21, జనవరి 2008, సోమవారం

సిస్టమ్ క్రాష్ ...



మనం కంప్యూటర్లో ఎప్పటికప్పుడు అత్యంత విలువైన సమాచారం స్టోర్ చేస్తుంటాము.ఈ నేపధ్యంలో దాన్ని బ్యాకప్ తీసుకోవడం మరిచిపోయినప్పుడు ఒక్కసారిగా హార్డ్ డిస్క్ క్రాష్ అయితే పరిస్థితి ఏమిటి? కనీసం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి వెళ్ళగలిగితే... Recover my files, GetDataback వంటి సాఫ్ట్ వేర్లని ఉపయోగించి డిలీట్ అయిన ఫైళ్ళని/పార్టీషన్లని తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. అయిటే విండోస్ కూడా బూట్ అవని విధంగా సిస్టం క్రాష్ అయినప్పుడు ప్రత్యామ్నాయమార్గం చూసుకోవలసిందే కదా!!



సిస్టం ఎందుకు క్రాష్ అవుతుంది...

సహజంగా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కరెంట్ పోవడం వంటి సందర్భాల్లో హార్డ్ డిస్క్ క్రాష్ అయి కనీసం ఆపరేటింగ్ సిస్టమ్‌లోకి కూడా బూట్ అవని పరిస్థితి ఏర్పడుతుంది. దీనితో యూజర్ హార్డ్ డిస్క్‌లో తాను స్టోర్ చేసుకున్న ముఖ్యమైన సమాచారాన్ని కూడా యాక్సెస్ చేయలేకపోతాడు. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. హార్డ్ డిస్క్/ఆపరేటింగ్ సిస్టమ్ క్రాష్ అయినంతమాత్రాన "మనం డేటాని నష్టపోయాము, ఇక అది తిరిగిరాదు" అని భయపడాల్సిన పని లేదు. వాస్తవానికి డిస్కుపై డేటా సురక్షితంగానే ఉంటుంది. కేవలం ఆ డేటాని యాక్సెస్ చేయడానికి కావలసిన ఆపరేటింగ్ సిస్టమ్‌ని మాత్రమే మనం నష్టపోవడం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేకమైన క్రాష్ రికవరీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించడం ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిలేకుండా మీ హార్డ్ డిస్క్ నుండి డేటాని రికవర్ చేసుకోవచ్చు.


RecoverSoft Data Rescue

సిస్టమ్ క్రాష్ అయి కనీసం విండోస్ కూడా బూట్ అవనప్పుడు డేటాని రికవర్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేర్ Recovery Soft Data Rescue PC.Win XP, 2003లపై మాత్రమే పనిచేసే ఈ సాఫ్ట్ వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే సిడి రైటర్‌లో ఖాళీ సిడిని ఇన్‌సర్ట్ చేయమని కోరుతుంది. ఇన్‌సర్ట్ చేసిన వెంటనే ఒక బూటబుల్ సిడిని ఈ సాఫ్ట్ వేర్ తయారు చేస్తుంది.ఇక మన సిస్టమ్ క్రాష్ అయినప్పుడు సింపుల్‌గా ఆ బూటబుల్ సిడితో సిస్టమ్‌ని బూట్ చేయవలసి ఉంటుంది.హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసేలా మనం ఆప్షన్‌ని ఎంచుకున్న వెంటనే ఈ ప్రోగ్రామ్ హార్డ్ దిస్క్‌లోని అన్ని ఫైళ్ళ వివరాలనూ జాబితాగా చూపిస్తూ ప్రతీ ఫైల్‌కీ Excellent, Good, Possible, Poor అనే విధంగా రేటింగులు ఇస్తుంది. Excellent కండీషన్‌లో ఉన్న ఫైళ్ళు తప్పకుండా రికవర్ అవుతాయి. Good,Poossible కండిషన్‌లో ఉన్న ఫైళ్ళపై కూడా నమ్మకం పెట్టుకోవచ్చు. ఎటొచ్చి మీ ఫైళ్ళు Poor కండీషన్‌లో ఉంటే అవి రికవర్ అవడం కష్టం! రికవర్ చెయ్యదలుచుకున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ ఫైల్‌ని ఏ పార్టీషన్ పైకి రికవర్ చేయాలో ఎంచుకోవాలి. ఒకవేళ మీ వద్ద USB Flash మెమరీ కార్డ్‌లు ఉంటే వాటిపైకి డేటా రిజ్కవర్ అయ్యే విధంగా కూడా ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. అయితే ఈ సాఫ్ట్ వేర్‌తో ఉన్న ప్రధానమైన సమస్య రికవర్ చేసిన డేటాని NTFS ఫైల్ సిస్టమ్‌లో ఉన్న పార్టీషన్లపైకి రికవర్ చెయ్యడానికి వీలుపడదు.

Ontrack EasyRecovery Lite
ఈ సాఫ్ట్ వేర్ కూడా సిస్టమ్‌ని బూట్ చేసి, హార్డ్ డిస్క్‌ని స్కాన్ చేసి రికవర్ అవగలిగిన ఫైళ్లని G (Good) అనే రేటింగుతోను, రికవర్ అవడానికి వీలుపడని ఫైళ్లని D(Deleted) అనే రేటింగుతోనూ చూపిస్తుంది. ఫ్లాపీ,జిప్ డ్రైవ్ వంటి అన్ని రకాల మీడియాపైకి రికవర్ చేసిన డేటాని కాపీ చేసుకోవడానికి ఈ సాఫ్ట్ వేర్ వీలుకల్పిస్తుంది. అయితే ఇంటర్‌నెట్‌పై ఫ్రీగా లభించే ఈ Lite వెర్షన్ ఒకసారికి కేవలం 25 ఫైళ్ళని మాత్రమే రికవర్ చేయగలుగుతుంది. క్రాష్ రికవరీ సదుపాయంతో పాటు పొరబాటున మనం డిలీట్ చేసిన ఫైళ్ళని రికవర్ చేసుకోవడానికి అలాగే ఫార్మేట్ చేయబడిన పార్టీషన్ల నుండి డేటాని రికవర్ చేయడానికి ఈ సాఫ్ట్ వేర్‌లో ఆప్షన్లు లభిస్తున్నాయి.

కామెంట్‌లు లేవు: