స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
హాజరైన సభ్యులు:
1. శ్రీనివాస్ (mr.Srinu ఐడితో వస్తుంటారు), మన సైట్ నిర్వహణలో ముఖ్య పాత్రధారి.
2. రుచిర శ్రీనివాస్ (ఛాదర్ ఘాట్)
3. వి. రంజన్
4. బి. పట్టాభిరాం
5. ఎస్. జాహ్నవి
6. ఎన్. విక్రమ్
7. ఎం. భాస్కర్
8. అనిల్ (వరంగల్ నుండి ఈ సమావేశం కోసమై వచ్చారు)
9. శ్రీధర్ పతి (గద్వాల నుండి హాజరయ్యారు)
10. నల్లమోతు శ్రీధర్
కిషోర్ నువ్వుశెట్టి గారు, మొగిలిచర్ల మురళీధర్ గారు.. మరికొంత మంది పనుల వత్తిడి వల్ల హాజరుకాలేకపోతున్నామని సమాచారం అందించారు.
సరిగ్గా సమావేశ సమయానికి కొద్దిపాటి చినుకులు ప్రారంభమవడంతో ఎప్పటిలా ఓపెన్ ప్లేస్ లో కూర్చోవడానికి సాహసించక చక్కని గూడుని ఎంచుకుని ఆశీనులమయ్యాం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఈ సమావేశానికి నలుగురైదుగురికి మించి హాజరు కారన్న భావనతో వెళ్లినా ఒకరొకరిగా వస్తూ పదిమంది వరకూ పోగయ్యాం. చాలా తక్కువమంది హాజరు అవుతారని ముందే అన్పించడం వల్ల పూర్వపు మీటింగులలా ప్రత్యేకమైన అజెండా అంటూ పాయింట్ వైజ్ గా డ్రాఫ్ట్ చేసుకోకుండానే ఈ సమావేశానికి వెళ్లడం జరిగింది. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత సభ్యుల నుండి లభించిన ప్రోత్సాహం, పార్టిసిపేషన్, చక్కని సలహాలు చూసిన తర్వాత.. సభ్యుల రాశి తక్కువైనా వాసి తక్కువ లేదన్పించింది. చాలా ప్రొడక్టివ్ సలహాలు, సూచనలు వచ్చాయి.
ఎడమ నుండి కుడికి.. రుచిర శ్రీనివాస్, విక్రమ్, శ్రీధర్ (గద్వాల), భాస్కర్, నల్లమోతు శ్రీధర్, గోరంట్ల శ్రీనివాస్, పట్టాభిరాం బొప్పన, అనిల్
ప్రధానంగా ఐ.టి. నాలెడ్జ్ ని రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజెయ్యడానికి మనం చేస్తున్న కార్యకలాపాల గురించి వివరంగా అన్ని ముఖ్యమైన లింకులతో సహా ఓ సమగ్రమైన అవగాహన కల్పించే డాక్యుమెంట్ ని రూపొందించి దానిని ఫోరంలో ఒక చోట అందరికీ అందుబాటులో ఉంచడం మంచిది అనే సూచన శ్రీనివాస్ అనే సభ్యుడి నుండి వచ్చింది. తద్వారా కొత్త వ్యక్తులకు మన సేవలను పరిచయం చెయ్యడానికి ఆ డాక్యుమెంట్ ఒక్కసారి చదివించగలిగితే బెటర్ అనే చక్కని అభిప్రాయం కుదిరింది. కాలేజీ లైబ్రరీల వారు డిజిట్, చిప్ వంటి పుస్తకాలకు వందలాది రూపాయలు వెచ్చిస్తూ ఉంటారని ఒక్కసారి మన కంప్యూటర్ ఎరాని పరిచయం చేస్తే అంత కంటెంట్ ఉన్న పత్రికను వారు వదిలిపెట్టరని ఆ దిశగా ప్రయత్నాలు సాగించమని జాహ్నవి గారు, జి. శ్రీనివాస్ అనే సభ్యుల నుండి సూచనలు వచ్చాయి. దానికి గాను మన కంప్యూటర్ ఎరా యాజమాన్యం నుండి సానుకూల స్పందన కోసం ప్రయత్నిస్తాను.
ఎవరికి తెలిసిన నాలెడ్జ్ ని అది చిన్నవిషయమైనా, పెద్ద విషయమైనా ఫోరంలో ఓ ఐదు నిముషాలు వీలుచేసుకుని పోస్ట్ చేయమని హాజరైన సభ్యులందరికీ విన్నవించడం జరిగింది. అలాగే ఇంగ్లీషులో కూడా ఫోరం ప్రారంభించవచ్చు కదా అనే సూచనను రాజన్ గారు చేశారు. రెండు వేర్వేరు టెక్నికల్ ఫోరంలను రెండు భాషల్లో విభిన్నంగా నిర్వహించగలగడానికి ప్రధానంగా కమిటెడ్ సభ్యుల సహకారం చాలా అవసరం. మన టీమ్ మరింత విస్తరించిన తర్వాత కొంతమంది ఆంగ్ల ఫోరం బాధ్యతని చేపట్టడానికి అవకాశం ఉంటుందని నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే రుచిర శ్రీనివాస్ గారు ఫోరంలో కొత్త ఉత్పత్తులకై ఒక విభాగాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. వివిధ ఉత్పత్తులు, వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్ల గురించి ఆయన అనర్గళంగా మాట్లాడడం, ఎక్కడెక్కడో డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు వద్దకు ప్రత్యేకంగా వెళ్లి బ్రోచర్లు కలెక్ట్ చేసుకురావడం అనేది ఆయన హాబీ. ఆయనతో మాట్లాడుతుంటే కంప్యూటర్ ఉత్పత్తుల పట్ల ఆయనకు గల నాలెడ్జ్ చాలామందికి ఉపయోగపడుతుంది అన్పిస్తోంది. అందుకే కొత్త ఉత్పత్తుల గురించి పోరంలో కొత్త విభాగాన్ని సృష్టించడానికి నిర్ణయించడం జరిగింది.
ఈ సమావేశంలో అనూహ్యంగా చాలా ఏక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన సభ్యుల్లో జాహ్నవి గారు ఒకరు. తను ఇంజనీరింగ్ విద్యార్థిని కావడం వల్ల.. కాలేజీల్లో కంప్యూటర్ విద్యాబోధన ఎంత థీరిటికల్ గా సాగుతుందో అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చారు. కాలేజీల్లో లెక్చరర్లు Control Panel ఓపెన్ చేస్తే కంప్యూటర్ పాడవుతుంది అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారని, అసలు ఇంటర్నెట్ కి కనెక్ట్ అయితే క్షణాల్లో వైరస్ వచ్చేస్తుందని భయపెట్టేస్తారని.. తాను, తన స్నేహితులు చదువుతున్న చాలా కాలేజీల్లో ఇదే తరహా వాతావరణం నెలకొని ఉందని.. ఈ నేపధ్యంలో ముందు స్టూడెంట్లలో సెమినార్ల ద్వారా అలాంటి భయాలను పారద్రోలవలసిన అవసరం ఉందని, లేదంటే ఐ.టి. ఫీల్డ్ లో మొక్కుబడి ఉద్యోగాలు చేసే బంట్రోతులుగానే మిగిలిపోతారు తప్ప ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదని అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. కేవలం సిలబస్ కే అధిక ప్రాధాన్యం ఇచ్చి ఐ.టి. ఆధారిత అవేర్ నెస్ ని అసలు పట్టించుకోని వైఖరి ఉన్న విద్యాసంస్థలు ఈ తరహా సెమినార్లకు ఎంతవరకూ సానుకూలంగా ఉంటాయన్నది ఆలోచించాలి, అలాగే మన ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. గద్వాల నుండి శ్రీధర్ గారు ఆ పట్టణంలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, డిటిపి సెంటర్, వెబ్ హోస్టింగ్ వంటి అన్ని రకాల సేవలను అందిస్తున్నారు. ఆయన ఈ విషయమై స్పందిస్తూ కాలేజీలలో సెమినార్లు ప్రయత్నించడం, అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కంప్యూటర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ లు మనకు బాగా సహకారం అందిస్తాయి కాబట్టి అక్కడికి వచ్చే విద్యార్థులకు అవేర్ నెస్ కల్పిస్తే మరింత బాగుంటుందని సూచించడం జరిగింది. ఒకవేళ కళాశాలల నుండి సరైన ప్రోత్సాహం లభించకపోతే ఈ ప్రత్యామ్నాయ మార్గంలోనైనా మన పని మనం చేసుకుంటూ వెళ్లవచ్చు. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాగానే మొదటి కొద్దిరోజుల పాటు విద్యార్థులపై ఎలాంటి వత్తిడి లేకుండా ఖాళీగా ఉంటారని దానిని దృష్టిలో ఉంచుకుని ఆలోపు కాలేజీ యాజమాన్యాలతో చర్చించి సెమినార్లకు అనువైన సమయం నిర్ణయించుకుంటే బాగుంటుంది అని జాహ్నవి గారు సూచించారు. ఇక్కడ ఒక ఇబ్బంది నన్ను చాలారోజులుగా వేధిస్తోంది. ఒక కళాశాలలో సెమినార్ ఇచ్చేటప్పుడు కేవలం ఫీల్డ్ నాలెడ్జ్ లేని నేనొక్కడినే పార్టిసిపేట్ చెయ్యడం కన్నా వివిధ రంగాల్లో అనుభవం ఉండీ, ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న మిత్రులు పెద్ద మనసు చేసుకుని ఇలాంటి కార్యక్రమాల పట్ల ముందుకు వస్తే చాలామందికి అవేర్ నెస్ కల్పించినట్లు అవుతుంది, స్టూడెంట్ కి కావలసిన ప్రాపర్ గైడెన్స్ కూడా లభిస్తుంది. వివిధ ఐ.టి. కంపెనీల్లో వర్క్ చేస్తున్న అనుభవజ్ఞులు దయచేసి ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.
ఇకపోతే ఈ కార్యకలాపాల నిర్వహణకు గాను ఆర్థిక పరమైన తోడ్పాటు ఏ విధంగా లభించినా బాగుణ్ణు అన్న ఆలోచన ఒకటి ప్రస్తావనకు వచ్చింది. దానికిగాను google adsense వంటి వాటితోపాటు స్థానికంగా ఉండే సంస్థల నుండి నామినల్ టారిఫ్ తో చిన్న చిన్న ప్రకటనలు సేకరించి ఫోరంలో, ఛాట్ లో ప్రచురిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వచ్చింది. ఆచరణలో సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి.
గత మీటింగులతో పోలిస్తే సరిగ్గా రెండు గంటల పాటు జరిగి త్వరగా ముగింపుకు వచ్చిన మీటింగ్ ఇది. ఆ రెండు గంటల వ్యవధిలోనూ చాలా మంచి సూచనలు వచ్చాయి. ఎవరివద్దా కెమెరా లేకపోవడంతో పట్టాభిరాం గారు అప్పటికప్పుడు వాళ్లబ్బాయికి ఫోన్ చేసి ఇంటి నుండి కెమెరా తెప్పించి ఫొటోలు తీయించడం విశేషం. అదీగాక గత మీటింగ్ నుండి ఆయన కృష్ణకాంత్ పార్క్ లో టికెట్ తీసుకునే ఎంట్రెన్స్ గేట్ వద్ద మీటింగ్ ఎక్కడ జరుగుతుందో కన్ ఫ్యూజ్ అయ్యే కొత్తవారిని గైడ్ చేసేలా బానర్ ఏర్పాటు చెయ్యడం వంటి అనేక విషయాల్లో సహకారం అందిస్తున్నారు. ఆయనకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చిన శ్రీధర్ (గద్వాల) గారికి, అనిల్ (వరంగల్) గారికి, సామాజిక వేత్త విక్రమ్ గారికి, విలువైన సూచనలు చేసిన జాహ్నవి గారికి, భాస్కర్, రాజన్, రుచిర శ్రీనివాస్, జి. శ్రీనివాస్ గార్లకు ధన్యవాదాలు.
