4, డిసెంబర్ 2007, మంగళవారం
ట్రోజాన్‍లతో చాలా జాగ్రత్త...
ఒకప్పుడు వైరస్‌ల పేరు వింటే హడలిపోయేవారు. ఇప్పుడు Trojan Horses అందరిని అదరగొడుతున్నాయి. మనకు ఎదో మేలు చేస్తుందన్న భావనను కల్పించి మనకు మనం స్వయంగా డౌన్‌లోడ్ చేసుకునేటట్లు ప్రేరేపించి తీరా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణను దానిని పంపించిన యూజర్‌కి అందించేదే TrojanHorse. మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉన్న ప్రోగ్రామర్లు మాత్రమే ఇలాంటి వాటిని రూపొందించగలుగుతారన్న తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది. ట్రోజాన్లని రూపొందించడానికి ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులోకి రావడం వల్ల ఎవరుబడితే వారు వాటిని రూపొందించి ఇతరుల సిస్టమ్‌లలోకి పంపించగలుగుతున్నారు.
సహజంగా కొన్ని ప్రత్యేకమైన ట్రోజాన్ తయారీ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి Server.exe పేరిట ఓ ఫైల్‌ని క్రియేట్ చేస్తారు. సహజంగా ఇది 90, 120KBల వంటి చాలా తక్కువ సైజ్‌లో ఉంటుంది. దీనిని ఏదైనా అశ్లీల ఫోటోకి Binder పేరిట లభించే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సాయంతో జతచేస్తారు. ఇక యాహూ చాట్‌రూమ్‌లు వంటి వాటిలోకి ఆడవారి మెయిల్ ఐడిలతో లాగిన్ అయి తమకు PMలు పంపించే మగవారిని మెల్లగా మాటల్లో పెట్టేసి "నా ఫోటో చూస్తారా" అంటూ ఆరా తీసి అవతలి వ్యక్తి ఆసక్తి చూపించగానే ఇంతకుముందు అశ్లీలచిత్రంలో దాచిపెట్టిన ట్రోజాన్ ప్రోగ్రామ్‌ని అవతలి వ్యక్తికి పంపిస్తారు. అవతలి వ్యక్తి దానిని ఓపెన్ చేయగానే ఫోటో కనిపిస్తుంది కాని బ్యాక్‌గ్రౌండ్‌లో తన సిస్టమ్‌లోకి ట్రోజాన్ ప్రవేశించిందన్న విషయం అతనికి తెలియదు. ఇక అంతే. అప్పటినుండి ఆ వ్యక్తి యొక్క IP అడ్రస్ ట్రోజాన్ పంపించిన వ్యక్తికి చేరవేయబడుతుంటుంది. ఆ అడ్రస్ ఆధారంగా అవతలి వ్యక్తి యొక్క కంప్యూటర్‌ని కంట్రోల్ చేస్తుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి