక్తివంతమైన ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్లపై పెద్దగా ఆవగాహన లేనివారికి Turbo Photo అనే సాఫ్ట్ వేర్ చాలా సులభంగా అర్ధమవుతుంది. ప్రత్యేకించి ఈ సాఫ్ట్ వేర్‌ని డిజిటల్ కెమెరాల వినియోగదారుల కోసం రూపొందించారు. ఇందులో Color Balance, HSB mode adjustment, Noise reduction, Skin beautifuication, Rotate, Crop వంటి అన్ని రకాల ప్రామాణిక ఫోటో ఎడిటింగ్ సదుపాయాలు పొందుపరచబడ్డాయి. అలాగే ఫోటోలకు ఫ్రేమ్‌లను, టెక్ట్స్ నూ జతచేయవచ్చు. వందల సంఖ్యలో ఉన్న ఫోటోలను ఒకేసారి ఎడిట్/ప్రింట్ తీసుకోవచ్చు. స్లైడ్‌షో్‌లుగా ప్రదర్శించుకోవచ్చు.

తాళాల నిర్వహణకూ ఓ సాఫ్ట్ వేర్


హోటల్ రూంలు, లాడ్జ్ లు, పలు క్యాబిన్లతో కూడిన కంపెనీల వంటి వాటిలో అవసరార్ధం డోర్లు, లాకర్లు, డెస్కుల తాళాలను పలువురు ఉద్యోగులకు అప్పగించడం జరుగుతుంటుంది కదా! అయితే ఏ తాళం ఎవరి ఆధీనంలో ఉందో గుర్తుంచుకోవడం కష్టం. ఇలాంటి ఇబ్బందిని పరిష్కరించడానికి Keys అనే సాఫ్ట్ వేర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో ఏ తాళాన్ని ఎవరికి అప్పచెప్పింది, వారు తిరిగి మనకు దాన్ని ఎప్పుడు అందించారు అన్న వివరాల్ని డేటాబేస్ రూపంలో స్టోర్ చేయవచ్చు. దీనివల్ల ఏవైనా తాళాలు మిస్ ఐనప్పుడు, దొంగతనం జరిగినప్పుడు బాధ్యులను గుర్తించడం సులువవుతుంది.

23, నవంబర్ 2007, శుక్రవారం

RAR ఫైళ్లు ఎర్రర్ మెసేజ్ లు చూపిస్తున్నాయా?


ఇంటర్నెట్ నుండి RAR ఎక్స్ టెన్షన్ నేమ్ కలిగిన ఫైళ్లని డౌన్ లోడ్ చేసేటప్పుడు మీ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ సరిగ్గా లేకపోతే ఆయా ఫైళ్లు కరప్ట్ అయిపోతే అవకాశముంది. డౌన్ లోడ్ బాగానే పూర్తయినట్లు చూపిస్తుంది కానీ, డౌన్ లోడ్ అయ్యాక ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే WinRAR Diagnostic messages అంటూ ఎర్రర్ మెసేజ్ చూపించబడి ఓపెన్ అవకుండా నిలిచిపోతుంది. నెట్ నుండి డౌన్ లోడ్ చేసే సమయంలో ప్రతీ ఫైలూ కొన్ని పాకెట్ల రూపంలో విభజించబడి మన సిస్టం కి చేరవేయబడుతుంటుంది. కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల కొన్ని పాకెట్లు నష్టపోవడం లేదా కరప్ట్ అవడం మూలంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కనెక్టివిటీని మెరుగుపరుచుకోవడం తప్ప దీనిని అధిగమించడానికి మార్గం లేదు. ఒక్కోసారి డౌన్ లోడ్ చేసుకుంటున్న సర్వర్ లో సమస్యల మూలంగానూ ఇది తలెత్తవచ్చు.

నార్టన్ ఏంటీ వైరస్ తాజా డెఫినిషన్లు ఇవిగోండి

మీ వద్ద నార్టన్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ ఉండీ, ఏ కారణం చేతైనా ఆన్ లైన్ ద్వారా అది అప్ డేట్ అవకపోతున్నట్లయితే నిన్ననే (నవంబర్ 22) విడుదల చేయబడిన తాజా నార్టన్ వైరస్ డెఫినిషన్లని ఈ క్రింది వెబ్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి.
http://definitions.symantec.com/defs/20071122-022-i32.exe

22, నవంబర్ 2007, గురువారం

Divide Overflow Error మెసేజ్ వస్తోందా?


కొన్ని ప్రోగ్రాములను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉపయోగించేటప్పుడు Divide Overflow పేరిట ఎర్రర్ మెసేజ్ వచ్చి ఆ ప్రోగ్రామ్ ఉన్న ఫళంగా నిలిచిపోతుంటుంది. దీనికి కారణమేమిటంటే పాతకాలం ప్రోగ్రామర్లు సాఫ్ట్ వేర్ ని డెవలప్ చేసేటప్పుడు 233MHz లేదా అంతకన్నా ఎక్కువ క్లాక్ స్పీడ్ కలిగిన ప్రాసెసర్లపై తమ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబడేటప్పుడు... భారీ పరిమాణం గల సంఖ్యలను విడదీయడానికి టైమింగ్ ఆధారిత లూప్ ని ప్రోగ్రామ్ కోడ్ లో రాస్తుంటారు. ఈ లూప్ గనుక సంఖ్యలను విడదీయలేకపోతే వెంటనే స్ర్కీన్ పై Divide Overflow వంటి ఎర్రర్ మెసేజ్ లు చూపించబడతాయి. ఇది పూర్తిగా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన లోపమే! ప్రోగ్రామింగ్ కంపైలర్లతో పాటు లభించే సాఫ్ట్ వేర్ లైబ్రరీలు ఇలాంటి సమస్యలకు కారణం అవుతుంటాయి. ముఖ్యంగా Borland TurboPascal కంపైలర్ ద్వారా తయారయ్యే ప్రోగ్రాముల విషయంలో ఈ సమస్య తలెత్తుతుంది.

ఫాంట్లు ఇన్ స్టాల్ చేయకుండానే వాడుకోవచ్చు ఇలా..


సిస్టమ్ లో ఎక్కువ ఫాంట్లు ఇన్ స్టాల్ చేయబడి ఉంటే ఆపరేటింగ్ సిస్టమ్ బూటింగ్ నెమ్మదించడంతో పాటు ఫాంట్ల ఆధారంగా పనిచేసే వర్డ్ వంటి అప్లికేషన్ ప్రోగ్రాములూ స్లోగా రన్ అవుతాయి. ఈ నేపధ్యంలో సిస్టమ్ లోకి ఫాంట్లు ఇన్ స్టాల్ చేయకుండానే అవసరం అయినప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకునే మార్గమొకటి ఉంది. అదేమిటంటే మొట్టమొదటిగా C:\Windows\Fonts ఫోల్డర్లో భద్రపరచబడి ఉన్న మామూలు ఫాంట్లని (Times New Roman వంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటే డీఫాల్ట్ గా ఇన్ స్టాల్ అయిన ఫాంట్లని మినహాయించి) సెలెక్ట్ చేసి.. C డ్రైవ్ లోనే కొత్తగా Font పేరిట ఓ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్ లోకి మూవ్ చేయండి. సిస్టమ్ ఫాంట్లని మాత్రం C:\Windows\Fonts ఫోల్డర్ లోనే ఉంచండి. ఏ ట్రూ టైప్ ఫాంట్ అయినా C:\Windows\Fonts ఫోల్డర్లో ఉన్నంతవరకే అది ఇన్ స్టాల్ చేయబడిన ఫాంట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ పరిగణిస్తుంది. సో.. ఇప్పుడు మనం చేసిన పనివల్ల, ఆ ఫాంట్లు సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేయబడి లేవన్నమాట. అంతే పరోక్షంగా సిస్టమ్ పై భారం తగ్గుతుంది. ఒకవేళ భవిష్యత్ లో ఎప్పుడైనా ఇలా మూవ్ చేసిన ఫాంట్ లలో దేనినైనా వర్డ్, పేజ్ మేకర్ వంటి డాక్యుమెంట్లలో ఉపయోగించవలసి వస్తే.. ముందుగా ఆ ఫాంట్ ని మౌస్ తో డబుల్ క్లిక్ చేసి, ఆ వెంటనే వర్డ్ ప్రాసెసర్ ప్రోగ్రామ్ ని ఓపెన్ చేసి ఆ ఫాంట్ ని ఉపయోగించుకోవచ్చు.

స్కానర్ తో స్కాన్ చేయడానికి ముందు సేవ్ చేసుకోండి...


మన వద్ద స్కానర్ ఉన్నట్లయితే ఫొటోలను స్కాన్ చేయడానికి దానితో పాటు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అందించబడుతుంది. అయితే ప్రతీసారీ ఇలా స్కానర్ తో పాటు అందించబడిన సాఫ్ట్ వేర్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా స్కానర్ driversని ఇన్ స్టాల్ చేసిన వెంటనే TWAIN పేరిట వర్డ్, ఫొటోషాప్, పేజ్ మేకర్ వంటి అన్ని ఇమేజ్ ఎడిటింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వ్యూయింగ్ అప్లికేషన్లలోనూ ఆప్షన్ లభిస్తుంది. ఈ ఆప్షన్ ని ఉపయోగించి నేరుగా స్కానర్లోని ఇమేజ్ లను స్కాన్ చేసి ఆయా అప్లికేషన్లలో వాడుకోవచ్చు. అయితే ఇలా నేరుగా స్కాన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉదా.కు.. మీరు ఫొటోషాప్ నుండి నేరుగా File మెనూలోని Acquire లేదా Import అనే ఆప్షన్ ని ఉపయోగించి స్కానర్లోని ఇమేజ్ ని స్కాన్ చేసేటప్పుడు ఒక్కోసారి స్కానర్ డ్రైవర్లు సరిగ్గా ఇనీషయలైజ్ అవక ఏకంగా ఫొటోషాప్ అప్లికేషన్ ఉన్న ఫళంగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫొటోషాప్ లో ఆ సమయంలో ఇంకేమైనా డాక్యుమెంట్లు సేవ్ చేయబడకుండా ఉన్నట్లయితే డేటా నష్టపోవడం జరుగుతుంది. అందుకే థర్ట్ పార్టీ సాఫ్ట్ వేర్లలో నేరుగా స్కానర్ TWAIN డ్రైవర్లని వాడదలుచుకుంటే ముందు ఆ థర్ట్ పార్టీ సాఫ్ట్ వేర్లో ఓపెన్ చేయబడి ఉన్న ఫైళ్లని సేవ్ చేసిన తర్వాతే స్కానింగ్ కి ఉపక్రమించండి.

21, నవంబర్ 2007, బుధవారం

వెబ్‍పేజీల్లో ఇమేజ్‍లు పొందుపరుస్తుంటే..




కొన్ని వెబ్‌పేజీలను ఓపెన్ చెయ్యగానే అందులోని అడ్వర్టైజ్‌మెంట్లు అలల్లో తేలిపోతున్నట్లు కనిపిస్తుంటాయి. ఒక్కసారిగా మాయమై కొన్ని భాగాలుగా ఏర్పడుతూ తిరిగి పూర్తిరూపం సంతరించుకుంటున్నాయి. ఇమేజ్‌లపై ఇలాంటి స్పెషల్ ఎఫెక్టులను ఎలా క్రియేట్ చేయవచ్చన్న సందేహం మీకు తలెత్తి ఉండవచ్చు. Pixifex అనే సాఫ్ట్ వేర్ గనుక మీవద్ద ఉన్నట్లయితే ఇలాంటి పలు రకాల ఎఫెక్టులను మీ హార్డ్‌డిక్స్‌లో స్టోర్ చేయబడిఉన్న ఫోటొలపై అప్లై చేసి వాటిని వెబ్‌పేజీలుగా పబ్లిష్ చేసుకోవచ్చు లేదా SWF ఏనిమేషన్లుగా సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏనిమేషన్లుగా సేవ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏనిమేషన్ ఎఫెక్టులను తయారు చెయ్యడానికి ఉపకరించే Flax సాఫ్ట్ వేర్ని రూపొందించిన Goldshell సంస్థ వారే ఇమేజ్‌లకు అదే మాదిరి పలు రకాల ఎఫెక్టులను అప్లై చెయ్యడానికి ఈ సాఫ్ట్ వేర్ని డెవలప్ చేశారు.

ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే...


వైరస్‌లు, ముఖ్యమైన సిస్టమ్ ఫైళ్ళు కరప్ట్ అవడం వంటి వివిధ కారణాల వల్ల C డ్రైవ్‌ని ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా Windows ఇన్‌స్టాల్ చేసి, డివైజ్ డ్రైవర్లని కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొట్టమొదటగా Control Panel>System>System Properties>Device Managerకి వెళ్ళి హార్డ్ డిస్క్, సిడిరామ్, డివిడిరామ్ వంటి వివిధ డిస్క్ డ్రైవ్‌ల DMA ఆప్షన్‌ని ఎనేబుల్ చేయండి. విండోస్ ఎక్స్ పీ, విస్టా వంటి ఆపరేటింగ్ సిస్టం లలో డీఫాల్ట్ గా ఇది ఎనేబుల్ చేయబడుతుంది కాబట్టి ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. అలాగే 9x ఆపరేటింగ్ సిస్టమ్ లలో Performance>virtual Memory అనే విభాగంలోకి వెళ్ళి Let me Specify my own Virtual Memory settings అనే ఆప్షన్‌ని ఎంపిక చేసుకుని మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న మెమరీకి రెండున్నర రెట్లు ఎంత అవుతుందో లెక్కించి (512MB అయితే 1280MB అవుతుంది) ఆ మొత్తాన్ని Virtual Memoryగా కేటాయించండి. దీనికిగాను ఎక్కువ ఖాళీగా ఉన్న పార్టీషన్‌ని ఎంచుకోవడం మంచిది. తాజా ఆపరేటింగ్ సిస్టమ్ లలో వర్చ్యువల్ మెమరీ బాగానే మేనేజ్ చేయబడుతుంది కాబట్టి ప్రత్యేకంగా దీనిని మీరు మార్చవలసిన అవసరం లేదు. ఇకపోతే ఇతర సాఫ్ట్ వేర్లని సైతం ఇన్‌స్టాల్ చేయడం పూర్తయిన తర్వాత కేవలం Start Menuలో మాత్రమే ఆయా ప్రోగ్రాముల షార్ట్ ‌కట్‌లను ఉంచి డెస్క్ టాప్‌పై, Quick Launch Barపై ఉండే అదనంగా అనవసరంగా ఉండే షార్ట్ ‌కట్‌లన్నింటినీ తొలగించడం ద్వారా డెస్క్ టాప్ శుభ్రంగా ఉంటుంది.

కంప్యూటర్ బ్రౌజర్ సర్వీస్ డిసేబుల్ చేసుకోండి..


Windows 2000/XP/Server2003/Vista ఆపరేటింగ్ సిస్టమ్ లలో Computer Browser అనే సర్వీస్ ఒకటి రన్ అవుతుంటుంది. మనం నెట్ వర్క్ ఎన్విరాన్ మెంట్ లో పనిచేస్తున్నప్పుడు LANలో మనకు లభ్యమయ్యే అన్ని వనరుల జాబితాను ఎప్పటికప్పుడు ఈ సర్వీస్ అప్ డేట్ చేస్తుంటుంది. అయితే ఎలాంటి నెట్ వర్క్ కీ కనెక్ట్ అయి ఉండని సాధారణ హోమ్ యూజర్లు ఈ సర్వీస్ ని డిసేబుల్ చేసుకోవడం ద్వారా కొంతవరకూ సిస్టమ్ పై భారాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సర్వీస్ ని డిసేబుల్ చేయడం ద్వారా RAMలోని స్ధలం, విలువైన CPU Cycles ఆదా చేయబడడమే కాకుండా ఒకవేళ మీరు నెట్ వర్క్ లో పనిచేస్తూ ఉన్నప్పటికీ అవసరం లేదనుకుంటే ఈ సర్వీస్ ని డిసేబుల్ చేసినట్లయితే నెట్ వర్క్ ట్రాఫిక్ మెరుగుపడుతుంది. ఈ Computer Browser సర్వీస్ ని డిసేబుల్ చేయడానికి Start>Run కమాండ్ బాక్స్ లో Services.msc అని టైప్ చేస్తే వెంటనే Services అనే విండో ప్రత్యక్షమవుతుంది. అందులో "Computer Browser" అనే సర్వీస్ ని వెదికి పట్టుకుని మౌస్ తో డబుల్ క్లిక్ చేయండి. వెంటనే ప్రత్యక్షమయ్యే డైలాగ్ బాక్స్ లో Stop అనే బటన్ ని క్లిక్ చేసి, Startup Type అనే డ్రాప్ డౌన్ లిస్ట్ వద్ద Automatic నుండి Manualగా సెట్ చేయండి సరిపోతుంది. ఈ సర్వీస్ ని ఎవరికి వారు తాము పనిచేసే ఎన్విరాన్ మెంట్ కి లోబడి డిసేబుల్ చేసుకోండి. Browser Service అవసరం అయిన కంప్యూటర్లలో డిసేబుల్ చేస్తే ఇబ్బందులు పడవలసి వస్తుంది.

20, నవంబర్ 2007, మంగళవారం

డిసెంబర్ 2007 సంచిక రాదు, పునర్ధర్శనం జనవరి 2008తో!

ప్రియమైన కంప్యూటర్ ఎరా పాఠకులకు,

కొన్ని సాంకేతికమైన, వ్యక్తిగతమైన కారణాల వల్ల డిసెంబర్ 2007 కంప్యూటర్ ఎరా సంచిక విడుదల చేయడం లేదు. ఖచ్చితంగా విలువైన సమాచారం అందించాలన్నది నా కమిట్ మెంట్. అయితే అంత విలువైన సమాచారం అందించడానికి ఈ నెల రీసెర్చ్ చేయడానికి అసలు సమయమే లభించలేదు, ఎక్స్ పీ నుండి పూర్తిగా విస్టాకి మైగ్రేట్ అవడం, దాని వల్ల ఎదురైన కొన్ని కంపాటబులిటీ సమస్యలు, వృధా అయిన సమయం, ఇతరత్రా వ్యక్తిగతమైన కారణాలూ సమయాన్ని చాలా హరించాయి. ఏదో పేజీలను నింపేసి చెడ్డపేరు తెచ్చుకోవడం ఇష్టం లేక డిసెంబర్ 2007 సంచికను విడుదల చేయదలుచుకోలేదు. యధాతధంగా జనవరి 2008 సంచికతో తిరిగి కలుసుకుందాం. చక్కని సమాచారాన్ని మాత్రమే అందించాలన్న మా కమిట్ మెంట్ ని అర్ధం చేసుకుని నిరుత్సాహపడకుండా జనవరి 2008 సంచిక కోసం వెయిట్ చేయగలరు.

మీ
నల్లమోతు శ్రీధర్

ఏ సైజ్ ఫైళ్లు అయినా నేరుగా మీ స్నేహితులకు పంపుకోవడం


ఇంటర్నెట్లో ఫైళ్లని మీ స్నేహితులతో షేర్ చేసుకోవడానికి రేపిడ్ షేర్, మెగా అప్ లోడ్, సెండ్ఇట్ వంటి అనేక సర్వీసులు ఉన్నాయి. అయితే ఫైల్ ని పూర్తిగా అప్ లోడ్ చేసిన తర్వాత మాత్రమే మన స్నేహితులు మనం పంపించే లింకు ఆధారంగా ఆ ఫైల్ని డౌన్ లోడ్ చేసుకోగలుగుతారు. అదీ కాక ప్రతీ ఫైల్ హోస్టింగ్ సర్వీస్ కి ఫైల్ సైజ్ విషయంలో గరిష్ట పరిమితి ఉంటోంది. చాలా తక్కువ సర్వీసులు మాత్రమే పరిమితి లేకుండా ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ఫైళ్లని పంపుకోవడానికి కొంతమంది యాహూ మెసెంజర్లోని Send File వంటి ఆప్షన్లని వాడుతుంటారు. అయితే Gtalk వంటి ప్రోగ్రాముల్లో ఈ Send File సదుపాయం ద్వారా కొన్ని ఫైల్ టైప్ లకు చెందిన ఫైళ్లని మాత్రమే పంపుకోవచ్చు. ఇలా ప్రస్తుతం ఉన్న అన్ని మార్గాల కన్నా నన్ను ఈ మధ్య http://www.pipebytes.com/ అనే సర్వీస్ ఒకటి బాగా ఆకట్టుకుంది. ఇందులో ఉండే Send File అనే బటన్ ని క్లిక్ చేసి మన కంప్యూటర్లో ఉండే ఫైల్ ని ఎంచుకుంటే వెంటనే ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ ని ఆన్ లైన్ లో ఉన్న మన స్నేహితునికి ఇస్తే.. ఇక్కడ మన కంప్యూటర్ నుండి ఒక పక్క ఆ ఫైలు అప్ లోడ్ చేయబడుతూనే మరో పక్క అతని కంప్యూటర్ లో మన అప్ లోడ్ చేసే ఫైల్ వెంటనే డౌన్ లోడ్ చేయబడుతుంటుంది. ఇతర వెబ్ ఆధారిత ఫైల్ మార్పిడి సేవల కన్నా ఇది రెండు రెట్లు వేగంగా ఉంటోంది. ఒక పక్క ఫైల్ అప్ లోడ్ చేయబడుతుంటే మనకు టైమ్ పాస్ అవడానికి YouTube వీడియోలు మన బ్రౌజర్ లో ప్లే చేయబడుతుంటాయి.

పాత కంప్యూటర్లు ఇలా ఉండేవి...

నాలుగు ప్రాసెసింగ్ కోర్ లతో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్లని ప్రస్తుతం మనం వినియోగించబోతున్న తరుణంలో అసలు 1970వ ప్రాంతం నుండి ఇప్పటివరకూ విడుదల చేయబడిన వివిధ కంప్యూటర్ల రూపాలను పరిశీలిస్తే కొన్ని కాలిక్యులేటర్లుగానూ, కొన్ని మైక్రోవేవ్ ఓవెన్లు గానూ వేర్వేరు రూపాల్లో నవ్వు తెప్పించడం ఖాయం. కేవలం 37 ఏళ్లలో మనిషి సాంకేతికంగా ఎంత ఎదిగాడో (సామాజికంగా దిగజారాడు అనుకోండి) అర్ధమవుతుంది.

19, నవంబర్ 2007, సోమవారం

ఉచిత, పెయిడ్ ఏంటీ వైరస్ సాఫ్ట్ వేర్లకు మధ్య వ్యత్యాసం


Norton, McAfee, Panda వంటి పలు ఏంటీవైరస్ ఉత్పత్తులు మార్కెట్లో కొంత ధరకు విక్రయించబడుతుండగా AVG, Avast, Avira వంటి కొన్ని ఏంటీవైరస్ ఉత్పత్తులు ఉచితంగా అందించబడుతున్నాయి. "ఉచితమైనవీ, డబ్బు చెల్లించి కొనుక్కునేవీ రెండూ ఏంటీవైరస్ లే కదా.. ఏదైతే ఏముంది.." అని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. సాధారణంగా పెయిడ్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లలో వైరస్ లను గుర్తించే డెఫినిషన్లతో పాటు కీలాగర్లు, బ్రౌజర్ హైజాకర్లు, డయలర్ ప్రోగ్రాములు, PUPలు వంటి వాటిని గుర్తించే స్కానింగ్ టెక్నాలజీ కూడా పొందుపరచబడి ఉంటుంది. కొన్ని పెయిడ్ ఏంటీ వైరస్ లలో ఇ-మెయిల్ వైరస్ స్కానింగ్, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి వాటిని కాపాడే ప్రైవసీ సదుపాయాలు సైతం పొందుపరచబడి ఉంటాయి. అదే ఉచిత ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ల విషయానికి వస్తే కేవలం వైరస్ లను గుర్తించే టెక్నాలజీ మాత్రమే వాటిలో ఉంటుంది. ఇ-మెయిల్ వైరస్ స్కానింగ్ వంటి అదనపు సదుపాయాలను పొందాలంటే ఆయా ఫ్రీ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు అందించే "ప్రీమియమ్ లేదా ప్రొఫెషనల్" వెర్షన్లని కొనుగోలు చేయవలసిందే. పెయిడ్ ఏంటీ వైరస్ కొనాలనుకుంటున్నప్పుడు అది అందించే సదుపాయాలు మన అవసరాలకు సరిపోతాయో లేదో చూడండి.

మీ వెబ్‌సైట్ గురించి స్పందన కోరుకోవచ్చు



ఎంతో కష్టపడి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకున్న మీ వెబ్‌సైట్‌ని అందరూ కేవలం ఓపెన్ చేసి తమకు కావలసిన సమాచారం తెలుసుకుని వెళ్ళిపోతున్నారా !!!.. విజిట్ చేసే యూజర్లు మీ వెబ్‌సైట్ గురించి మీ అభిప్రాయాలను మీతో పంచుకుంటే బాగుంటుందని భావిస్తున్నారా? అయితే reviewbasics అనే వెబ్‌సైట్‌లో లభించే ఉచిత సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది. మీ వెబ్‌సైట్ యొక్క స్క్రీన్‌షాట్‌ని కేప్చర్ చేసి reviewbasics సైట్‌కి అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మీ వెబ్‌సైట్‌లో ఎక్కడోచోట... "మీ అభిప్రాయాలను తెలియజెయ్యదలుచుకుంటే ఈ లింక్‌ని క్లిక్ చేయండి" అని రివ్యూబేసిక్స్ సైట్‌కి లింక్‌ని పొందుపరచండి. అంటే ఒకసారి విజిటర్లు మీ స్క్రీన్‌షాట్ ఉన్న పేజీలోకి వెళ్ళిన తర్వాత మీ సైట్‌లో తమకు నచ్చిన భాగాలను కలర్‌తో హైలైట్ చేయొచ్చు. Sticky నో, స్మైలీలను జతచేయగలుగుతారు.

నెట్ ఆధారంగా మొబైల్‍లో ఉచిత కాల్స్



Skype వంటి వాయిస్ చాటింగ్ ప్రోగ్రామ్‌ని ఉపయోగించి కంప్యూటర్లో ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఎలాగైతే ఉచిత కాల్స్‌ని చేసుకుని మాట్లాడవచ్చో అదే మాదిరి VoIP టెక్నాలజీ ఆధారంగా మీ మొబైల్ ఫోన్ ద్వారా WiFi, 3G, GPRS నెట్‌వర్క్‌లోని ఇతర ఫోన్ యూజర్లతో ఉచితంగా మాట్ళాడుకోవడానికి Truphone అనే ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అత్యంత నాణ్యమైన సౌండ్ క్వాలిటీని అందిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ పనితీరు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్ అందిస్తున్న GPRS కనెక్షన్ స్పీడ్ వేగంగా ఉంటే మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రోగ్రామ్ Nokia సంస్థకు చెందిన E సెరీస్ , N సీరీస్ మోడళ్ళకు చెందిన ఫోన్లపై పనిచేయగలుగుతుంది.

18, నవంబర్ 2007, ఆదివారం

విండోస్ ’సి’ డ్రైవ్‍లోనే బెటర్




ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగిస్తూ మీవద్ద ఒకటి కంటే ఎక్కువ డ్రైవ్‌లు ఉన్నప్పుడు దాదాపు అందరూ C డ్రైవ్‌లోనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంటారు. ఒకవేళ రెండు ఆపరేటింగ్ సిస్టమ్‌లను వాడదలుచుకున్నప్పుడు అదీ ఆల్రెడీ C డ్రైవ్‌లో ఒక ఆపరేటిన్ సిస్టమ్ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే తాజాగా ఇన్‌స్టాల్ చెయ్యదలుచుకున్న రెండవ O/S కోసం D, E,F వంటి ఇతర డ్రైవ్‌ల జోలికి వెళ్తుంటాం. అయితే వాస్తవానికి విండోస్‌ని ఇతర డ్రైవ్‌లలో కన్నా రూట్ డ్రైవ్ అయిన C డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చెయ్యడమే అన్ని విధాలా మంచిది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

విండోస్ ఆధారిత ఫైళ్ళు కనిపించక ఇబ్బంది


పొరబాటులో లేక ఆల్రెడీ C డ్రైవ్‌లో వేరొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్లనో Win Xp ఆపరేటింగ్ సిస్టమ్‌ని D డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేశామనుకుందాం. విండోస్ వరకూ బాగానే పనిచేస్తుంది. అయితే కొన్ని ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు విండోస్‌లో అంతర్భాగంగా కంప్యూటర్‌లోకి కాపీ చేయబడి ఉండే సిస్టమ్ ఫైళ్ళ ఆధారంగా పనిచేస్తుంటాయి. వాస్తవానికి సక్రమంగా ప్రోగ్రామింగ్ చేయబడిన సాఫ్ట్‌వేర్లలో Windows ఇన్‌స్టలేషన్ పాత్‌ని తమంతట తాము తెలుసుకునే ప్రోగ్రామింగ్ కోడ్ రాయబడి ఉంటుంది. వాటి విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాంటి ఏర్పాటు లేని ధర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లు C డ్రైవ్‌లోనే ఉందని భావించి పనిచేస్తుంటాయి. దానితో తమకు కావలసిన విండోస్ సిస్టమ్ ఫైళ్ళ కోసం రూట్ డ్రైవ్ అయిన Cఆని వెదుకుతాయి. ఉదా.. మనం ప్రతీరోజు ఉపయోగించే అధికశాతం సాఫ్ట్‌వేర్లు Windows ఫోల్డర్‌లో స్టోర్ చేయబడి ఉండే i386 అనే ఫోల్డర్‌లో ఉండే ముఖ్యమైన సిస్టమ్ ఫైళ్ళని వాడుకుంటుంటాయి. ఒకవేళ విండోస్ D డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నట్లయితే ఆ i386 ఫోల్డర్ కూడా అదే డ్రైవ్‌లో ఉంటుంది కాబట్టి ఆ ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు C డ్రైవ్లో మాత్రమే తమకు కావాల్సిన ఫైళ్ళకోసం వెదికి అవి కనిపించకపోయేసరికి ఎర్రర్ మెసేజ్‌ని చుపించి పనిచేయకుండా నిలిచిపోతాయి. సో.. ఒకవేళ విండోస్‌ని C లో కాకుండా D,E వంటి ఇతర డ్రైవ్‌లలో ఇన్‌స్టాల్ చేసినట్లయితే ఇలాంటి ఎర్రర్ మెసేజ్‌లను పరిస్థితిని అధిగమైంచడనికి D:\Windows అనే ఫోల్డర్ మొత్తాన్ని C డ్రైవ్‌లోకి అదనంగా ఓ కాపీ చేసిపెడితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు తలెత్తవు.


పాత్ మారిపోవడం వల్ల సమస్యలు

అయితే ఇలా చేయడం వల్ల మరో సమస్య ఉంది. కొన్ని సాఫ్ట్‌వేర్లు తాము ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు Windows ఫోల్డర్ యొక్క పాత్‌ని Dగా సెట్ చేసుకుని ఉంటాయి. తాజాగా అలాంటి సాఫ్ట్‌వేర్లు సరిగ్గా లోడ్ అవక ఇబ్బందులు సృష్టించవచ్చు. అలాంటప్పుడూ విండోస్ ఫోల్డర్‌ని Cలోకి కాపీ చేసిన తర్వాత ఏయే సాఫ్ట్‌వేర్లు పనిచేయడం లేదో వాటిని రీఇన్‌స్టాల్ చేయండి.

చేతిరాతని కేప్చర్ చేసే డిజిటల్ పెన్



Logitech సంస్థ Logitech io 2 Digital Pen పేరుతో ఓ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది అచ్చం బాల్ పాయింట్ పెన్ మాదిరిగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్‌లో మాదిరిగానే ఇందులో ఇంక్ కూడా పొందుపరచబడి ఉంది. అయితే మామూలు పెన్‌కి దీనికి ఉన్న వృత్యాసం... ఈ పెన్‌తో మనం పేపర్‌పై రాసే సమాచారం మొత్తం ఆ పెన్‌లోనే అంతర్గతంగా అమర్చబడి ఉన్న మెమరీలోకి కాపీ చేయబడుతుంది. ఆ తర్వాత ఆ పెన్‌ని పిసికి కనెక్ట్ చేసుకుని అందులోని సమాచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుని Word వంటి ప్రోగ్రాముల్లో ఎడిట్ చేసుకోవచ్చు. మన చేతి రాతని విశ్లేషించి దానిని హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపంలోకి మార్చే సాఫ్ట్‌వేర్‌ని ఈ పెన్‌తోపాటు అందించబడే సిడిలో ఇస్తున్నారు. సో.. విద్యార్థులు, జర్నలిస్ట్‌లు, ఇతర ప్రొఫెషనల్స్ తాము పేపర్‌పై రాసిన మేటర్‌ని తిరిగి టైప్ చేయవలసిన అవసరం లేకుండానే ఎడిట్ చేసుకోవడానికి అనువైన సమాచారాన్ని ఈ పెన్ సాయంతో పొందవచ్చన్నమాట.

16, నవంబర్ 2007, శుక్రవారం

మెమరీ పనితీరు - మెరుగు పరుచుకునే మార్గాలు





మెమరీ అంత ఎక్కువగా ఉంటే అప్లికేషన్ ప్రోగ్రాములు అంత వేగంగా పనిచేస్తాయని మనకు తెలుసు. అయితే RAM ఎలా పనిచేస్తుంది. దాని పనితీరుని పెంపొందించడానికి మనం స్వతహాగా చేయవలసిన సెట్టింగుల గురించి అవగాహన లేనివారికి ఈ వ్యాసం ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుందంటే ..

ప్రతీ మెమరీ మాడ్యూల్‌పై పలు చిప్‌లు అమర్చబడి ఉండడం గమనించే ఉంటారు. ఆయా చిప్‌లలొ ప్రతీ చిప్‌పై సూక్ష్మమైన కెపాసిటర్లు అనేకం ఒక సముదాయంగా పొందుపరచబడి ఉంటాయి. వీటిలో ప్రతీ కెపాసిటర్ కొంత విద్యుత్‌ని స్వీకరించగలుగుతంది. ఇలా ఏదైనా కెపాసిటర్ విద్యుత్ స్వీకరించినట్లయితే అప్పుడు బైనరీ విలువ 1ని ఆ కెపాసిటర్ కలిగి ఉన్నట్లు భావించాలి. కెపాసిటర్ విద్యుత్‌ని తీసుకోకపోతే బైనరీ విలువ 0కలిగి ఉన్నట్లు పరిగణించాలి. మన ఫైళ్ళు మొత్తం ఇలా 0, 1, లతో కూడిన బైనరీ డేటాగానే స్టోర్ చెయ్యబడుతుందని మీకు తెలిసిందే! మెమరీలో డేటాని స్టోర్ చెయ్యడానికి తిరిగి దానిని చదవడానికి పిసి ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. ఒక్కోసారి కాస్మిక్ కిరణాల ప్రభావం వల్ల మెమరీ చిప్‌లోని కెపాసిటర్లు తాము నిల్వ ఉంచుకున్న విద్యుత్‌ని కోల్పోతుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని సరిచేసి డేటాకి నష్టం వాటిల్లకుండా చేయడానికి ECC (Error Correction Code) అనే టెక్నాలజీని RAMలో వాడుతుంటారు.

నిలువు , అడ్డ వరుసలు

మన పిసి మెమరీ నుండి ఎదైనా అంశాన్ని రీడ్ చెయ్యాలని కోరుకున్నప్పుడు RAM కంట్రోలర్ సర్క్యూటరీ అ అంశం RAM లోని ఏ చిప్‌లో, ఏ అడ్డ వరుస, నిలువు వరుసలోని కెపాసిటర్‌లో స్టోర్ చేయబడి ఉందన్నది Row Address Strobe (RAS), Column Address Strobe(CAS), అనే పిన్‌ల ఆధారంగా పిసికి తెలియజేస్తుంది. ఈ పద్ధతి వల్ల రామ్ కంట్రోలర్ సర్క్యూటరీపై పెద్దగా భారం పడకుండా వీలైనంత వేగంగా మెమరీ నుండి డేటా యాక్సెస్ చేయబడుతుంది.

మెమరీ పెర్‌ఫార్మెన్స్ పెంచే BIOS సెట్టింగులు

సహజంగా BIOS లో RAM కి సంబంధించి ఐదు సెట్టింగులు లభిస్తుంటాయి. మొదటిది 'కమాండ్ రేట్ '.డేటాని మెమరీలో స్టోర్ చెయ్యవలసి వచ్చినప్పుడు మెమరీ మాడ్యూల్‌లోని ఏ చిప్‌ని ఎంచుకుని... దానికి కమాండ్లని పంపడానికి పట్టే సమయం ఇది. అలాగే మెమరీలోని కాలమ్‍ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కాలమ్ ఉండి డేటా రావడానికి మధ్య గల వ్యవధిని CAS Latency అని పిలుస్తారు. ఒక Row ని యాక్సెస్ చేయడం ముగించి తర్వాతి వరుస యాక్సెసింగ్ ప్రారంభించడానికి మధ్య గల వ్యవధిని RAS Percharge Delay(tRP) అంటరు. ఇకపోతే ఒక Rowని , కాలమ్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మధ్య గల వ్యవధిని RAS to CAS Delay (tRCD) అంటారు. ఏక్టివేషన్, ప్రీ చార్జ్ కమాండ్లకు మధ్య గల వ్యవధిని Active Precharge Delay (tRAS) అనే పేరుతో వ్యవహరిస్తారు. వివిధ BIOS ప్రోగ్రాముల్లో ఈ సెట్టింగులు ఇవే పేర్లతో ఉండవచ్చు. లేదా సమీప అర్ధం ధ్వనించే వేరే పేర్లతో ఉండవచ్చు.ఏది ఏమైనా ఈ ఐదు సెట్టింగుల Delayలను తగ్గించడం వల్ల సిస్టమ్ పని తీరు మెరుగుపడుతుంది అయితే BIOSలోకి వెళ్ళి గుడ్డిగా ఈ సెట్టింగులను మార్చకండి. మీరు వాడుతున్న RAM అలా Delayలను తగ్గించడాన్ని సపోర్ట్ చేసేదైతేనే ఉపక్రమించండి. ఒకవేళ తక్కువ delayలటో పనిచేయగల సమర్ధత మీ మెమరీ మాడ్యూల్‌కి లేనట్లయితే సిస్టమ్ క్రాష్, లాక్ అయిపోవచ్చు. ఒక సారి ఆ పరిస్థితి తలెత్తితే మదర్‌బోర్డ్‌పై CMOS Clear జంపర్‌ని తోలగించడం ద్వారా సిస్టమ్‍ ని పూర్వస్థితికి తీసుకు వెళ్ళవచ్చు.




థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు ...

మనం క్లోజ్ చేసిన ప్రోగ్రాములు మెమరీ నుండీ పూర్తిగా తమ సమాచారాన్ని తొలగించకపోవడం వల్ల పిసిని ఆన్ చేసిన తర్వాత కొన్ని గంటలకు RAM లోనీ ఫ్రీ స్పేస్ ఉండవలసినంత ఉండదు. దీనినే ' మెమరీ లీకింగ్ ' అంటారు. మెమరీలో వౄధాగా నిలిచిపోయిన డేటాని తొలగించడంతో పాటు చెల్లాచెదురుగా పడిఉన్న డేటాని ఒక క్రమపద్ధతిలో పెట్టేలా RAM Defrag చేసే RAM Booster వంటి థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించడం వల్ల మెమరీ సక్రమంగా పనిచేస్తుంది.

ఇతర జాగ్రత్తలు ...

చాలామంది అనేక అప్లికేషన్ ప్రోగ్రాముల్ని ఒకేసారి ఓపెన్ చేసి పనిచేస్తుంటారు. వాటిలో దీర్ఘకాలం పాటు అవసరం లేని ప్రోగ్రాముల్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తుండడం వల్ల లేదా అవసరం అయినప్పుడే ఓపెన్ చేసుకోవడం వల్ల మెమరీ లీకింగ్ సంభవించదు. 3D గేములు, Maya, 3D Studio Max వంటి మెమరీని అధికంగా ఉపయోగించుకునే అప్లికేషన్లని ఒకసారికి ఒక దానిని వాడడమే శ్రేయస్కరం. అన్నింటిని ఒకేసారి వాడడం తప్పనిసరైతే ఏమీ చెయ్యలేమనుకోండి. అలాగే మెమరీని అప్‌గ్రేడ్ చెయ్యదలుచుకుంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ఒకే ఒక మాడ్యూల్‌ని సిస్టమ్‌లో అమర్చుకోండి తప్ప పాత దానితో కొత్త మాడ్యూల్‌ని జత చేయకండి.

వేగంగా పనిచేస్తున్న డెస్క్ టాప్ షేరింగ్ సాఫ్ట్ వేర్


ఎక్కడో దూరప్రాంతంలో ఉన్న మీ స్నేహితులకు కంప్యూటర్ పై ఏదో సందేహం వచ్చింది. దానిని మీరు ఫోన్ ద్వారా, ఛాటింగ్ ద్వారా చెబుతున్నా వారికి అర్ధం కావడం లేదనుకోండి. అలాంటప్పుడు మీరే వారి కంప్యూటర్ స్ర్కీన్ ని మీ మోనిటర్ పై చూడగలిగి వారి సందేహాలు తీర్చగలిగితే బాగుంటుంది కదూ! వాస్తవానికి ఈ తరహా పనులను చేసిపెట్టడానికి విండోస్ లో రిమోట్ అసిస్టెన్స్ అనే సదుపాయమూ ఉంది, అలాగే RAdmin వంటి థర్డ్ పార్టీ సాఫ్టవేర్లూ ఉన్నాయి, www.logmein.com వంటి ఆన్ లైన్ సర్వీసులూ ఉన్నాయి. నేను వాటన్నింటినీ ఉపయోగించి చూశాను కానీ.. http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe అనే వెబ్ లింకులో లభిస్తున్న టీమ్ వ్యూయర్ అనే సాఫ్ట్ వేర్ అన్నింటి కన్నా కాన్ఫిగర్ చేయడం విషయంలో గానీ, ఉపయోగించడం విషయంలో కానీ చాలా సులభంగా అనిపించింది. ఉచితంగా లభించే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో మన కంప్యూటర్ ని మన స్నేహితులకు చూపించవచ్చు, వారి కంప్యూటర్ ని వారి సహకారంతో మనమూ చూడవచ్చు, ఛాటింగ్ చేసుకోవచ్చు, ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్ కి ఫైళ్లనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

15, నవంబర్ 2007, గురువారం

విండోస్‍లోనే డిస్క్ క్లీనింగ్





ఏ ఇతర సాఫ్ట్ వేర్ల అవసరం లేకుండానే అనవసరమైన సమాచారాన్ని తొలగించడం ద్వారా హార్డ్ డిస్క్ ని శుభ్రపరిచి, కొంతమొత్తంలో స్పేస్ రికవర్ చేసే Disk Cleanup అనే టూల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కొన్ని వెర్షన్లలో పొందుపరచబడి ఉంది. Accessories>System Tools>Disk Cleanup అనే ఆప్షన్‌ని క్లిక్ చెయ్యడం ద్వారా కానీ, లేదా విండోస్ ఎక్స్ ‌ప్లోరర్‌లో ఏ డ్రైవ్‌నైతే క్లీన్ చెయ్యాలనుకుంటున్నామో దానిని మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Properties>Tools>DiskCleanup ఆప్షన్‌ని క్లిక్ చేసిగానీ దీన్ని రన్ చెయ్యవచ్చు.

కాంటాక్ట్ అడ్రస్సులు వెదకడం

Address Book, Outlook Express లను ఉపయోగిస్తున్న యూజర్లు నేరుగా అడ్రస్ బుక్‌లోకి వెళ్ళనవసరం లేకుండానే StartMenu>Find ఆప్షన్ ద్వారానే సింపుల్‌గా పేరు లేదా మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, లేదా ఇతరత్రా వివరాలను టైప్ చేయడం ద్వారా తమకు కావల్సిన వ్యక్తుల వివరాలను అడ్రస్‌బుక్ నుండీ వెలికి తీసుకోవచ్చు. Find>People అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దాని సాయంతో ఏ చిన్న వివరంతో అయినా మనకు కావలసిన వ్యక్తి వివరాలు పొందవచ్చు. ఉదా.కు.. 6681524 అనే ఫోన్ నెంబర్‌ని టైప్‌చేసి Find అనే ఆప్షన్‌ని క్లిక్ చేసిన వెంటనే అడ్రస్ బుక్‌లో ఆ ఫోన్ నెంబర్ కలిగిన వ్యక్తులెవరైనా ఉంటే, వారి పేరు, ఇమెయిల్ ఐడి, ఇతరత్రా వివరాలు చిటికెలో వచ్చేస్తాయి.

9x కంప్యూటర్లలో డెస్క్ట్ టాప్ పై IE వాల్ పేపర్లు కావాలంటే




HTML వెబ్‌పేజీల్లో పొందుపరచబడిన అందమైన ఇమేజ్‌లను డెస్క్ టాప్‌పై వాల్‌పేపర్లుగా అమర్చుకోడానికి Windows 98, Me వంటి పాత ఆపరేటింగ్ సిస్టమ్ లలో ActiveDesktop అనే ఆప్షన్ enable చెయ్యబడి ఉండాలి. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి Active Desktop అనే మెనూలో Show Web Content అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినా గానీ, లేదా ControlPanel>Folder Options>General>ActiveDesktop>Enable Web Content on my desktop అనే ఆప్షన్‌ని అమర్చుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

14, నవంబర్ 2007, బుధవారం

వీడియో సిడిల్లోని మూవీ కాపీ చేసుకోవాలా?

మీకు నచ్చిన వీడియో సిడిల్లోని వీడియోని కాపీ చేసుకోవాలనుకుంటున్నారా? విసిడిలో CDI, EXT, SEGMENT, MPEGAV, VCD వంటి పేర్లతో పలు ఫోల్డర్లు కనిపిస్తుంటాయి. వాటిలో MPEGAV అనే ఫోల్డర్‌లో మనం కాపీ చేసుకోవలసిన వీడియో ఫైళ్ళు స్టోర్ చెయ్యబడి ఉంటాయి. ఈ వీడియో ఫైళ్ళు .DAT ఎక్స్‌టెన్షన్ నేమ్‌ని కలిగి ఉండీ, సాధారణంగా AVSEQ01, AVSEQ02 మాదిరి పేర్లని కలిగి ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని Ctrl+C కమాండ్‌తో కాపీ చేసుకుని హార్డ్‌డిస్క్‌లో వాటిని ఎక్కడైతే సేవ్ చేయ్యాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి Ctrl+V కీబోర్డ్ షార్ట్‌కట్‌తో పేస్ట్ చేస్తే సరిపోతుంది. లేదా కాపీ, పేస్ట్‌లకు మెనూలోని ఆప్షన్లని ఉపయోగించుకోవచ్చు.

ZIP రూపంలో ఉన్న సాఫ్ట్ వేర్లని ఇన్‍స్టాల్ చెయ్యడం



కొన్ని సాఫ్ట్‌వేర్లు కంప్రెస్ చెయ్యబడి ఉంటాయి. వాటిని మౌస్‌తో డబుల్‌క్లిక్ చేసినప్పుడు వెంటనే WinZip ప్రోగ్రామ్ ఓపెన్ అయి, ఆ కంప్రెస్డ్ ఫైల్‌లో నిక్షిప్తం చెయ్యబడిన ఫైళ్ళ వివరాలను చూపిస్తుంది. ఇలాంటి సాఫ్ట్‌వేర్లని ఇన్‌స్టాల్ చెయ్యవలసి వచ్చినప్పుడు చాలామంది WinZip లోని Extract ఆప్షన్ ద్వారా వాటన్నింటినీ టెంపరరీ ఫోల్డర్లోకి Uncompress చేసి, ఆ తర్వాత ఆ టెంపరరీ ఫోల్డర్‌లోకి వెళ్ళి Setup ఫైల్‌ని డబుల్‌క్లిక్ చేసి ఇన్‌స్టలేషన్ చేసుకుంటారు. ఇలా చెయ్యడం వల్ల చాలా సమయం వౄధా అవుతుంది. దానికి బదులు నేరుగా WinZip సాఫ్ట్‌వేర్ నుండే ఇన్‌స్టలేషన్ మొదలు పెట్టవచ్చు. కంప్రెస్డ్ స్థితిలో ఉన్న జిప్‌ఫైల్‌ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే WinZip సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుందని చెప్పుకున్నాం కదా! అక్కడ ఆప్షన్ బార్‌లో Install అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఓ డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. సింపుల్‌గా అక్కడ OK బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్‌స్టలేషన్ మొదలైపోతుంది. మనకు తెలియకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో జిప్ చెయ్యబడి ఉన్న ఇన్‌స్టలేషన్ ఫైళ్ళన్నీ వేగంగా టెంపరరీ ఫోల్డర్‌లోకి Unzip అయి ఇన్‌స్టలేషన్ పూర్తయిన వెంటనే ఆ టేంపరరీ ఫైళ్ళు తొలగించబడతాయి.

13, నవంబర్ 2007, మంగళవారం

DVD ROM కొనాలనుకుంటున్నారా?




ఆర్నెల్ల క్రితం సిడిరామ్ డ్రైవ్‌లు లభించిన ధరకు ప్రస్తుతం DVD ROM డ్రైవ్‌లు లభిస్తున్నాయి. సిడిరామ్ డ్రైవ్‌లు నాలుగైదు నెలలకు మించి సరిగ్గా పనిచెయ్యకపోవడం, డీవిడి రామ్ డ్రైవ్‌లోనే సిడిలను సైతం యాక్సెస్ చెయ్యగలగడం వంటి పలు కారణాలవల్ల ఇటీవల సిడిరామ్ డ్రైవ్‌లకు బదులు డివిడి రామ్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న యూజర్లు ఎక్కువయ్యారు. డివిడి రామ్ డ్రైవ్ dual-side డివిడి మీడియాని రీడ్ చెయ్యగలిగేది మాత్రమే కొనుగోలు చేయ్యండి. ప్రస్తుతం గరిష్టంగా 16x స్పీడ్ కలిగిన డీవిడి రామ్‌లు లభ్యమవుతున్నాయి. అంతకన్నా తక్కువ స్పీడ్ డ్రైవ్‌ని కొనకండి. మీరు కొనుగోలు చేసే డివిడి రామ్ డ్రైవ్‌కి తప్పనిసరిగా 512KB బఫర్ మెమరీ ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సాధారణంగా డీవిడీరామ్ డ్రైవ్‌తో పాటు డివిడిలను ప్లే చెయ్యడానికి ఉపకరించే సాఫ్ట్‌వేర్‌ని ఉచితంగా అందిస్తుంటారు. WinDVD వంటి ప్రొఫెషనల్ డీవిడి ప్లేయింగ్ సాఫ్ట్‌వేర్ మీరు కొనే డీవిడిరామ్‌తో పాటు లభిస్తే మంచిది. సిడిరామ్ డ్రైవ్‌లను కొనేకన్నా డివిడిరామ్‌ని కొనుగోలు చెయ్యడం ఖచ్చితంగా బెటర్ డెసిషన్.

ఫైల్ మేనేజ్‍మెంట్

ఫైళ్ళని సక్రమంగా నిర్వహించుకోనిదే కంప్యూటర్ ద్వారా ప్రయోజనం పొందడం సాధ్యపడదు. ఫైళ్ళని క్రియేట్ చేసుకోవడానికి వాటిని ఫోల్డర్లలో స్టోర్ చేసుకోవడానికి వీలు కల్పించే విండోస్ డిఫాల్ట్ సదుపాయాలతో పాటు వివిధ సందర్భాల్లో ఫైళ్ళని మేనేజ్ చెయ్యడానికి ఉపకరించే పలు ధర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లు లభిస్తున్నాయి. ఫైళ్ళని మేనేజ్ చేసుకునే భిన్నమైన మార్గాల గురించి తెలుసుకుందాం.



ముక్కలు చెయ్యడానికి,కలపడానికి

4MB సైజ్‌గల ఫైల్‌ని ఫ్లాపీలో కాపీ చేయవలసి వస్తే సాధ్యపడదు కదా! అలాగే 1GB సైజ్‌గల ఒక ఫైల్‌ని నేరుగా సిడిలో రైట్ చేయలేం. అలాంటప్పుడు మనం కోరుకున్న పరిమాణంలో ఫైళ్ళని విడగొట్టడానికి , ఆల్రెడీ విడగొట్టబడి ఉన్న ఫైళ్ళని తిరిగి సింగిల్ ఫైల్‌గా జాయిన్ చేయ్యడానికి File Splitter, AxMan, Dariolius.Pro Splitter, GSplit వంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగపడుతుంటాయి.




భారీమొత్తంలో ఫైళ్ళ పేర్లు మార్చడానికి

డిజిటల్ కెమెరాల నుండి ఫోటోలను సిస్ట్‌లోకి ట్రాన్‌స్ఫర్ చేసుకునేటప్పుడు అన్ని ఫోటోలుDSC001,DSC002... వంటి ఒకే తరహా పేర్లతో స్టోర్ చెయ్యబడతాయి. వందలకొద్ది ఉండే ఇలాంటి ఫైళ్ళ యొక్క పేర్లని ఒకటోకటిగా మార్చడం చాలా కష్టమైన వ్యవహారం. భారీ సంఖ్యలో ఉన్న ఏ తరహా ఫైళ్ళనైనా మనం కోరుకున్న సీక్వెన్స్‌లో క్షణాల్లో రీనేమ్‌చెయ్యడానికి... Rename4U, Bulk Rename Utility, Rename Master, Lupas Rename వంటి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాములు అవసరం అవుతుంటాయి.




ఫైళ్ళు ఇతరులు ఓపెన్ చెయ్యకుండా

మన సిస్టమ్‌లో ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులు చూడకుండా జాగ్రత్తపడాలంటే థర్డ్‌పార్టీ సాఫ్ట్‌వేర్లపై ఆధారపడవలసి వస్తుందే. ఒకసారి పాస్‌వర్డ్ సెట్ చేసిన తర్వాత కేవలం పాస్‌వర్డ్ కరెక్ట్‌గా టైప్ చేస్తేనే ఆయా ఫైళ్ళని ఓపెన్ చేసి పెట్టే ఎన్‌క్రిప్షన్ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించడం మంచిది.ఇలాంటి ప్రోగ్రాముల్లో Encrypt-it, Encryption Protection, Stealth File Encryptor, Encrypt Genie వంటి పలు సాఫ్ట్‌వేర్లు నెట్‌పై అందుబాటులో ఉన్నాయి.




ఫైళ్ళ పరిమాణాన్ని కుదించడానికి.

విలువైన హార్డ్‌డిస్క్ స్పేస్‌ని ఆదా చేసుకోవడం కోసం ప్రస్తుతం అంతగా అవసరం లేని ఫైళ్ళని కంప్రెస్ చేసుకుని స్టోర్ చేసుకోవడం మంచిది. WinME, Xp ఆపరేటింగ్ సిస్టమ్‌లలో Compressed Folders అనే సదుపాయం పొందుపరచబడినా దానికన్నా సాధ్యమైనంత ఎక్కువ పరిమాణంలో ఫైళ్ళ పరిమాణాన్ని కుదించే WinRar, WInZip, WinACE,CoolZip, Zip-n-Go వంటీ సాఫ్ట్‌వేర్లు అనేక సందర్భాల్లో ఉపయుక్తంగా ఉంటాయి. ట్రై చేసి చూడండి.

11, నవంబర్ 2007, ఆదివారం

200. మీడియా ప్లేయర్‌లో సిడి రికార్డింగ్




Windows Media Player 11 వెర్షన్‌లో సిడిలను డివిడిలను రికార్డ్ చేసుకోవడానికి అద్భుతమైన ఆప్షన్లు పొందుపరచబడ్డాయి. కేవలం కొన్ని సింపుల్ స్టెప్సులతో సిడి/డివిడి లను రైట్ చేసుకోవచ్చు. Burn అనే బటన్‌పై క్లిక్ చేసి ప్రస్తుతం ప్లేయింగ్ లిస్ట్‌లో ఉన్న అంశాల్ని రైట్ చేయాలా, ఆడియో, డేటా సిడిలలొ దేనిగా రైట్ చేయాలన్నది ఎంచుకోవాలి.ఇప్పుడు ఖాళీ సిడిని రైటర్‌లో ఇన్‌సర్ట్ చేయండి. మీ పిసిలో ఒకటి కంటే ఎక్కువ రైటర్లు ఉన్నట్లయితే playlist కి పైభాగంలో కనిపించే Next Drive అనే బటన్‌ని క్లిక్ చేసి కావలసిన డ్రైవ్‌ని ఎంచుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కొంత డేటా ఉన్న రీరైటబుల్ సిడిని డ్రైవ్‌లో ఇన్‌సర్ట్ చేసినట్లయితే.. Navigation విభాగంలొ డ్రైవ్ లెటర్‌పై మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి Erase అనే ఆప్షన్ ద్వారా ప్రస్తుతం ఆ డ్రైవ్‌లో ఉన్న డేటాని చెరిపి వేయవలసి ఉంటుంది. "ప్లేయర్ లైబ్రరీ" నుండి ఫైళ్ళని సిడి పైకి రైట్ చేసుకోవడానికి సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం List విభాగంలో ఉన్న అంశాలని తొలగించి తాజాగా రైట్ చెయ్యవలసిన మీడియా ఫైళ్ళ లిస్ట్‌ని సృష్టించదలుచుకుంటే Clear list pane అనే బటన్‌ని క్లిక్ చేయండి. Burn List కి మీరు పాటలు Add చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇంకా ఎన్ని నిముషాల ఆడియో జత చేయవచ్చో status నిముషాలు, సెకన్ల రూపంలో చూపించబడుతుంది. లైబ్రరీలో లేకుండా హార్డ్‌డిస్క్‌పై ఉన్న ఫైల్‌ని Burn chEyaalanTE ఆ ఫైల్‌పై రైట్ క్లిక్ చేసి Add to Burn List అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆడియో సిడిని ఎంచుకున్నప్పుడు సిడిలో పట్టేదానికన్నా ఎక్కువ ఫైళ్ళని Burning కి ఎంచుకున్నట్లయితే ఒక దాని తర్వాత మరొకటి పలు సిడిలుగా అవి రైట్ చేయబడుతాయి. ఒక వేళ అన్ని పాటలూ ఒకే సిడిలో కావాలంటే Data CD మోడ్‌ని ఎంపిక చేసుకోండి.

Linuxలో విండోస్ అప్లికేషన్లు రన్ అవ్వాలంటే



ఇప్పటివరకూ మీరు విండోస్ వాడుతూ మరో పార్టీషన్ మీద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే అంతా గందరగోళంగా ఉంటుంది. విండోస్‌పై అలవాటు అయిన ఏ ప్రోగ్రాములూ పనిచేయకపోయేసరికి చేతులు విరిచేసినట్లు ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించడనికి CrossOver Office for Linux అనే ప్రోగ్రామ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని లినక్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. Fedora Core 5 లినక్స్‌లో మేము CompuPic, WinAmp, Pagemaker 7 ప్రోగ్రాముల్ని ఇన్‌స్టాల్ చేసి చూశాం. అన్నీ భేషుగ్గా పనిచేస్తున్నాయి. మీరు ప్రయత్నించి చూడండి.

బ్యాంక్ లావాదేవీలు జర జాగ్రత్త



ఇంటర్నెట్ సదుపాయం అన్ని ప్రాంతాల్లోకి విస్తరించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ళు, నిధుల బదిలీలు వంటి పనుల్ని ఎవరికి వారు తమ పిసి ముందు కూర్చుని చేసుకోగలుగుతున్నారు. అయితే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు తస్కరించే ఫిషింగ్ స్కామ్‌లు, కీలాగర్లు వంటి అనేక ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీరు లావాదేవి జరిపినా లేకున్నా తరచూ మీ బ్యాంక్ ఎకౌంట్‌ని తనిఖీ చేసుకుంటూ ఏవైనా తప్పుడు ఎంట్రీలు కనిపించినట్లయితే ఆలస్యం చెయ్యకుండా మీ బ్యాంక్‌బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయండి. క్రెడిట్‌కార్డ్ ఉన్నట్లయితే వాటీని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే సదుపాయం ఉంటే వాటిపైనా ఓ కన్నేసి ఉంచండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు లాగిన్ అయిన తర్వాత https:// అనే ప్రోటొకాల్ (వెబ్‌సైట్ అడ్రస్ ఇలా ప్రారంభమవుతుంది) కలిగిన వెబ్‌పేజీ ఓపెన్ అయితేనే మీరు నిజమైన బ్యాంకింగ్ సైట్‌కే కనెక్ట్ అయినట్టు లెక్క. ఇంటర్నెట్ ద్వారా ఒక ఖాతా నుండీ మరొక ఖాతాకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తునట్లయితే లావాదెవీకి ముందు తర్వాత బ్యాలెన్స్ వివరాలను తనిఖీ చేసుకోండి. మీవద్ద ప్రింటర్ ఉంటే స్టేట్‌మెంట్‌లను తరచూ ప్రింట్ చేసి పెట్టుకోవడం ఉత్తమం.