కొసమెరుపు: మీటింగ్ జరిగిన రాత్రి 12 దాటకముందే రిపోర్ట్ రాయటమన్నది నేను అనుసరించే పద్ధతి. కానీ రాత్రి మీటింగ్ నుండి ఇంకా ఇంటికి చేరకముందే మన సర్వర్ డౌన్ అయినట్లు మెసేజ్ వస్తోందని మిత్రులు ఫోన్ చేయడం, అప్పటికప్పుడు సర్వర్ అప్ అయ్యేలా హోస్టింగ్ వాళ్లతో కమ్యూనికేట్ చేయడం, వారి సూచనలు అమలుపరచడానికి రాత్రి 2.30 గంటల వరకూ తెలియని వెబ్ టెక్నికల్ పారామీటర్ల గురించి మల్లగుల్లాలు పడడం వల్ల ఇంత ఆలస్యంగా రిపోర్ట్ రాయవలసి వచ్చింది.
తదుపరి హైదరాబాద్ పాఠకుల సమావేశం: ఏప్రిల్ 27, ఆదివారం, 2008న కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ వద్ద, మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది.
అలాగే ఏప్రిల్ 6వ తేదీన విజయవాడలో కంప్యూటర్ ఎరా పాఠకులు, తెలుగు బ్లాగర్ల సంయుక్త సమావేశం జరుగుతుంది. వివరాలకు: 9866369288 నెంబర్ లో సంప్రదించగలరు.
గణాంకాలు: మనం అందరం టీమ్ వర్క్ గా నిర్వహిస్తున్న ఫోరం, ఛాట్ రూమ్ లు జనవరి 5, 2008న ప్రారంభమైన రోజున Alexa ర్యాంకింగ్ లో 70 లక్షలకు పైబడి ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సైట్ Alexa ర్యాంక్ మూడు నెలల కాలంలో 5,75,645కి చేరింది. అలాగే భారతీయ సైట్లలో 9,234 ర్యాకింగ్ తో మొదటి 10వేల సైట్ల సరసన చేరింది. అలాగే మూడు నెలల కాలంలో ఫోరంలో 1819 మంది సభ్యులు చేరారు, 1017 టాపిక్ లు, 1766 పోస్టులు చేయబడ్డాయి. అధికశాతం తెలుగులోనూ, ఆకర్షణీయంగా స్ర్కీన్ షాట్లతోనూ రూపొందించబడిన పోస్టులే! అలాగే సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ద్వారా ఇంతవరకూ 650కి పైగా జెన్యూన్ సొల్యూషన్లు అందించబడ్డాయి. సరైన నిపుణులు సమయానికి అందుబాటులో లేక అపరిష్కృతంగా ఛాట్ లో జరిగిన సంభాషణలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఐ.టి. నాలెడ్జ్ ఉన్న మిత్రులకు విన్నవించుకునేది ఒక్కటే దయచేసి కొద్ది సమయమైనా ఈ వేదికపై స్పెండ్ చేయండి. మీ నాలెడ్జ్ ఎంతోమందికి ఆసరాగా నిలుస్తుంది. గద్వాల నుండి వచ్చిన శ్రీధర్ గారు అంతదూరం నుండి రావడానికి ఒకటే కారణం చెప్పారు.. ఒకరోజు నైట్ వాళ్ల బ్రదర్ కి ఏదో టెక్నికల్ ప్రాబ్లెం ఉంటే మన ఛాట్ రూమ్ లో ఎవరో అప్పటికప్పుడు అతని సిస్టమ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించారట.. అంత జెన్యూన్ సర్వీస్ కి చాలా హాపీ ఫీల్ అయి ఎలాగైనా మన టీమ్ సభ్యులను కలవాలని ఈ ప్రాజెక్ట్ లో మేమూ భాగస్వాములం అవాలని అక్కడి నుండి వచ్చాం అని చెప్పారు. మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చిత్తశుద్దిగా ఎంతో కొంత సమయం చేసుకుంటూ వెళితే ఇలా ఎంతోమంది తామూ ఇందులో భాగస్వాములవుతారు. సో.. ఇది మనకు సంబంధించిన వ్యవహారం కాదు అని దులిపివేసుకుని వెళ్లకుండా దయచేసి హృదయమున్న మిత్రులందరూ తమవంతు సహకారం ఈ ప్రాజెక్ట్ విషయంలో అందిస్తారని ఆశిస్తున్నాం.
- నల్లమోతు శ్రీధర్
31-3-2008, 12.09 AM.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి