"కంప్యూటర్ ఎరా" రెండవ సమావేశ నివేదిక
స్థలం: కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ గూడ బస్తీ దగ్గర, హైదరాబాద్
సమయం: మధ్యాహ్నం 3 గంటలు.
హాజరైన సభ్యులు:
1. జి.పి. జాకబ్
2. ఎన్. కృష్ణ కిషోర్
3. మున్నా కాల్పనిక్
4. డి. శశి భూషణ్
5. సి.హెచ్. శివరామ ప్రసాద్ (విజయవాడ)
6. జి. చైతన్య
7. సి.హెచ్. సత్యనారాయణ
8. కె. నాగభూషణం (వరంగల్)
9. పి. శ్రీనివాస్
10. పి. శ్రీకర్
11. నల్లమోతు శ్రీధర్
శ్రీనివాస్ (పర్చూరు), నవీన్ రెడ్డి చివరి నిముషంలో అర్జెంటు పని పడడం వల్ల రాలేకపోయారు. టి. రామచంద్రరావు గారు (కర్నూలు) ప్రయాణ సదుపాయం కారణంగా హాజరుకాలేకపోయారు. రవీంద్ర కాట్రగడ్డ, వినయ్ గార్లు కూడా అనుకోని కారణాల వల్ల రాలేకపోయారు. మౌర్య, అభిరామ్, మురళి తదితరులు దూరప్రాంతాల నుండి రావడం వీలుపడక హాజరు కాలేకపోయారు. జాకబ్ గారి మిత్రులు ఒకరు మీటింగ్ తుదిదశలో కలవగలిగారు.
అందరి పరిచయాలూ అయ్యాక పలు పలు అంశాలపై చర్చ జరిగింది. చాలా మంచి ఆలోచనలు వచ్చాయి. పాత ఫోరంలోని ముఖ్యమైన పోస్ట్ లను కొత్త ఫోరంకి తీసుకువచ్చి మార్చి నెలాఖరు నాటికి పాత ఫోరంని పూర్తిగా క్లోజ్ చేయాలన్నది ఆలోచన. దానికి గాను కొంతమంది ఉత్సాహవంతులు పాత ఫోరంలోని పోస్టులను కొత్త ఫోరంలోకి బదిలీ చేసే ప్రక్రియను బాధ్యతగా స్వీకరించాలన్న ప్రతిపాదనకు చైతన్య గారు, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ప్రసాద్ గారు, శ్రీనివాస్ కర, జ్యోతి గారు, జాకబ్, మౌర్య, వర్మ దాట్ల, నల్లమోతు శ్రీధర్ వంటి వారు ఇదే పనిలో కొంత ప్రోగ్రెస్ సాధించారు. చైతన్య, నాగభూషణం గార్లు కూడా దీనిపై దృష్టి కేంద్రీకరించడం వల్ల త్వరగా కంటెంట్ ని ట్రాన్స్ ఫర్ చేయగలుగుతాం.
ఇకపోతే కొత్త ఫోరమ్ ని ఇప్పుడే మొదలుపెట్టాం కాబట్టి దానిలో స్పామ్ పోస్టులు, ఇల్లీగల్ కంటెంట్ లేకుండా ఇప్పటినుండే జాగ్రత్తగా నిర్వహించుకోవడం ఎలా అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైతే అనధికారిక పోస్టులు చేస్తారో ఆ పోస్ట్ చేసిన వారికి PM, Email చేసి ఎడ్యుకేట్ చేయడంతోపాటు, పోస్ట్ లోని సమాచారాన్ని తీసేసి.. ఆ సమాచారం ఎందుకు తీసివేయబడిందో కారణం తెలిపితే బాగుంటుంది అనే సూచనలు వచ్చాయి. దయచేసి ఇకపై మోడరేటర్లందరూ ఈ విధంగా చేయగలరు.
మనం చేస్తున్న కార్యకలాపాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉపయోగపడేలా చేయడంతోపాటు వారినీ భాగస్వాములను చేయడం ఎలా అనే విషయమై స్కూల్, కాలేజీ యాజమాన్యాల సహకారంతో రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో సెమినార్లు నిర్వహిస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన ప్రసాద్ గారు చేశారు. దీనికి వెంటనే ప్రతిస్పందనగా చైతన్య సత్తుపల్లి (ఖమ్మం జిల్లా)లో తమ కాలేజీల్లో వీలైనంత త్వరలో సెమినార్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇతర పాఠకులు కూడా తమకు అవకాశం ఉంటే, మీకు పరిచయం ఉన్న స్కూల్, కాలేజీల యాజమాన్వాలతో మాట్లాడి ఐ.టి ట్రెండ్స్, ఐ.టి. రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎలా, ఐ.టి. రంగంలోకి ప్రవేశించేవారి మైండ్ సెట్ ఎలా ఉండాలి వంటి విషయాలపై సెమినార్ నిర్వహించడానికి ఏర్పాటు చేస్తే ఆయా విషయాలపై అవగాహన ఉన్నవారు హాజరై (వీవెన్, సుధాకర్, కిరణ్ కుమార్ చావా, వెంకటరమణ, దాట్ల శ్రీనివాసరాజు వంటి నిపుణులతోనూ ఈ విషయం ప్రస్తావిస్తాను) విద్యార్థులను గైడ్ చెయ్యడానికి వీలుపడుతుంది.
అలాగే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పాఠకుల సమాచారం ఒకచోట చేర్చడం తద్వారా ఆయా ఊళ్లలో ఉండే పాఠకులు అక్కడికక్కడే సమావేశాలు నిర్వహించుకుని, సాంకేతికపరమైన చర్చలు చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం విషయమై ప్రసాద్ గారు ఓ టేబుల్ ఫోరంలో క్రియేట్ చేసి ఎవరైనా అందులో తమ వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాటు చేద్దామన్నారు. త్వరలో ఆ పద్ధతి ప్రారంభించడం జరుగుతుంది. అలాగే పరిచయస్థులకు way2sms.com వంటి వెబ్ సైట్ల ద్వారా http://computerera.co.in/forum, http://computerera.co.in/chat సైట్ల గురించి పరిచయం చేయడం, Orkutలోని స్నేహితులకు స్ర్కాప్ లు పంపించడం, పాంప్లెట్లు ప్రచురించి విద్యాసంస్థల్లో పంపిణీ చేయడం వంటి చక్కని సూచనలు వచ్చాయి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకుని మీవంతు సహకారంగా ఈ మీటింగ్ కి హాజరు కాలేని పాఠకులు కూడా తమకు తెలిసిన స్నేహితులకు, పరిచయస్థులకు SMSలు (మంచి అనేక కొటేషన్లని SMSల రూపంలో ఫార్వార్డ్ చేస్తుంటాం. అవి జనాలను మోటివేట్ చేస్తాయో లేదో తెలియదు కానీ, కనీసం అందరికి సహాయపడడానికి రూపొందించబడిన పై వెబ్ సైట్ల గురించి ఒక్క మెసేజ్ మీకు తెలిసిన వారికి పంపించగలరు), Orkut Scraps రూపంలో పరిచయం చెయ్యగలరు.
అలాగే ఫోరంలోని సమాచారం ఎల్లప్పుడూ పదిలంగా ఉంటుంది. ఒక పోస్ట్ రాశామంటే అది ఎంతోమందికి అలా ఉపయోగపడుతూనే ఉంటుంది. అదే ఛాట్ రూమ్ లో ఒకరికి సందేహం తీర్చామంటే అది ఆ ఒక్కరికి, లేదా మరో ఇద్దరు ముగ్గురకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ నేపధ్యంలో తరచూ ఛాట్ రూమ్ లో తీర్చే సందేహాలను ఫోరంలో వివరంగా పోస్టులను రాయడం ద్వారా.. ఇకపై అవే సందేహాలు ఛాట్ రూమ్ లో మళ్లీ మళ్లీ అడగబడుతుంటే ఫోరంలోని సంబంధింత లింక్ ని ఇస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన వచ్చింది. అదే సమయంలో అలా తరచూ అడగబడే సందేహాలను ఫోరంలో ఓ థ్రెడ్ లో ప్రచురించి, ఛాట్ రూమ్ లోనే లింకుల వద్ద FAQల పేరిట ఆ థ్రెడ్ యొక్క లింక్ ఇస్తే మరీ బాగుంటుంది అని నిర్ణయించడం జరిగింది.
ఇకపోతే ఫోరంలో ఎవరైనా ఏదైనా సందేహం అడిగినప్పుడు దానికి ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల పరిష్కారం లభించినప్పుడు ఆ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ లో "Solved" అనే పదం చేర్చడం ద్వారా మరింత మంది ఆ పోస్టు ద్వారా ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచన జాకబ్ గారు వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలో సందేహాలు అడిగేవారు ఎవరైనా ఇచ్చిన సమాధానం వల్ల తమ సందేహం పరిష్కరించబడితే దయచేసి తమ పోస్ట్ సబ్జెక్ట్ లైన్ ని edit చేసి Solved అనే పదాన్ని చేర్చండి. అలాగే అనేక ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పిన వారికి పాయింట్లు ఇచ్చే పద్ధతిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అదీ మొదలుపెట్టాలి.
మాతృభాష విషయమై మనం చేసే పోస్టులలో వీలైతే పూర్తిగానూ, లేదా పాక్షికంగానూ లేదా కనీసం సబ్జెక్ట్ లైన్ వరకూ అయినా తెలుగులో టైప్ చేస్తే బాగుంటుంది అని ప్రతిపాదించడం జరిగింది. దయచేసి వీలైన వారందరూ దీనిని పాటించగలరు.
నిరంతరం ఫోరంని పరిశీలిస్తుండే మోడరేటర్లుగా వ్యవహరించడానికి చైతన్య, నాగభూషణం గారు ముందుకు వచ్చారు. అలాగే ఇక్కడ మరో విషయమూ చర్చలోకి వచ్చింది. ఫోరంలోని వేర్వేరు విభాగాలను వేర్వేరు వ్యక్తులు మోడరేట్ చేయాలన్నది. ఉదా.కు.. సాఫ్ట్ వేర్ డౌన్ లోడ్స్ అనే విభాగానికి ప్రసాద్ గారు మోడరేట్ చేస్తే పిసి చిట్కాలు అనే విభాగానికి చైతన్య, మరో విభాగానికి మౌర్య, అభిరామ్, శ్రీనివాస్ ఇలా బాధ్యతలు పంచుకుంటే పని సులువు అవుతుంది అన్న ప్రతిపాదన ప్రసాద్ గారు చేశారు. వీలైనంత త్వరలో ఆయా బాధ్యతల విభజన చేసుకుందాం. మోడరేటింగ్ పై ఆసక్తి ఉండి, మన లక్ష్యాల పట్ల చిత్తశుద్ది కలిగిన వ్యక్తులు ముందుకు రాగలరు. అలాగే మోడరేటర్ల మధ్య సరైన
సమన్వయం ఉండాలి. ఒకరికొకరు తరచూ సంప్రదించుకుంటూ తమ మధ్య అభిప్రాయ బేధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇక్కడ ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదు, అందరం సమానమే. కలిసి కష్టపడదాం, కలిసి నాలెడ్జ్ ని షేర్ చేద్దాం.
http://computerera.co.in/chat అనే "సాంకేతిక సహాయం" ఛాట్ రూమ్ లో ప్రశ్నలు అడిగేవారు ఎక్కువయ్యారు, సమాధానాలు చెప్పేవారు తక్కువయ్యారు అన్న ప్రస్తావన వచ్చి, వీలైన వారందరూ రోజులో కొద్దో గొప్పో సమయం అక్కడ స్పెండ్ చేస్తూ ఇతరులకు సాయపడదామని నిర్ణయించుకోవడం జరిగింది. మీటింగ్ కి హాజరు అవలేకపోయిన మిగిలిన పాఠకులు కూడా మీకు వీలైన సమయాల్లో ఆ ఛాట్ రూమ్ లో గడుపుతూ మీ సందేహాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకు కాస్త సాయపడండి. మనం ఎంత సాయపడితే మనకు అంత సాయం లభిస్తుంది. అలాగే ఛాట్ రూమ్ ని సందర్శించే సభ్యులకు ఇల్లీగల్ సమాచారం, హ్యాకింగ్ వంటి పద్ధతుల గురించి అడగవద్దని, ఒకే మెసేజ్ ని పలుమార్లు కాపీ పేస్ట్ చేసి స్పామ్ చేయవద్దని, ఇలా పలు అంశాల విషయమై ఓపికగా గైడ్ చేయవలసి ఉంటుంది. అందరినీ మనలో కలుపుకుపోవాలి కానీ విసుక్కుని ఎవరినీ దూరం చేసుకోకూడదు.
అలాగే ఛాట్ రూమ్ లో ఇప్పటికే పరిష్కరించబడిన సమాధానాలను గిరిచంద్ గారు (అహ్మదాబాద్) ఛాట్ లాగ్ ల ఆధారంగా ప్రశ్న, సమాధానాలను ఓ క్రమపద్ధతిలో అమర్చుతున్నారు. దానిని అటు ఫోరంలో FAQలుగా ప్రచురించడంతోపాటు ఛాట్ లో ఇతరుల సమస్యలను పరిష్కరించే ప్రతీ వ్యక్తీ వద్ద ఓ కాపీ ఉంచుకునేలా ఏర్పాటు చేయాలి.
నాగభూషణం (వరంగల్) గారు Free Software Foundation వంటి సంస్థలతో వాటి నిర్వాహకులు కిరణ్ చంద్ర వంటి వారిని కలవడం ద్వారా అవగాహన కుదుర్చుకుంటే నాలెడ్జ్ ని అందరికీ చేరవేసే మన లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించవచ్చని సూచించారు. ఈ విషయమై మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఉచిత సాఫ్ట్ వేర్ల వాడకం విషయమై మనం మన సర్కిల్ లో మోటివేషన్ తీసుకురావడం ద్వారా వారి ఉద్యమానికి మన వంతు సాయపడుతూ.. మనం చేస్తున్న ప్రయత్నాలకు వారి సహకారాన్ని ఆసరాగా తీసుకోవచ్చు.
ఇంకా ఎన్నో అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సమయం ఎలా గడిచిపోయిందో తెలియదు కానీ.. చీకట్లు ముసురుకోవడం, వణికించే చలితో మాటలు రాకపోవడం, అప్పటికే 7 గంటలు అవడం వల్ల ఎవరికీ వెళ్లాలని అన్పించకపోయినా కదలక తప్పలేదు. మెల్లగా ముచ్చట్లు చెప్పుకుంటూ క్యాంటీన్ వరకూ వెళ్లి మిర్చి బజ్జీ, టీలతో కొద్దిగా శరీరాన్ని వెచ్చబరుచుకుని ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకున్నాం.
ఆడియో నివేదిక:
ఈ సమావేశానికి డిజిటల్ కెమెరా అందుబాటులో లేకపోవడం వల్ల ఫొటోలు తీయడానికి వీలుపడలేదు. అలాగే సెల్ కెమెరాతో వీడియో తీద్దామన్న ఆలోచన వచ్చేసరికి చీకటి పడిపోయింది. లాప్ టాప్ లో రికార్డ్ చేసిన ఆడియో ఏ కారణం చేతనో ఓవర్ లాప్ అయిపోయి ఒకేసారి రెండు వాయిస్ లు వస్తున్నాయి. అందుకే ఇంత వివరంగా మీటింగ్ రిపోర్ట్ ని రాయడం జరిగింది. దాదాపు ఓ ముప్పావు గంట వరకూ ఆడియో రికార్డ్ చేయగలిగాం. దానిని ఒకటి రెండు రోజుల్లో ఇదే పోస్ట్ లో ప్రచురించడం జరుగుతుంది.
గమనిక: ఈ సమావేశం గురించి, ఇందులో చర్చించబడిన అంశాల గురించి మీ అభిప్రాయాలను, సూచనలను సైతం ఇక్కడ పంచుకోగలరు.
- నల్లమోతు శ్రీధర్
5 కామెంట్‌లు:
నివేదిక సవివరంగా రాశారు. మీ యువబృందం ఉత్సాహము చూస్తే ముచ్చటేస్తున్నది. మీ కర్యకలాపాలు దిగివ్జయంగా కొనసాగాలని అభిలషి్స్తూ ..
కంప్యూటర్ ఎరా రెండవ సమావేశానికి హాజరైన మిత్రులందరికి మరియు ముఖ్యంగా దూరప్ర్రాంతాలనుండి వచ్చిన శివరామ ప్రసాద్, నాగభూషణం గార్ల కు అభినందనలు.
మనం చేస్తున్న ఈ కార్యకలాపాలను మరింత మంది దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉపయోగపడేలా చేయాలంటే ముందుగా ఒక పేపరు (Pam Plate) తయారు చేయండి. దానిలో మన కార్యక్రమాలు వివరించండి. దానిని దగ్గరలో ఉన్న పాఠశాలకు , కాలేజిలకు పంచుదాం. ముందుగా వారికి ఒక అవగాహన కలిగించి తరువాత సెమినార్లు నిర్వహిస్తే బాగుంటుంది. ఇది ఒక ఆలోచన మాత్రమే.
మీరు సమావేశంలో చాలా మంచి అంశాలు చర్చించారు. వాటిని అమలు చేద్దాం.
వర్మ దాట్ల
కొత్త పాళీ గారు మీ ఆశీస్సులు మాకెల్లప్పుడూ కావాలి. మీ ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు.
వర్మ దాట్ల గారు మీ ఆలోచన చాలా బాగుంది. సమావేశంలో చర్చించిన ప్రతీ అంశాన్ని బాధ్యతగా ఒకటొకటిగా అమలుపరుద్దాం.
- నల్లమోతు శ్రీధర్
కంప్యూటర్ ఎరా రెండవ పాఠకుల సమావేశ నివేదికలోని సూచనలు బాగున్నాయి. ముఖ్యంగా తరచూ ఛాట్ రూమ్ లో తీర్చే సందేహాలను ఫోరంలో వివరంగా పోస్టులుగా రాసి, ఇకపై అవే సందేహాలు ఛాట్ రూమ్ లో మళ్లీ మళ్లీ అడగబడుతుంటే ఫోరంలోని సంబంధింత లింక్ ని ఇస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన చాలా బాగుంది.
అలాగే అలాగే ఛాట్ రూమ్ లో ఇప్పటికే పరిష్కరించబడిన సమాధానాలను గిరిచంద్ గారు (అహ్మదాబాద్) ఛాట్ లాగ్ ల ఆధారంగా ప్రశ్న, సమాధానాలను ఓ క్రమపద్ధతిలో అమర్చుతున్నారు. దానిని అటు ఫోరంలో FAQలుగా ప్రచురించడంతోపాటు ఛాట్ లో ఇతరుల సమస్యలను పరిష్కరించే ప్రతీ వ్యక్తీ వద్ద ఓ కాపీ ఉంచుకునేలా ఏర్పాటు చేయాలి అనే సూచన కూడా బాగుంది. కానీ ప్రతీ వ్యక్తీ వద్ద ఓ కాపీ ఉంచుకునేలా ఏర్పాటు చేయాలి అన్నారు. దాని గురించి కొంచెం వివరాలు తెలియజేస్తే అందరికీ ఉపయోగంగా ఉండటమే కాకుండా ప్రతివారూ మరొకరికి సహాయపడటానికి వీలవుతుంది.
రామకృష్ణ
Hello Sridhar Garu,
Congratulations on your successful meeting. I was very eager to attende the meeting but omehow I could't come. The suggestions give by ome members are very good. I will alos contribute myself to CERA. Becoz you are my first computer guru.
Ganesh Gollapelli
9949773788
కామెంట్‌ను పోస్ట్ చేయండి