సెల్‌ఫోన్, ప్రీపెయిడ్‌లని కొనడం, రైల్వే టికెట్లు, కరెంట్ బిల్లులు, మున్సిపాలిటీ అస్తి పన్నులు వంటివి ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించడానికి వీలు కలుగుతుంది. ఈ నేపధ్యంలో బిల్లులు చెల్లించడానికి ముందు మీ ఎకౌంట్‌లో ఎంత నగదు నిల్వ ఉందో చూసుకుని బిల్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఎంత మొత్తం కట్ అయిందో బేరీజు వేసుకోండి. ఆ చెల్లింపులకు చెందిన లావాదేవీలు ప్రింట్ తీసిపెట్టుకోవడం మరువకండి. .తర్వాత ఏవైనా తేడాలు వస్తే ఆ ప్రింటౌటే మీకు రక్షణగా నిలుస్తుంది. క్రెడిట్‌కార్డ్ ఉంది కదా అని ఏ వెబ్‌సైట్‌కి పడితే ఆ వెబ్‌సైట్‌కి Premium Membership కోసం చెల్లింపులు జరపకండి. ఖచ్చితంగా నమ్మదగిన వెబ్‌సైట్లకి మాత్రమే చెల్లింపులు జరపండి. ఆన్‌లైన్ షాపింగ్ ప్రస్తుతం క్రేజ్ అయిపోయింది. కానీ, మీకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని నేరుగా వెళ్ళి మన్నిక చూసుకుని కొనడమే మంచిది. మన దేశంలో దొరకని తప్పనిసరి వస్తువులను నెట్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం తప్పదనుకోండి.

8, నవంబర్ 2007, గురువారం

ఈజీగా ఉండే FTP క్లయింగ్ ప్రోగ్రామ్...



ఇంటర్నెట్‌పై FTP ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే వెబ్‌సైట్ల నుండి సాధారణ వెబ్‌సైట్ల కన్నా వేగంగా ఫైళ్ళని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే స్వంతంగా వెబ్‌సైట్ కలిగి ఉండి ఎప్పటికప్పుడు నెట్‌కి అప్‌డేట్‌లు చేసేవారు FTP క్లయింగ్ సాఫ్ట్‌వేర్లని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం పలు FTP క్లయింగ్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నా అన్నింటికన్నా సులభమైన ఇంటర్‌ఫేస్ కలిగి ఉన్న ప్రోగ్రామే.. FTP Voyager. విండోస్ ఎక్స్‌ప్లోరర్ తరహా ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉండి FTPఆ సైట్లనుండి అర్ధాంతరంగా ఆగిపోయిన డౌన్‌లోడ్లని కూడా తిరిగి రెజ్యూమ్ చేసే సదుపాయం ఈ సాఫ్ట్‌వేర్ కలిగి ఉంది.

వీడియో ఫైళ్ళని ఫ్లాష్ మూవీలుగా మార్చడం..




AVL,MPEG, MOV వంటి ప్రముఖ వీడియో ఫైల్ ఫార్మేట్లతోపాటు GIF, JPG, BMP వంటి ఇమేజ్ ఫార్మేట్లకు చెందిన ఫైళ్ళని ఫ్లాష్ SWF ఫార్మేట్‌లోకి మార్చడానికి పనికి వచ్చే ప్రోగ్రామే... Video to flash ఇలా జనరేట్ చేసిన ఫ్లాష్ ఏనిమేషన్లని ఫ్లాష్ Standalone Player తో EXE ఫైల్‌గా కన్వర్ట్ చేసుకుని ఏ సిస్టమ్‌లో అయినా ప్లే చేసుకోవచ్చు.

7, నవంబర్ 2007, బుధవారం

ఏకకాలంలో పలు సెర్చ్ ఇంజిన్‌లు వెదకడం




ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా అంశం గురించి వెదకదలుచుకుంటే Google, AltaVista వంటి సెర్చ్ ఇంజిన్‌లను ఆశ్రయిస్తుంటాము . ఒక సెర్చ్ ఇంజిన్ ద్వారా వెదికిన తర్వాత మనకు కావల్సిన సమాచారం లభించకపోతే నిరాశపడవలసిన పని లేదు. అన్ని వెబ్‌సైట్లూ, అన్ని సెర్చ్ ఇంజిన్‌లలోనూ లిస్ట్ అవవు. ఒక కీవర్డ్‌ని టైప్‌చేసి వేర్వేరు సెర్చ్ ఇంజిన్‌లను వెదకమన్నప్పుడు మీకు లభించే రిజల్ట్స్‌ని చూస్తే ఈ విషయం మీకే అర్ధమవుతుంది. ఈ నేపధ్యంలో ఏదైనా అంశం గురించి వెదకవలసి వచ్చినప్పుడు ఏదో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్‌లను వెదకడం కన్నా ఆటోమేటిక్‌గా సాధ్యమైనన్ని సెర్చ్ ఇంజిన్‌లు వెదకబడేలా చూడడం మంచిది. దీనికిగాను థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించవచ్చు. ఉదా..Search Toolbar అనే ప్రోగ్రామ్‌నే తీసుకుంటే ఇందులో ఏదైనా కీవర్డ్ టైప్ చేసి వెదకమంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70కి పైగా సెర్చ్ ఇంజిన్‌ల నుండి మనకు కావలసిన ఫలితాల లిస్ట్ చూపించబడుతుంది. ఇలాంటిదే WebFerret అనే సాఫ్ట్‌వేర్ కూడా! వీటిని ఉపయోగించి చూడండి.

Tasks ఆటోమేటిక్‌గా క్లోజ్ చెయ్యబడేలా..



Ctrl+Alt+Del కీల సముదాయాన్ని ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే Task Manager ద్వారా రెస్పాండ్ అవని టాస్క్‌లను క్లోజ్ చేస్తుంటాము. టాస్క్‌ని సెలెక్ట్ చేసుకుని End Task డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమై పూర్తిగా ఆ టాస్క్‌ని క్లోజ్ చెయ్యడానికి వీలు కల్పిస్తుంది. ఈ నేపధ్యంలో End Task బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఎలాంటి డైలాగ్‌బాక్స్ చూపించబడకుండానే ఆ టాస్క్ క్లోజ్ చెయ్యబడడానికి... HKEY_CURRENT_USER\Control Panel\Desktop అనే విభాగంలో AutoEndTasks పేరిట ఒక DWORD ఎంట్రీ క్రియేట్ చేసి దానికి 1 అనే విలువను ఇవ్వండి. సరిపోతుంది.

6, నవంబర్ 2007, మంగళవారం

Guest ఎకౌంట్‌ని పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ చేయడం



Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ Guest account ద్వారా లాగిన్ అయ్యేవారు సైతం తప్పనిసరిగా పాస్‍వర్డ్ ఎంటర్ చేస్తేనే సిస్టమ్‍లోకి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. Guest Accountకి పాస్‍వర్డ్ సెట్ చెయ్యడానికి Start>ControlPanel>AdministrativeTools>ComputerManagement అనే విభాగంలోనికి వెళ్ళి Local Users and Groups అనే ఆప్శన్ క్రింద Users ఫోల్డర్‍ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్‍లో Guest Accountపై మౌస్‍తో రైట్‍క్లిక్ చేసి Set Password అనే ఆప్షన్‍ని ఎంచుకోవాలి. వెంటనే ఓ వార్నింగ్ మెసేజ్ స్క్రీన్‍పై ప్రదర్శింపబడుతుంది. దానిలోనే Proceed బటన్ పొందుపరచబడి ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే పాస్‌వర్డ్‌ని Guest Account కి సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సాధ్యమైనంత వరకూXP యూజర్లు వీలైనన్ని తక్కువ యూజర్ ఎకౌంట్లు ఉండేలా చూసుకోండి. మనం క్రియేట్ చేసే ప్రతీ యూజర్ ఎకౌంట్ హార్డ్‌డిస్క్‌పై కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. స్థలం వృధా చేసుకోకండి.