4, డిసెంబర్ 2007, మంగళవారం

ఉచిత వెబ్‍సైట్ నిర్వహించుకోదలుచుకుంటే...


ఇటీవలి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ వివరాలు, ఫోటోలు, వీడియోలు తదితర సమాచారంతో ఇంటర్నెట్‌పై వెబ్‌సైట్లు సృష్టించుకుంటున్నారు. అనేక వెబ్ హోస్టింగ్ సర్వీసులు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇదే కోవలో ఈ మధ్య 12GB భారీ కెపాసిటీని అందిస్తూ వెబ్‌హోస్టింగ్ సర్వీసును అందించే ww.12gbfree.com అనే వెబ్‌సైట్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. సహజంగా ఉచితంగా వెబ్‌హోస్టింగ్ సేవలను అందించే అనేక ఇతర సర్వీసులు రకరకాల అడ్వర్‌టైజ్‌మెంట్లను (ఒక్కోసారి అశ్లీలమైనవి కూడా) మన వెబ్‌సైట్లలో చూపిస్తుంటాయి. వాటిని భిన్నంగా ఈ వెబ్‌సైట్ బలవంతపు అడ్వర్‌టైజ్‌మెంట్లు వేటినీ చూపించదు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి, స్వంత వెబ్‌సైట్లని రూపొందించుకోవాలని కోరిక ఉన్న వ్యక్తులకు ఈ వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ 25GB వరకూ నెలసరి డేటా ట్రాన్స్‌ఫర్‌ని కల్పిస్తోంది. కాబట్టి పెద్ద పెద్ద వీడియోలు, సాఫ్ట్‌వేర్లు పొందుపరుచుకుంటే తప్ప కేవలం చిన్నపాటి అవసరాలకు వెబ్‌సైట్‌ని నిర్వహించుకునే వారికి ఇది భేషుగ్గా సరిపోతుంది. FTP సపోర్ట్ లభిస్తోంది. మీ సైట్‌ని ఏరోజు ఎంతమంది విజిట్ చేశారన్న వివరాలు అందించబడతాయి. మీ సైట్‌కి అనుబంధంగా బ్లాగులు, ఫోరమ్‌లు ప్రారంభించుకోనూ వచ్చు!

3, డిసెంబర్ 2007, సోమవారం

ఈ ఫైళ్లు ఎందుకూ పనికిరావు...


తక్కువ ధరలకే భారీ స్టోరేజ్ సామర్థ్యం గల హార్డ్ డిస్కులు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో గతంలో హార్డ్ డిస్కు నుండి అనవసరమైన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించుకునే వారు కూడా "చాలా స్పేస్ ఉంది కదా" అని బద్ధకిస్తున్నారు. డిస్క్ స్టోరేజ్ సామర్ధ్యం ఎంత భారీగా ఉన్నా అందులో సమాచారం ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి ఉంటే ఖచ్చితంగా కంప్యూటర్ పనితీరు మందగిస్తుంది. కాబట్టి వీలైనప్పుడలా విండోస్ లోని టెంపరరీ ఫోల్డర్, Cookies, History, Temporary Internet Files ఫోల్డర్లలోని ఫైళ్లని డిలీట్ చేసుకోవడం మంచిది. అలాగే Start>Find/Search ఆప్షన్ ద్వారా హార్డ్ డిస్కులో *.tmp, *.~mp, *.gid, *.fts, *.chk, *.00*, *.$$$, *.*$, *.syd, *.old, *.bak వంటి ఎక్స్ టెన్షన్ నేమ్ లను కలిగి ఉన్న ఫైళ్లన్నింటినీ తొలగించుకోండి. వాటన్నింటినీ డిలీట్ చేసిన తర్వాత ఒకసారి డిస్క్ డీఫ్రాగ్ మెంటేషన్ ప్రోగ్రామ్ ని రన్ చేయడం మంచిది. ఒకవేళ ఏవైనా ఫైళ్లని డిలీట్ చేస్తే ప్రాబ్లెమ్ వస్తుందేమోనని సందేహం వచ్చినట్లయితే వాటిని వేరే లొకేషన్ కి మూవ్ చేసి కొన్నాళ్లపాటు అబ్జర్వేషన్ లో పెట్టి వాటిని మూవ్ చేయడం వల్ల ఎలాంటి సమస్య రాకపోయినట్లయితే వాటిని తొలగించవచ్చు. విండోస్ లోని Disk Cleanupని రన్ చేయడం ద్వారా కూడా అధికశాతం వృధా ఫైళ్లని తొలగించుకోవచ్చు.

వీడియో మెమరీ గురించి తెలుసా?


మన సిస్టమ్ లోని డిస్ ప్లే కార్డ్ స్వయంగా లేదా మెయిన్ RAM నుండి షేర్ చేసుకునే మెమరీ పరిమాణాన్ని బట్టి మన పిసిలోని గ్రాఫిక్స్ పనితీరు నాణ్యత, వేగం ఆధారపడి ఉంటాయి. డిస్ ప్లే కార్డులపై పొందుపరచబడి ఉండే మెమరీని 'ఫ్రేమ్ బఫర్' అని కూడా పిలుస్తుంటారు. వీడియో మెమరీ అవసరం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం. మనకు మోనిటర్ పై కన్పించే ప్రతీ అంశాన్నీ స్టోర్ చేసుకోగల కెపాసిటీ వీడియో మెమరీకి ఉండాలి. ఒక ఫొటోని మార్చిన వెంటనే లేదా ఒక సాఫ్ట్ వేర్ ని ఓపెన్ చేసిన వెంటనే అప్పటి వరకూ స్క్రీన్ పై ఉన్న దృశ్యం మారిపోతుంది. ఇలా మారిపోయిన దృశ్యాన్ని మన పిసిలోని సిపియు వీడియో కార్డ్ కి చేరవేస్తుంది. వీడియో కార్డ్ పై ఉండే 'వీడియో ప్రాసెసర్' దాన్ని ప్రాసెస్ చేసి టెంపరరీగా ఫ్రేమ్ బఫర్ లో భద్రపరస్తుంది. ఇలా వీడియో ఫ్రేమ్ బఫర్లో నిల్వ చేయబడి ఉండే ఇమేజ్ లను భారీ బిట్ మ్యాప్ ఇమేజ్ లుగా ఊహించుకోవచ్చు. ఇలా నిరంతరం మనకు మోనిటర్ పై ప్రదర్శించబడవలసిన స్క్రీన్ ఇమేజ్ రిఫ్రెష్ చేయబడుతూ సరికొత్త ఫ్రేమ్ లు ఫ్రేమ్ బఫర్ లోకి వచ్చి చేరుతుంటాయి. ఈ నేపధ్యంలో వీడియో రామ్ గా పిలవబడే ఫ్రేమ్ బఫర్ తక్కువగా ఉంటే అది ఎక్కువ ఇమేజ్ లను స్టోర్ చేసుకోలేక స్క్రీన్ పై అంశాలన్నీ స్లో మోషన్ లో కదులుతూ మనకు అసౌకర్యాన్ని కలుగజేస్తుంటాయి. ఇప్పుడు వస్తున్న మదర్ బోర్డ్ లలో ఆన్ బోర్డ్ డిస్ ప్లే చిప్ లు సైతం మెయిన్ మెమరీ నుండి ఎక్కువ మొత్తంలో స్థలాన్ని వినియోగించుకుంటుండడం వల్ల ఈ తరహా ఇబ్బందులు పెద్దగా తలెత్తడం లేదు.