ప్రియమైన కంప్యూటర్ ఎరా పాఠకులకు నమస్కారాలు.
మనం ఇతరులకు పంచితే మనకు మరింత పెరిగేది నాలెడ్జ్ మాత్రమే. కంప్యూటర్ రంగంలో మీకు ఉన్న నాలెడ్జ్ ని కంప్యూటర్ ఎరా ఫోరమ్ ద్వారా తోటి పాఠకులతో షేర్ చేసుకుంటూ సమాజసేవ చేస్తున్న మహానుభావులందరి కృషి మాటల్లో వ్యక్తపరచలేనిది. ఇటీవలి కాలంలో కొందరు పాఠకులు మన పత్రిక నేపధ్యం, లక్ష్యాలు, నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న మీదట "ఏ రకంగానైనా మీ వెనుక మేముంటాం" అంటూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. Really I am feeling so happy after hearing those supporting words". వ్యక్తిగతంగా నాకే సాయమూ అవసరం లేదు. నేను చాలారోజులుగా కొన్ని ప్రాజెక్టులు నా మనసులో ఉన్నాయి అని చెబుతూ వస్తున్నాను కదా. వాటిలో ఒక ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు వివరిస్తాను. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవచ్చు.
మీ కంప్యూటర్ నుండే ఇతరులకు హెల్ప్ చేయడం:
మనలో చాలామందికి వేర్వేరు రంగాలపై నాలెడ్జ్ ఉంటుంది. ఉదా.కు.. నాకు హార్డ్ వేర్, రిజిస్ట్రీ , కొత్త సాఫ్ట్ వేర్లు, ట్రబుల్ షూటింగ్ వంటి వాటిపై అవగాహన ఉంది. అలాగే మరో వ్యక్తికి MS-Office గురించి బాగా తెలిసి ఉండవచ్చు. మరో వ్యక్తికి పేజ్ మేకర్, ఫొటోషాప్ లపై అవగాహన ఉండి ఉండవచ్చు. మరో పాఠకుడికి C, C++, Javaలపై నాలెడ్జ్ ఉంటుంది... ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంపై కొద్దోగొప్పో అవగాహన కలిగి ఉంటారు.
ఇప్పటివరకూ మనం చేస్తున్నది ఏమిటంటే:
నాకు MS-Officeలో ఏదైనా డౌట్ ఉంటే నేను నా డౌట్ ని ఈ ఫోరమ్ లో రాస్తే దానిపై అవగాహన ఉన్న వారు తిరిగి తమ సమాధానాన్ని టైప్ చేసి నా డౌట్ ని క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ ఈ ఫోరమ్ లో ప్రశ్నలు, సమాధానాల ద్వారా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు కదా! అయితే ఈ విధానం వల్ల ఒక పరిమితి ఉంది, ఒకవేళ మీ సమాధానాన్ని నేను అర్థం చేసుకోగల బేసిక్ నాలెడ్జ్ కూడా నాకు లేదనుకోండి.. మీరు అంత కష్టపడి ఇచ్చిన సమాధానం వృధానే అవుతుంది కదా! ఇలాంటి కొన్ని పరిమితులను దృష్టిలో ఉంచుకుని మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టాలన్నది నా ఆలోచన.
కొత్తగా మనం చేయగలిగింది:
ఇప్పుడు RAdmin, Remote Desktop, Team Viewer వంటి అనేక రకాల రిమోట్ డెస్క్ టాప్ మోనిటరింగ్, అడ్మినిస్ట్రేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో మనం ఇతరుల కంప్యూటర్లోకి ప్రవేశించి వారి సందేహాలను తీర్చవచ్చు. ఉదా.కు... నాకు C లాంగ్వేజ్ లో ఒక ఫంక్షన్ ఎలా రాయాలో తెలియడం లేదనుకోండి. 'Dilse' అనే పాఠకుడికి దానిపై అవగాహన ఉంది అనుకుంటే.. అతను ఇలాంటి సాఫ్ట్ వేర్ల సాయంతో నా కంప్యూటర్లోకి ప్రవేశించి ఇక్కడ నేను నా కంప్యూటర్ పై చూస్తుండగానే ఫంక్షన్ రాసి చూపించవచ్చు. అలాగే మౌర్య అనే పాఠకుడికి కంప్యూటర్లో తెలుగు టైప్ చేయడం ఎలాగో తెలియదనుకోంఢి... అప్పుడు నేనో, ప్రసాద్ గారో, వర్మ దాట్ల గారో మౌర్య కంప్యూటర్ లోకి ప్రవేశించి అతని సిస్టమ్ లో తెలుగు టైప్ చేసుకోగలిగేలా కాన్ఫిగర్ చేసి పెడతాం. అంటే మనం పాఠకులం అందరం ఒకరు తిరుపతిలో ఉన్నా, ఒకరు నిజామాబాద్ లో, మరొకరు గుంటూరులో, వేరొకరు వైజాగ్ లో, ఒకరు హైదరాబాద్ లో ఉండి కూడా ఎక్కడ ఉన్న వారి సందేహాలనైనా నేరుగా వారి కంప్యూటర్లోకి ప్రవేశించి పరిష్కరించవచ్చు. దీనికిగాను పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అవసరం లేదు. ఎంత సులభంగా ఈ పనిని నిర్వర్తించవచ్చో నేను తర్వాత వివరిస్తాను. గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టుని దృష్టిలో ఉంచుకుని రకరకాల రిమోట్ మోనిటరింగ్ టూల్స్ పనితీరుని పరీక్షిస్తూ వస్తున్నాను. అన్నింటి కంటే ఉచితంగా లభించే Team Viewer అనే సాఫ్ట్ వేర్ చాలా బాగా పనిచేస్తోంది. సో.. మనమందరం కేవలం 1MB సైజ్ మాత్రమే గల ఆ సాఫ్ట్ వేర్ ని మన కంప్యూటర్లో ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
మీరు చేయగలరా?
ఎలాంటి ప్రతిఫలం లేకుండానే చిన్న చిరునవ్వు కూడా నవ్వనంతగా మనం బిగదీసుకుపోతున్న నేటి రోజుల్లో ఒక్క పైసా ఆశించకుండా ఇతరులకు సేవ చేయాలన్న ఆలోచన చాలామందికి "ఎందుకు టైమ్ వేస్ట్, ఆ కష్టపడేదేదో మన కోసం మనం కష్టపడితే ఓ నాలుగు రాళ్లయినా వెనుకేయవచ్చు" అనిపించడం ఖాయం. అయితే నిజంగా ఒకటి ఆలోచించండి మనం పోతూ పోతూ ఇవ్వాళ చెమటోడ్చి సంపాదించే డబ్బు మూటలను మనతోపాటు కట్టుకుపోలేం. అదే ఓ పదిమందికి సాయపడితే "ఫలానా మనిషి దేవుడు లాంటి వాడు" అని వారి జీవితాంతం ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. మనం పోయినా మిగిలి ఉండేది మనం చేసిన సేవే. అలాగే మనం పంచిన నాలెడ్జ్ తో ఎందరో జీవితంలో స్ధిరపడవచ్చు. అంటే మన ఒక్కళ్ల జీవితం ఎంతోమందికి నిండు జీవితం, స్థిరత్వం ప్రసాదిస్తోందన్నమాట. అంతకన్నా కావలసిన తృప్తి ఏముంటుంది? ఇదీ నా ఆలోచనావిధానం. అలాగని ఎవరినీ నేను స్వంత పనులు మానేసుకుని సమాజసేవ చేయమని కోరడం లేదు. మీకు తెలిసిన నాలెడ్జ్ ని రోజుకి ఓ గంటో, రెండు గంటలో ఇతరుల సందేహాలు తీర్చడానికి వెచ్చించండి చాలు. ఏ ఛాటింగ్ లోనో వేస్ట్ చేసే టైమ్ ని ఇలా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది కదా! ఒక్కటి మాత్రం నిజం.. ఇలా నలుగురికీ సాయపడడంలో లభించే తృప్తి కోట్లు సంపాదించినా రాదని నేను స్వతహాగా ఎక్స్ పీరియెన్స్ చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీకూ ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని ఉంటే మీరూ ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవండి. ఒకవేళ "మా వల్లేం అవుతుంది, మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఏదో 15 రూపాయలు పెట్టి కంప్యూటర్ ఎరా చదువుతున్నాం కదా అని శ్రీధర్ గారు మనల్ని ఎలా ఇరికిస్తున్నారో చూడండి" అని ఫీల్ అయితే మీ ఇష్టం. మీరు సేవ చేయాలని ఎలాంటి బలవంతం లేదు. నేను నా స్వంత పనులను మీరు చేయమని కోరడం లేదు. మీకు ఇష్టమైతే చేయవచ్చు, ఇష్టం లేకపోతే వదిలివేయవచ్చు. నా లక్ష్యం ఒక్కటే మనందరం కలిసి ఇలాంటి వినూత్నమైన ప్రాజెక్ట్ ద్వారా యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలవాలన్నది. ఇవ్వాళ ఓ నలుగురే ముందుకు రావచ్చు, కొన్నాళ్లకు ఓ పదిమందవుతారు, మరికొన్నాళ్లకు వంద, వేయి.. ఇలా పెరుగుతారు. ఒకరికొకరు ఎలాంటి డబ్బూ ఆశించకుండా ఇలా సాయం చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది చాలా గొప్ప సమాజ సేవ అవుతుంది. సో.. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, మధ్యలోనే చేతులు ఎత్తేయమని, ఈ ప్రాజెక్టుకి వీలైనంత వరకూ జీవితాంతం కట్టుబడి ఉంటామనుకుంటే మీరూ ఇందులో భాగస్వాములు కావచ్చు.
మీ వివరాలు అందించండి:
ఇతరులకు సేవ చేయాలన్న ఆసక్తి ఉన్నవారు ఇదే పోస్ట్ లో మీ వివరాలు తెలియజేయండి. అవేంటంటే:
మీ పేరు, మెయిల్ అడ్రస్, మీకు ఏయే రంగాలపై మంచి నాలెడ్జ్ ఉంది, మీరు ఏయే సమయాల్లో ఇతరుల కోసం టైమ్ కేటాయించగలుగుతారు (ఉదా.కు.. సాయంత్రం 6-7 గంటల వరకూ). ఇబ్బంది లేదనుకుంటే మీ ఫోన్ నెంబర్. మీరు ఏం చేయాలంటే, మీరు ఏ టైమ్ మీకు వీలు అవుతుందని చెప్పారో ఆ సమయంలో తప్పనిసరిగా యాహూ మెసెంబర్/Gtalk వంటి వాటిలో ఛాటింగ్ లో అందుబాటులో ఉండాలి, లేదా మీ ఫోన్ ని ఆ టైమ్ లో ఆన్ చేసి ఉంచాలి. మెసెంజర్ లేదా ఫోన్ ద్వారా సాయం కావలసిన వాళ్లు మీకు రిక్వెస్ట్ పంపిస్తారు. అప్పుడు మీరు Team Viewer సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసి.. అవతలి వ్యక్తి తెలియజేసిన అతని యూజర్ ID, పాస్ వర్డ్ ల సాయంతో అతని కంప్యూటర్ లోకి ప్రవేశించి, అతని సందేహాన్ని క్లారిఫై చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో మీరు బిజీగా ఉంటే మరో టైమ్ లో మీ ఇద్దరూ కలిసి సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఎలాంటి కండిషన్స్ లేవు, కావలసిందల్లా సాయపడే స్వభావమే!
ఎక్కడి నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి?
ఈ క్రింది వెబ్ అడ్రస్ నుండి Team Viewerని డౌన్ లోడ్ చేసుకోండి.
http://www.teamviewer.com/download/TeamViewer_Setup.exe
డౌన్ లోడ్ చేశాక ఇన్ స్టాల్ చేసేటప్పుడు క్రింది చిత్రంలోని విధంగా Install Team Viewer అనే ఆప్షన్ టిక్ చేసి ఇన్ స్టాల్ చేయండి:

ఆ తర్వాత క్రింది విధంగా బాక్స్ వస్తుంది:

అందులో Start TeamViewer automatically with windows అనే ఆప్షన్ ని టిక్ చేయకండి. క్రింద పాస్ వర్డ్ అనే ప్రదేశం వద్ద మీ పేరుని పాస్ వర్డ్గ్ గా ఇవ్వండి. ఈ పాస్ వర్డ్ గుర్తు ఉంచుకోండి. ఆ తర్వాత Next, Next కొట్టి ఇన్ స్టలేషన్ పూర్తి చేయండి. మీ కంప్యూటర్లో ఫైర్ వాల్ ఉంటే Team Viewer ని నెట్ యాక్సెస్ చేయడానికి అనుమతించమంటారా అని అడుగుతుంది. Allow/Accept చేయండి. చివరిగా క్రింది చిత్రంలో విధంగా విండో వస్తుంది.

అందులో ID అనే బాక్స్ లో మిమ్మల్ని హెల్ప్ అడిగిన వ్యక్తి యొక్క కంప్యూటర్ ID టైప్ చేసి, Connect to Partner అనే బటన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు పాస్ వర్డ్ అడుగుతుంది. అతను మీకు తెలియజేసిన పాస్ వర్డ్ టైప్ చేస్తే సరిపోతుంది.
ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా సందేహాలుంటే అడగగలరు. అలాగే నిజంగా ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ వివరాలు ఇక్కడ తెలియజేసి ఇందులో భాగస్వాములు అవండి, గొప్ప నాలెడ్జబుల్ సొసైటీ ని నిర్మిద్దాం.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా